‘భయో’ డేటా : ‘కలహ’ నాథన్‌

పేరు            : సి.ఆర్‌. కమలనాథన్‌ Advertisement దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘ఉద్యోగం’ అన్నా, ‘ఉద్యోగుల’న్నా భయం పుట్టింది. ఇప్పటి విశ్రాంత ఐయ్యేఎస్‌ అయి వుండి కూడా ఉద్యోగం చేస్తున్నాను. నేను చేసిన…

పేరు            : సి.ఆర్‌. కమలనాథన్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘ఉద్యోగం’ అన్నా, ‘ఉద్యోగుల’న్నా భయం పుట్టింది. ఇప్పటి విశ్రాంత ఐయ్యేఎస్‌ అయి వుండి కూడా ఉద్యోగం చేస్తున్నాను. నేను చేసిన అన్ని ఉద్యోగాల కన్నా, ఉద్యోగులను విడగొట్టే ఉద్యోగం అన్నింటి కన్నా ప్రమాదకరమైన ఉద్యోగం. కాబట్టి నేను దరఖాస్తు చేసే ఉద్యోగం ఒక్కటే: నిరుద్యోగి.

ముద్దు పేర్లు        : ‘కలహ’ నాథన్‌. ( ఉమ్మడి రాష్ట్ర ఉద్యోగులను ఎలా విభజించినా ఏదో కలహం వస్తుంది. ‘ఆప్షన్‌’ ఇస్తే ఒకరికి కోపం ‘ఆప్షన్‌’ ఇవ్వకుంటే మరొకరికి కోపం.) ఈ కమిటీ చైర్మన్‌ కన్నా, విడాకులిప్పించే లాయర్‌ గా ప్రాక్టీసు చేసుకున్నా, కాస్త పేరన్నా మిగిలేది. 

‘విద్యార్హతలు        : ‘అయ్యా’ ఎస్‌ కాదు, ‘అయ్యో’ ఎస్‌ కాదు. కేవలం ‘ఐయ్యేఎస్‌’. కానీ చాలా మంది నన్ను ‘ఐ.ఇ.ఎస్‌’ ( ఇండియన్‌ ఎక్స్‌ టెన్షెన్‌ సర్వీస్‌) ఏమో అనుకుంటారు. ఎందుకంటే రిటయిరయ్యాక కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ‘విజిలెన్స్‌ కమిషనర్‌’ అయిదేళ్ళ పాటు చేసి, నా సర్కారీ కొలువును అయిదేళ్లు పొడిగించుకోగలిగాను. 

హోదాలు    : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో ఏ హోదా మిగలదు. కేవలం నారదుడికి వుండే హోదా ఒక్కటే దక్కుతుంది. అదే ‘కలహ భోజనుడు’. కమలనాథన్‌ కమిటీ చేసే ఉద్యోగుల విభజన ద్వారా నాకేం మిగులుతుంది చెప్పండి..కలహం తప్ప.

గుర్తింపు చిహ్నాలు    :ఒకటి: చికాకులో వున్నా చిరునవ్వు తొణకదు. కాబట్టి నేను చిరునవ్వు నవ్వినా, చిందులు తొక్కినా ఒకేలా వుంటుంది. 
                           రెండు: రిటయిరయిన ఐయ్యేఎస్‌ అధికారిని అంటే ఎవరూ నమ్మరు. నిత్య యవ్వనుణ్ణి. 

సిధ్ధాంతం        :  తామరాకు మీద నీటి బొట్టు సిధ్ధాంతం. అంతటా తిరుగుతాను. ఏదీ ఒంటికి పట్టించుకోను. నాలాంటి వాడికే ఇలాంటి కమిషన్‌లు అప్పగిస్తారు.

వృత్తి            :  నాన్చటం. సర్కారీ కొలువు అంటేనే నాన్చే వృత్తిని చేపట్టటం అవుతుంది. 

హాబీలు            :1. ‘డిటెక్టివ్‌ కథలు’ రాయాలనుకునే వాడిని. కానీ ఇలా కమిషన్‌ నివేదికలు రాసుకుంటున్నాను. కానీ దాని ప్రభావం చూసే వుంటారు. ఇప్పటికీ ఉద్యోగుల పంపిణీలో సస్పెన్స్‌ కొనసాగిస్తూనే వున్నాను. 

                      2.సలహాలు ఇవ్వటం. కానీ ‘ఉచిత సలహాలు’. సలహా పుచ్చుకున్న వారు తగిన ‘మూల్యం చెల్లించాల్సిందే’. సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ వారు చెల్లించటం లేదూ..? అలాగన్నమాట.

అనుభవం        :తెలుగు వారికి పరభాషా సహనం ఎక్కువ. ఇతర భాషల వాళ్ళను భరిస్తారు. ఎటొచ్చీ సాటి తెలుగువాళ్ళనే భరించలేరు. కాబట్టి అవసరమయితే ఇతర భాషల వారికి ఉన్నత పదవులిచ్చినా ఊరుకుంటారు కానీ, సాటి తెలుగువాడికిస్తే ఊరుకోరు. అందుకే తెలుగు ఉద్యోగుల విభజన ఇంత కష్టమయ్యింది. 

మిత్రులు        : ఉన్నారు. ఎక్కువ మంది ‘కుర్చీల్లో’ కన్నా మంచి ‘పడక కుర్చీల్లో’ నే కూర్చున్నారు. ఎప్పుడో 1965 బ్యాచ్‌ వాణ్ని కదా!

శత్రువులు         : ఇంత వరకూ లేరు. ఇక నుంచి అవుతారు. ఎందుకంటే, స్థానికత, సీనియారిటీ వీటిని గణించే విషయంలో ఇప్పటికే చాలా మందికి కోపం వచ్చింది. రోజుకు కనీసం ఓ వంద మంది అయినా నిరసన తెలుపుతున్నారు. 

మిత్రశత్రువులు    : నా ప్రతిపాదనలను నా ముందు ఒప్పుకుని, బయిటకు వెళ్లగానే నేను ఏకపక్షంగా వ్యహరించానని ఆరోపించే ఉద్యోగ సంఘాల నాయకులు.

వేదాంతం        : ‘విభజించి పాలించటం’ సులువే. కానీ ‘పాలించే వారిని విభజించటమే’ కష్టం. 

జీవిత ధ్యేయం  : నిజమైన విశ్రాంత ఉద్యోగిగా, ఉద్యోగులకు దూరంగా హాయిగా జీవించటం.  

-సర్‌