అనువాద (డబ్బింగ్) సినిమాలు, రీమేక్‌లు తెలుగువారికి కొత్త కాదు. సినిమా పుట్టినప్పటినుంచి ఈ రెండు ప్రక్రియలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగులో తీసిన కొన్ని సినిమాలు తమిళంలోకో, హిందీలోకో రీమేక్ అయిన తరువాత దాన్నే మళ్లీ తెలుగులోనూ తీసిన దాఖలాలూ ఉన్నాయి. తెలుగులోకి ఎక్కువ అనువాదమయ్యే సినిమాల్లో తమిళ సినిమాలదే అగ్రస్థానం. తెలుగుకు-తమిళానికి చాలా విషయాల్లో అవినాభావ సంబంధం ఉందనే సంగతి తెలిసిందే. కన్నడ, మళయాళం, హిందీ సినిమాలు రీమేక్ చేస్తుంటారు.
దాదాపు అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మిస్తున్నప్పటికీ తెలుగువారికి ఎక్కువగా తెలిసింది హిందీ, తమిళ సినిమాలే. భోజ్‌పురి వంటి భాషలు అసలు మనకు పరిచయం లేనివి. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బిహార్, జార్ఖండ్, నేపాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో వాడుకలో ఉన్న భోజ్‌పురి హిందీకి దగ్గరగా ఉంటుంది. గతంలో ఒకరో ఇద్దరో తెలుగు హీరోయిన్లు ఈ భాషా సినిమాల్లో నటించిన దాఖలాలున్నాయి. ఈ భాషలో ఈమధ్య నిర్మించిన ఓ సినిమా తెలుగు డబ్బింగ్ చిత్రంగా రాబోతోందని సమాచారం.
ఇది ఆ సినిమా నిర్మాతలు చెప్పిన విషయమే. ఈ సినిమాను పలు భారతీయ భాషల్లోకి అనువదించబోతున్నారు. అందులో తెలుగుతోపాటు తమిళం, బెంగాలీ, మరాఠి కూడా ఉన్నాయి. ఇన్ని భాషల్లోకి అనువదించాల్సిన ప్రత్యేకత ఈ సినిమాలో ఏముంది? ఏముందంటే…ఇది తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా గొప్ప ఇమేజ్ తెచ్చిన 'బాహుబలి' మాదిరిగా ఉంటుందని సమాచారం. అసలు బాహుబలినే భోజ్‌పురిలో రీమేక్ చేశారా? అనే అనుమానముంది. ఈ సినిమా పేరు 'వీర్ యోధ మహాబలి'. బాహుబలి టైటిల్‌కు ఇది దగ్గరగా ఉండటమే కాదు, ఉచ్చారణ కూడా తెలుగు సినిమాను తలపిస్తోంది.
పోస్టర్లు కూడా బాహుబలి పోస్టర్ల మాదిరిగానే ఉన్నాయి. ఈ పోస్టర్లలోని హీరో ప్రభాస్ ఫోజుల్లోనే ఉన్నాడు. చూడగానే బాహుబలి సినిమాయే కళ్లముందు ఉంటుంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఈమధ్యే విడుదల చేశారు. బాహుబలినే రీమేక్ చేశారా, లేదా అనే విషయం సినిమా విడుదలైతేగాని తెలియదు. భోజ్‌పురి సినీ పరిశ్రమలో టాప్‌స్టార్ దినేష్‌లాల్ యాదవ్ టైటిల్ పాత్ర పోషించారు. చిత్రానికి ఇక్బాల్ బక్ష్ దర్శకుడు కాగా, రమేష్ వ్యాస్ నిర్మాత. తెలుగు బాహుబలిని వందల కోట్ల ఖర్చుతో చాలా రిచ్‌గా నిర్మించారు. ఇది ఏస్థాయిలో ఉందో సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది.