రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నవి పోలీసు పరిథిలోనివి. ఆ పోలీసు శాఖను సమర్థవంతంగా వాడడం అన్నది ప్రభుత్వం నియమించిన కీలక అధికారుల వ్యవహారం. ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్రభుత్వం కానీ, అధికారపక్ష నాయకులు కానీ వ్యవహరించే తీరును బట్టే శాంతి భద్రతలు ఆధారపడి వుంటాయి. నేరాలు, ఘోరాలు అన్నవి జరగుతూనే వుంటాయి.
అని అంత ఎక్కువగా జరుగుతాయి కాబట్టే మీడియాలో ఈ నేరాలు ఘోరాలు రిపోర్ట్ చేయడానికి ప్రత్యేకంగా రిపోర్టర్లు, ప్రత్యేకంగా పేజీలు, ప్రత్యేకంగా విజువల్ మీడియాలో కార్యక్రమాలు. నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి అని కిందా మీదా అయిపోయే మీడియా, మరి వాటి కోసం అంతలా ప్రత్యేక ఏర్పాట్లు ఎందుకో చేయడం.
సరే, ఈ సరదా సంగతి అలా వుంచితే, అంతర్వేది రథం దహన సంఘటన కావచ్చు, పిఠాపురంలో దేవతా విగ్రహాలకు అవమానం జరిగిన సంఘటన కావచ్చు, లేదా ఇంకెక్కడైనా ఇలాంటి మతపరమైన అసహనాలను రేకెత్తించే ఇతరత్రా కార్యక్రమాలు కావచ్చు. అలా అలా సింపుల్ గా దర్యాప్తు చేసి వదిలిపెట్టేసేవి కాదు. వదిలిపెట్టాల్సినవి కూడా కాదు. అందులోనూ ప్రభుత్వంలోని కీలక నేతలు ఒక తరహా మత విశ్వాసాలు కలిగి వున్నారు అని బాహాటంగా తెలిసిన తరువాత మరింత జాగ్రత్తగా వుండాల్సి వుంది.
ఆ మూడే కీలకం
మనదేశంలో కీలక రాజకీయాలు మూడు వ్యవహారాల చుట్టూ తిరుగుతుంటాయి. ఒకటి కులం..రెండు మతం..మూడు ప్రాంతీయం. రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేసేవి ఈ మూడే. మహరాష్ట్ర, తెలంగాణలో ప్రాంతీయ వాదన విపరీతంగా పని చేసింది. ఆంధ్ర లో కులం విపరీతంగా పని చేస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మతం పని చేసిన సందర్బాలు వున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రలో కుల రాజకీయాలు కీలకం అయిపోయాయి. కుల సమీకరణలను బట్టే జయాపజయాలు నిర్దేశమవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రలో వున్న పరిస్థితుల్లో అధికారం కోల్పోయిన పార్టీ కావచ్చు, అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ కావచ్చు ఈ కుల సమీకరణలను నమ్ముకునే వున్నాయి. ఇక అధికారపక్షం సంగతి చెప్పనక్కరలేదు. కానీ అధికారపక్షాన్ని ఇరకాటంలో పెట్టాలన్నా, డిఫెన్స్ లో తోయాలన్నా మిగిలిన ఏకైక ఆప్షన్ మతం. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయం అనే వ్యవహారం సోది లోకి కూడా లేదు కాబట్టి.
ఇక మతమే దిక్కు
అందుకే జగన్ సారథ్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీలయినప్పుడల్లా మతం ఫ్యాక్టర్ ను వాడడం కనిపిస్తూ వుంది. పెరుగుతూ వుంది. కానీ వైకాపా ప్రభుత్వం కానీ, దాని అధినేత కానీ ఈ విషయాన్ని బాగా అంటే బాగా లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. కేవలం పోలీసులకు లేదా సంబంధింత అధికారులకు ఈ వ్యవహారం పరిమితం చేసి ఊరుకుంటే ఫలితం దక్కదు సరికదా, వ్యవహారం వికటించే ప్రమాదం వుంది. మనం సిన్సియర్ గా, సీరియస్ గా వుంటే సరిపోదు..వ్యవహరిస్తే సరిపోదు. ఆ విషయం క్లియర్ గా, క్లారిటీగా కింద లెవెల్ వరకు వెళ్లాలి.
సాధారణంగా అధికారంలో వున్నవారు కన్నా వారిని నమ్ముకున్నవారు ఎక్కువ తప్పులు చేస్తారు. ఎందుకిలా అంటేె మనవారు అధికారంలో వున్నారు కదా అనే ధీమా. మనవాడు వుండగా మనకేంటీ అనే ధైర్యం. మనవాడు చూసుకుంటాడులే అనే భరోసా. మనవాడు అనేవాడు అధికారంలోకి వచ్చాక వచ్చే ఆలోచన ఎలా వుంటుందీ అంటే..ఇదే సరైన టైమ్. ఇప్పుడే చకచకా చక్కబెట్టుకోవాలి అనే వుంటుంది సదా. ఆ గాబరాలోనే తప్పులు చేస్తారు. ఆ ధైర్యం, భరోసాతోనే తొందరపడి మరిన్ని తప్పలు చేస్తారు.
ఆంధ్రలో అదే జరుగుతోందేమో? అనుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర కన్నా తెలంగాణలో మతం కార్డు వాడడానికి ఎక్కువ అవకాశం వుంది. దాదాపు కొన్నేళ్ల పాటు మత ఘర్షణలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది హైదరాబాద్. అలాంటిది ఈ సిఎమ్, ఆ సిఎమ్ అని కాకుండా అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి, మత ఘర్షణలు అన్నవి చరిత్రగా మారిపోయేలా చేసారు. కేసిఆర్ కూడా తను బలమైన హిందూ వాది అని చేతలు, మాటలతో నిరూపించుకుని ప్రతిపక్షాలకు హిందూ ఓటు బ్యాంక్ ను రెచ్చగొట్టే అవకాశం లేకుండా చేసారు.
జగన్ జాగ్రత్త
నిజానికి కేసిఆర్ కన్నా జగన్ నే ఎక్కువ జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుంది. ఎందుకంటే జగన్ మీద క్రిస్టియన్ అనే ముద్ర బలంగా వేసారు. కానీ అదే సమయంలో ఆ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ కోసం కిందామీదా పడి, నా పెళ్లా పిల్లలు క్రిస్టియన్లు అని చెప్పుకునేవారు కూడా వున్నారు. వారి సంగతి అలా వుంచితే జగన్ క్రిస్టియన్ మత విశ్వాసాలు పాటించే నాయకుడే అయినా, హిందూ ఆలయాలు, వాటి పాలనా నిర్ణయాలు వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వుంటూ వస్తున్నారు. చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయినా కూడా హిందూ ఓటు బ్యాంక్ ను జగన్ కు దూరం చేయాలనే ప్రయత్నం గతంలోనూ జరిగింది. ఇప్పుడూ జరుగుతోంది.
ఇక్కడ జగన్ చేస్తున్న తప్పిదం ఏమిటంటే ఇలాంటి వ్యవహారాలను కఠినంగా అణచివేస్తాననే సందేశాన్ని బలంగా జనాల్లోకి పంపించకపోవడం. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఓ వర్గానికో, ఓ మతానికో కొంత ధైర్యం పెరిగి వుంటే వుండొచ్చు. ఆ ధైర్యంలో కొన్ని తప్పులు చేస్తే చేసి వుండొచ్చు. కానీ అవన్నీ జగన్ ఎండార్స్ చేసినవి కాదు. పైగా అలాంటివి తాను సహించను అని చెప్పి తీరాల్సినవి. గత ఏడాదికి పైగా కాలంలో పదుల సంఖ్యలో హిందూ ఆలయాలు, దేవుళ్ల విషయాల్లో అరాచక, అవమాన సంఘనటలు జరిగాయి అంటే తేలిగ్గా తీసుకోవాల్సింది కాదు.
పిచ్చివాడి వ్యవహారాలు
పిఠాపురంలోని ఆలయాల విషయంలో పిచ్చివాడి పని అని కంట్రోలు చేసాం అని పాలకులు అనుకుంటే అనుకోవచ్చు. కానీ అక్కడ లోకల్ హిందూ జనాల్లో ఏం ముద్ర పడింది. ఏం ఆలోచిస్తున్నారు అన్నది అక్కడికి వెళ్తే తెలుస్తుంది. చినుకు చినుక వానై, వరదై, నదైనట్లు ఇలాంటి అసంతృప్తి భావజాలం పెరగడం అన్నది వైకాపా శ్రేయస్సుకు ఎంత మాత్రం మంచిది కాదు. ఒకటి కాదు, రెండు కాదు పదుల సంఖ్యలో చెదురు మదురు సంఘటనలను జరగడం అన్నది ఆలోచించాల్సిన విషయం.
ఇక్కడ జగన్ రెండు విషయాలు కీలకంగా చేయాల్సి వుంది. ఒకటి తను క్రిస్టియన్ మత విశ్వాసాలు పాటిస్తున్నంత మాత్రాన, తను అధికారంలోకి వచ్చినంత మాత్రాన, ఇష్టం వచ్చినట్లు చేస్తే చెల్లుతుంది అనే ఆలోచన తగదు అనే స్పష్టమైన సమాచారాన్ని క్రిస్టియన్ సమాజంలోకి పంపించాల్సి వుంది. అంత మాత్రం చేత ఈ వ్యవహారాలన్నీ వారి పనే అని నిర్ణారించినట్లు కాదు. ఒకరి పేరు వాడి మరొకరు చేసినా చేసే పని ఇది. ఇదేమంత బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సినంత క్లిష్టమైన విషయమూ కాదు పన్నాగమూ కాదు. అలా అని ఒక వర్గంలోని కొందరి అత్యుత్సాహాన్ని కూడా కొట్టి పారేయనూ లేము.
చట్టానికి వదిలేయవద్దు
చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అనడం ప్రతి విషయంలోనూ సరైనది కాదు. హిందువుల ఓటు బ్యాంకును సమీకృతం చేసి, తాము ప్రయోజనం పొందాలని అనుకునేవారు ఇలాంటి అవకాశాలను చేజార్చుకోరు. అలాంటి వారికి అవకాశం . నిజానికి అంతర్వేది సంఘటన దర్యాప్తును సిబిఐ కి అప్పగించడం ద్వారా జగన్ మంచి ఎత్తుగడే వేసారు.
ఈ హిందూత్వ హడావుడి అంతా భాజపాదే. ఇప్పుడు సిబిఐ కి కేసు దర్యాప్తు అప్పగించడం ద్వారా ఏకంగా భాజపా అధికారంలో వున్న కేంద్రంలోకే బంతిని తోసేసారు. ఇక ఏం చేసుకుంటారో వాళ్లే చేసుకుంటారు. ఈ ఎత్తుగడ వెంటనే పలితం ఇచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అంతర్వేది యాత్ర రద్దు చేసుకున్నారు. ఇంట్లో కూర్చుని దీక్షలు సంగతి అలా వుంచితే, వేడి అయితే చల్లారింది. హిందూత్వను ఎగసం దోసి, ఏదో సాధించాలనుకున్న తెలుగుదేశం పార్టీ నేతలకు కాస్త బ్రేక్ పడింది.
సరే ఇక్కడితో అయిపోయిందా? అసలు 2024 ఎన్నికల కోసం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? కులాల ఈక్వేషన్ ను గుత్తగావాడేందుకు వీలుగా హిందూత్వ ను తెరపైకి తెస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ హిందూత్వకు వారసత్వ హక్కుదారు తామే అన్నట్లు వుంటుంది భాజపా వ్యవహారం. ఇలాంటి దాంట్లోకి తెలుగుదేశం పార్టీ కూడా దూరడం విచిత్రం. ఇలా దూరడం ద్వారా వివిధ వర్గాల్లో ఒకేసారి జగన్ ప్రభుత్వం మీద అసంతృప్తి రాజేయగలం అని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
మతం కన్నా కులమే బలం
కానీ ఇక్కడ చాలా విషయాలు, షరతులు వర్తిస్తాయి అన్న సంగతి విస్మరిస్తున్నారు. ఒకటి రాష్ట్రంలో హిందూ యేతర కులాల వారు కూడా వున్నారు. వారిలో చాలా వరకు వైకాపాకు వెన్నుదన్నుగా వున్నారు. ఇప్పుడు ఈ తీరు చూస్తుంటే వైకాపాకు ఆ ఓటు బ్యాంక్ ను పదిలం చేస్తున్నట్లు కనిపిస్తోంది. చిత్రమేమేటంటే ఈ ఓటు బ్యాంక్ లో తూర్పు కోస్తా కాపులు వున్నారు, దక్షిణ కోస్తా ఎస్సీలు వున్నారు.
ఇలా కులాల ఓటు బ్యాంక్ కూడా మతాల ఓటు బ్యాంకుతో లింక్ అయి వుందన్న సంగతి విస్మరిస్తున్నారు. సరే, ఆ సంగతి కూడా పక్కన పెడదాం. ఎప్పటికైనా భాజపా తనను క్షమించి, తన దగ్గరకు వస్తుందనో లేదా తనను దగ్గరకు తీస్తుందనో చంద్రబాబు నమ్ముతున్నారా? ఎందుకంటే అలాంటి నమ్మకం లేకపోతే, భాజపా ఎదిగే కార్యక్రమానికి ఆయన ఎందుకు ఆయాసపడిపోతున్నట్లు? ప్రభుత్వ వ్యతిరేక ఓటును భాజపా ఎత్తుకు వెళ్తే, స్థిరమైన ఓటు బ్యాంకుతో వైకాపా రెడీగా వుంటే, తెలుగుదేశం బావుకునేది ఏముంటుంది?
పరిస్థితి చూస్తుంటే భాజపా ప్లస్ జనసేన కలిసి కాపు ఓటు బ్యాంక్ కు గట్టిగానే గండికొట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో వ్యూహాలు పన్నడంలో చాలా జాగ్రత్తగా వుండేది పోయి, భాజపా రచిస్తున్న నాటకంలో తాము పాత్రధారులు కావడం అంటే తెలుగుదేశం అధినేత రాజకీయ వ్యూహరచన అనుభవాన్ని శంకించాల్సి వస్తోంది.
పోనీ శతృవు శతృవు మన మిత్రుడు అని, ఆ విధంగా శతృవును కాస్తయినా ఇరుకున పెట్టినట్లు అవుతుందనిస అనుకున్నారేమో అనుకోవచ్చు. కానీ ఈ తాత్కాలిక ఆనందం ఎక్కడకు వెళ్తుంది. భాజపా బలోపేతం అయినా కాకపోయినా, ఆ పార్టీకి కాస్త జవసత్వాలు వచ్చిన భావన కలుగుతుంది. అలా బలోపేత అవుతున్న భావన వస్తే భాజపా ఎప్పటికైనా తెలుగుదేశం పక్కకు చేరుతుందా? పైగా చంద్రబాబు, పవన్, ఇద్దరికీ సిఎమ్ పోస్ట్ కావాలి. భాజపా పక్కన పవన్ వున్నారు. అంత అద్భుతం అవకాశం కుదిరి భాజపాకు కాస్తయినా సీట్లు వచ్చే పరిస్థితి వుంటే సోము వీర్రాజు కూడా ఏమైనా కావాలనుకుంటారు.
ఇలాంటి పరిస్థితి ఊహించడం అంతా కిలోమీటర్ల దూరం తరువాత వ్యవహారం అని తేదేపా అనుకుంటే అనుకోవచ్చు. తాత్కాలికంగా జగన్ ను హిందూవ్యతిరేకిగా ముద్రవేస్తున్నాం అనే ఆనందమే చాలు అనుకోవచ్చు. కానీ ఇలా చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ మరో తప్పు చేస్తోంది. వారానికి ఓ పాయింట్ ను, నెలకో పాయింట్ ను పట్టుకుని యాగీ చేసుకుంటూ వెళ్తున్నారు.
ఇలా చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ ఏ విషయంలోనూ సీరియస్ నెస్ కనబర్చడం లేదు అనే ముద్ర పడుతోంది. అసలు అయిదేళ్ల తరువాత ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడాలనుకుంటోంది. ఏం చెప్పాలనుకుంటోంది
తాత్కాలిక పోరులు వృధా
జగన్ హిందూ ద్వేషి అని చెబుతారా? కాపుల వ్యతిరేకి అని చెబుతారా? బిసిల వ్యతిరేకి అని చెబుతారా? దళిత వ్యతిరేకి అని చెబుతారా? పోనీ ఇవన్నీ చెప్పుకుంటారా? అలా అన్ని వ్యతిరేకతలు చెబితే జనంలో గట్టిగా రిజస్టర్ అవుతుందా? ఇలా ఇన్ని వ్యతిరేక పాయింట్లు వాడితే రెగ్యులర్ పోలిటికల్ వ్యవహారం అయిపోతుంది.
ఎప్పుడూ చరిత్రలో ఓ సింగిల్ పాయింట్ మీద ఎన్నికల ఫైట్ జరిగితేనే పార్టీలకు లాభం చేకూరుతుంది. కాంగ్రెస్ గరీబీ హటావో…తెలుగుదేశం ఆత్మగౌరవ నినాదం, చంద్రబాబు అనుభవం, జగన్ ఒక్క చాన్స్, భాజపా హిందూత్వ ఇలా ఒక్క పాయింట్ మీద ఎన్నికలు జరిగాయి తప్ప ఇలా మల్టీ పుల్ పాయింట్ మీద కాదు.
పైగా చంద్రబాబు ఉదయం హిందూత్వ అంటారు. మధ్యాహ్నం దళితులు అంటారు. నిజానికి చంద్రబాబు ఏడాదిన్నరలో జగన్ ను భయపెట్టలేనిది, భాజపా ఒక్క అంతర్వేది ఇస్యూ తో కలకలం రేపింది. ఆ పాటి వ్యవహారాన్ని ఏడాదిన్నరో చంద్రబాబు చేయలేకపోయారు. భాజపా రంగంలోకి దిగినట్లు చంద్రబాబు దిగలేకపోయారు.
ప్రతి ఒక్క పాయింట్ ను ఇలా పట్టకోవడం అలా వదిలేయడం వంటి వ్యవహారం చంద్రబాబు చేసుకుంటూ వచ్చారు. ఇలా చేయడం వల్ల ఆయన పోరాట జనంలోకి వెళ్లడం లేదు. కానీ ఈ సంగతి చంద్రబాబు గ్రహించడం లేదు. తాత్కాలికంగా రోజువారీ ప్రచారం కోసం చూసుకుంటున్నారు. అదే ఆయన చేస్తున్న తప్పిదం. అది ఆయన తెలుసుకునే వరకు ఆంధ్రలో నిత్య సమస్య..నిత్యపోరు..కానీ ఫలితం మాత్రం శూన్యం అన్నట్లే వుంటుంది.
చాణక్య