విద్య తెలంగాణీకరణ…!

మీడియాలో తరచుగా ఇస్లామీకరణ, తాలిబానీకరణ అనే పదాలు కనబడుతుంటాయి. ఇస్లామీకరణ అంటే ప్రతిదీ ఇస్లాం ప్రకారం ఉండటం లేదా దానికి అనుగుణంగా రూపాంతరం చెందటం. తాలిబానీకరణ అంటే తాలిబన్లు తమ విధానాలకు, ఆలోచనలకు అనుగుణంగా…

మీడియాలో తరచుగా ఇస్లామీకరణ, తాలిబానీకరణ అనే పదాలు కనబడుతుంటాయి. ఇస్లామీకరణ అంటే ప్రతిదీ ఇస్లాం ప్రకారం ఉండటం లేదా దానికి అనుగుణంగా రూపాంతరం చెందటం. తాలిబానీకరణ అంటే తాలిబన్లు తమ విధానాలకు, ఆలోచనలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడం. ఈ విధంగానే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ‘తెలంగాణీకరణ’ అనేది ఎక్కువగా కనబడుతోంది. వినబడుతోంది. ప్రతి అంశమూ తెలంగాణీకరణ కావాలని, దశాబ్దాలుగా ఆంధ్ర పాలకుల పెత్తనం కింద నలిగిపోయిన తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని, దాన్ని సరిదిద్దుకోవాలంటే తెలంగాణీకరణ జరగాలని ఆ రాష్ట్ర మేధావులు, విద్యావంతులు, కళాకారులు, కవులు గట్టిగా చెబుతున్నారు. తెలంగాణీకరణ కోసం చర్చలు జరుగుతున్నాయి. మీడియాలో వ్యాసాలు రాస్తున్నారు. మేధోమథనం చేస్తున్నారు. ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా విద్యా రంగంలో తెలంగాణీకరణ జరగాలని కవులు, కళాకారులు, విద్యావంతులు కోరుతున్నారు. 

భాష మీదా దాడిజేస్తిరి….

తెలంగాణ ఉద్యమంలో నీరు, నిధులు, నియామకాల్లో వివక్షను ఎత్తిచూపడమే కాకుండా, తెలంగాణ భాషకు అన్యాయం జరిగిందని, ఆంధ్ర పాలకులు దాన్ని అణగదొక్కారని నాయకులు, తెలంగాణవాదులు ఆరోపించారు. రెండు మూడు ఆంధ్రా జిల్లాల తెలుగునే ప్రామాణికంగా నిర్ధారించి, దాన్నే అసలైన తెలుగుగా తెలంగాణ ప్రజల మీద రుద్దారని అన్నారు. తెలంగాణవారి బతుకుల మీదనే కాకుండా భాష మీద కూడా ఆంధ్రవారు దాడి చేశారని మండిపడ్డారు. సినిమాల్లో తెలంగాణ భాషను అపహాస్యం చేశారని, అది రౌడీలు, గూండాలు మాట్లాడే భాషగా చిత్రీకరించారని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరది కాబట్టి తెలంగాణ భాషకు పట్టం కట్టాలని, దానికి వైభవం తీసుకురావాలని విద్యావేత్తలు, కవులు, కళాకారులు ఆకాంక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలది తెలుగు భాష అని, తెలంగాణవారిది తెలంగాణ భాష అని అంటున్నారు. తెలంగాణ ఓ మాండలికమంటే ఒప్పుకోవడంలేదు. భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నదాని ప్రకారం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ప్రజలందరిదీ తెలుగు భాషే. దాంట్లో అనేక మాండలికాలున్నాయి. ఆ లెక్కన తెలంగాణలోని తెలుగు కూడా మాండలికమే. ఆంధ్రలోని కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల తెలుగునే ప్రామాణిక తెలుగుగా అమలు చేస్తున్నట్లు కొన్ని పాఠ్యపుస్తకాల్లో పేర్కొన్నది నిజమే. ఇంతకాలం ఉమ్మడి రాష్ట్రంలో అదే అమల్లో ఉంది. ఒకటి నుంచి మొదలుకొని డిగ్రీ వరకూ ఆ ప్రామాణిక తెలుగులోనే పాఠ్యపుస్తకాలు రూపొందాయి. ప్రజలు వారివారి జిల్లాల మాండలికాల్లో మాట్లాడుకున్నప్పటికీ రాత వరకు వచ్చేసరికి ప్రామాణికమైన తెలుగులోనే రాస్తున్నారు. ఈ పరిస్థితి మారాలని తెలంగాణవాదులు చెబుతున్నారు. పాఠ్యపుస్తకాలు తెలంగాణలోనే ఉండాలని, తెలంగాణ భాషలోనే రాయాలని తెలంగాణవాదులు చెబుతున్నారు. 

పాఠ్యపుస్తకాలు తెలంగాణ భాషలోనే…

కేజీ టూ పీజీ తెలుగు మీడియం పుస్తకాలు, తెలుగు వాచకాలు తెలంగాణ భాషలో ఉండాలని విద్యావంతులు, తెలంగాణవాదులు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ఆంధ్ర జిల్లాల ప్రామాణిక భాష ఎందుకని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ భాషలోనే పాఠ్యపుస్తకాలు ఉండాలంటూ తెలంగాణలోని ప్రముఖ కవి బిఎస్‌ రాములు కొంతకాలం క్రితం ఓ వ్యాసం రాశారు. తెలంగాణ భాషలో పాఠ్యపుస్తకాలను ఎలా రూపొందించాలో ఆయన ‘ప్రణాళిక’ను వివరించారు. ఇప్పుడున్న పాఠ్యపుస్తకాలను సమూలంగా మార్చాలనేది తెలంగాణవాదుల అభిప్రాయం. ఇప్పుడు అమల్లో ఉన్న ప్రామాణిక తెలుగులోని పదాలన్నీంటికీ సమానమైన తెలంగాణ పదాలను సేకరించి నిఘంటువు (డిక్షనరీ) రూపొందించడమే కాకుండా వాటిని పాఠ్యపుస్తకాల్లో వాడాలంటున్నారు. బిఎస్‌ రాములువంటివారు చెబుతున్నదాని సారాంశం ఏమిటంటే….తెలంగాణ భాషలో అచ్చ తెలుగు పదాలు ఎక్కువగా ఉన్నాయి. అది నేర్చకోవడం సులభం. అలాగే తెలంగాణ భాషను పాఠ్యపుస్తకాల, పత్రికల ద్వారా విస్తృతం చేయాలి. కథలు, కవితలు, పాటలు…ఇలా విస్తృతమైన సాహితీ సంపద పెరగాలి. ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లోనూ తెలంగాణ భాషలో పాఠ్యపుస్తకం తప్పనిసరిగా ఉండాలి. 

ప్రామాణిక భాష రూపొందించాలి

ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రామాణిక భాష ఆంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగు. ఇది తెలంగాణకు పనికిరాదు. తెలంగాణ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కాబట్టి దానికి ఓ ప్రామాణిక భాష అవసరం. తెలంగాణలోని పది జిల్లాల్లో మాట్లాడే తెలుగును తెలంగాణ భాష అని చెప్పుకుంటున్నప్పటికీ ఒక్కో జిల్లాల్లో ఒక్కో యాస ఉంటుంది. అది అక్కడి స్థానిక భాష. నల్గొండ జిల్లాలోని తెలుగు, ఆదిలాబాద్‌ జిల్లాలోని తెలుగు ఒక్క తీరుగా ఉండవు. కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లోని తెలుగుకు పొంతన ఉండదు. ఇలాంటప్పుడు తెలంగాణ భాషలోనే పాఠ్యపుస్తకాలు తయారుచేయాలంటే తెలంగాణ ప్రజలందరికీ అర్ధమయ్యే ప్రామాణిక భాష ఉండాలి. ముందుగా దీన్ని తయారుచేసుకోవాలి. ఇదో బృహత్‌ కార్యక్రమం. దీనిపై చర్చలు జరుపుతున్నారు. బిఎస్‌ రాములు చెబుతున్నదాని ప్రకారం…ప్రామాణిక భాష రూపొందించుకోవడానికి జిల్లాల వారీగా తెలంగాణ భాషాభివృద్ధి కమిటీలు వేయాలి. ఆ కమిటీల కింద మండల కమిటీలు, సబ్‌ కమిటీలు వేయాలి. ఈ కమిటీలు ఐదేళ్లలోపు పిల్లలు నేర్చుకునే పదాలను రికార్డు చేయాలి. వాళ్ల భాష, భావాలు, నైపుణ్యాలు, వాక్య నిర్మాణం మొదలైనవి రికార్డు చేయాలి. గ్రామీణ, పట్టణ, పేద, మధ్యతరగతి, అగ్రకుల, బహుజనుల భాషను, సంస్కృతిని సేకరించాలి. సేకరించిన మొత్తం వివరాలను ఆయా జిల్లా భాషగా రూపొందించాలి. ఇలా జిల్లాల వారీగా భాషను రూపొందించిన తరువాత ప్రామాణిక భాషను రూపొందించడానికి కృషి చేయాలి. దీన్ని అనుసరించి కొత్త వ్యాకరణ సూత్రాలు రూపొందించాలి. 

జనం భాష సేకరించాలి

ఐదేళ్ల కాలాన్ని ప్రామాణికంగా తీసుకొని జనం భాషను సేకరించాలని అంటే దాన్ని రికార్డు చేయాలనేది తెలంగాణ విద్యావంతులు చెబుతున్నారు. ఇలా భాషను సేకరించి ఒకటో, రెండో తరగతి తెలుగు వాచకాలు రూపొందించాలట. ఇక ఆరేళ్ల నుంచి పదకొండేళ్ల వరకు, పదకొండో ఏట నుంచి పదిహేనో ఏట వరకు, పదిహేను నుంచి ఇరవయ్యో ఏట వరకు, ఇరవై నుంచి ఇరవై అయిదో ఏట వరకు బాల బాలికల, యువతీ యువకుల, నిరక్షరాస్యుల, విద్యావంతుల, గ్రామీణుల, పట్టణ ప్రాంతాల వారి తెలంగాణ భాషను ప్రత్యేకంగా రికార్డు చేయాలంటున్నారు. ఇలా సేకరించిన భాషనంతా క్రోడీకరించి, సమన్వయపరచి ఒకటి నుంచి పీజీ వరకు ప్యాపుస్తకాల్లో ఉపయోగించాలట. ఈ విధంగా చేస్తే తెలంగాణ భాషకు ఓ ప్రామాణిక భాష ఏర్పడుతుందని చెబుతున్నారు. 

నిఘంటువులు తయారుచేయాలి

ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ఇంగ్లీషు`తెలుగు నిఘంటువు (డిక్షనరీ)ల్లో  ఇంగ్లీషు పదాలకు అర్థాలు సంస్కృత పదాలు, కోస్తాంధ్రలో వాడే పదాలు ఉన్నాయి కాబట్టి ఇంగ్లీషు పదాలకు తెలంగాణ పదాలతో కూర్చిన నిఘంటువులు తయారుచేయాలని తెలంగాణవాదులు కోరుతున్నారు. ఇలా తయారుచేసిన పదాలను పత్రికల్లో, పాఠ్యపుస్తకాల్లో విరివిగా వాడి ప్రాచుర్యం కల్పిస్తే భావి తరాలవారికి ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పుడున్న వ్యాకరణ సూత్రాలు పనికిరావని, జనం భాష ఆధారంగా కొత్త వ్యాకరణం తయారుచేసుకోవాలంటున్నారు. తెలంగాణ భాషకు వ్యాకరణం తయారుచేసేందుకు పండితులతో ప్రత్యేకంగా కమిటీ వేయాలని, తెలంగాణ భాషపై సంస్కృత ప్రభావం  లేకుండా చూడాలని అంటున్నారు. భాషను సంస్కరించే పని వచ్చే ఐదేళ్లలో జరగాలట. అలాగే తెలంగాణలో ఉన్నవారంతా (ఏ రాష్ట్రానికి చెందినవారైనా) తప్పనిసరిగా తెలంగాణ భాషను అభ్యసించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెలంగాణ భాషను సంస్కరించుకుంటేనే తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందని  తెలంగాణ విద్యావేత్తలు, కవులు, కళాకారులు చెబుతున్నారు.  మీడియాలో తెలంగాణ భాషా ప్రయోగం ఇప్పటికే విఫలమైన నేపథ్యంలో ఈ తెలంగాణీకరణ ఎప్పుడు ప్రారంభిస్తారో, ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం.

-ఎం.నాగేందర్‌