ఉమ్మడిగానే ఎంసెట్ జరగాల్సి వుంది.. ఏపీ ఉన్నత విద్యా మండలికే ఆ హక్కు వుంది.. విభజన చట్టం ప్రకారం ఉమ్మడిగానే ఎంసెట్ నిర్వహించాలి.. ఇది ఆంధ్రప్రదేశ్ వాదన నిన్న మొన్నటిదాకా.
కాదు కాదు.. విభజన చట్టం ప్రకారం ఆ హక్కు తెలంగాణకే వుంది. ఉమ్మడి ఎంసెట్ ఊసే లేదు. కావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ నిర్వహించేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి సహకరిస్తుంది.. ఇదీ తెలంగాణ తరఫున వినిపించిన వాదన.
మొత్తానికి తెలంగాణ వాదనే నెగ్గింది. ఉమ్మడిగానే ఎంసెట్.. అన్న ప్రతిపాదన నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తాజాగా నేడు జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంసెట్ నిర్వహణ బాధ్యతల్ని కాకినాడ జేఎన్‌టీయూకి అప్పగిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. హమ్మయ్య.. ఓ వివాదానికి ఇలా ‘శుభం’ కార్డు పడిందన్నమాట తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య.
కేంద్రం దృష్టికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు వివాదాన్ని తీసుకెళ్ళాయి.. గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాలకు చెందిన విద్యా శాఖ మంత్రులు సమావేశమయ్యారు.. మీడియా ముందుకొచ్చి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హడావిడి చేశారు. చివరికి ఇలా ఎం‘సెట్’ అయ్యింది.
ఇంత గందరగోళానికి తావు లేకుండా, ఇదివరకే ‘మేం విడిగానే ఎంసెట్ నిర్వహించుకుంటాం..’ అని ఆంధ్రప్రదేశ్ చెప్పేసి వుంటే, ఇరు రాష్ట్రాల మధ్యా వివాదమే ఏర్పడి వుండేది కాదు. ఎవరు తగ్గారు? ఎవరు నెగ్గారు? అన్న విషయమై ఇప్పుడు చర్చ అనవసరం. అయినప్పటికీ, తెలంగాణ వాదనే నిజమని, ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోవాల్సి వచ్చింది. రాజకీయ నాయకుల తొందరపాటు చర్యల ఫలితమిది.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో విద్యార్థులే తీవ్ర గందరగోళానికి గురయ్యారు. వివాదం సద్దుమణిగింది గనుక, విద్యార్థులకీ క్లారిటీ వచ్చింది. అయితే ఎక్కడ ఎంసెట్ రాయాలి.? అన్నదానిపైనా విద్యార్థుల్లో ఇంకా గందరగోళం వుంది. తెలంగాణలో సీటు కావాలంటే, తెలంగాణ ఎంసెట్ రాయాల్సిందేనన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. సేమ్ డిమాండ్ ఏపీ నుంచి కూడా వచ్చే అవకాశం లేకపోలేదు.