ఎమ్బీయస్‌ : విబి రాజేంద్రప్రసాద్‌ – 2

మరి యిలాటి స్టూడెంటు పిఠాపురం రాజావారి కుటుంబంతో సన్నిహితంగా వుంటే తక్కిన విద్యార్థులకు అసూయ పుట్టదూ? పుట్టింది. ఈయన పేరూ, రాజాగారి అమ్మాయిల్లో ఒకరి పేరూ కలిపి గోడలమీద రాసేరు. రాజేంద్రప్రసాద్‌కి దడ పుట్టింది.…

మరి యిలాటి స్టూడెంటు పిఠాపురం రాజావారి కుటుంబంతో సన్నిహితంగా వుంటే తక్కిన విద్యార్థులకు అసూయ పుట్టదూ? పుట్టింది. ఈయన పేరూ, రాజాగారి అమ్మాయిల్లో ఒకరి పేరూ కలిపి గోడలమీద రాసేరు. రాజేంద్రప్రసాద్‌కి దడ పుట్టింది. వాళ్లతో మునుపటిలా చనువుగా వుండలేకపోయారు. ఓ రోజు ఆటోగ్రాఫ్‌ పుస్తకం తీసుకుని పిఠాపురం రాజావారి దగ్గరకి వెళ్లారు. ఆయన ఆ పుస్తకం తీసుకుని 'దే సే, వాట్‌ డూ దే సే?, లెట్‌ దెమ్‌ సే' అని రాసి చిరునవ్వుతో ఈయనకు అందించారు. ఈయన 'హమ్మయ్య' అనుకున్నారు. తండ్రి మరోలా అనుకోనందుకు ఆ అమ్మాయి కూడా సంతోషించింది. తర్వాత తర్వాత రాజేంద్రప్రసాద్‌ గారికి, ఆ అమ్మాయికి పరిచయం బాగా పెరిగింది. ఓ థలో పెళ్లి చేసుకుందామా అని కూడా అనుకున్నారు. కానీ ఈయనకు మేనరికం వుండడంతో బయట సంబంధం చేసుకోలేకపోయారు. ఆ అమ్మాయితో స్నేహం స్నేహంగానే మిగిలిపోయింది. 

కాలేజీరోజుల్లోనే అక్కినేని నాగేశ్వర్రావుగారు ఈయన రూముకి వచ్చారు. అదెలా జరిగిందంటే ఈయన ఊరు కృష్ణాజిల్లా డోకిపర్రు. అక్కడికి ప్రతీ యేడాదీ సమ్మర్‌లో నాగేశ్వరరావు వచ్చి ఓ వారం  పాటు ఫ్రెండ్స్‌ ఇంట్లో వుండేవారు. ఆ ఫ్రెండ్స్‌ ఈయనకు బంధువులు. ఈయన వెళ్లి నాగేశ్వరరావుని కలుస్తూండేవారు. 1953లో 'దేవదాసు' సినిమా శతదినోత్సవం సందర్భంగా నాగేశ్వరరావు కాకినాడ వచ్చారు. అప్పుడు ఈయన వెళ్లి 'మా రూముకి రండి సార్‌. మా ఫ్రెండ్సంతా మిమ్మల్ని చూద్దామనుకుంటున్నారు' అంటే ఆయన వచ్చారు. అంత పెద్ద స్టార్‌ ఈయన రూముకి రావడంతో ఇక కాకినాడ మొత్తానికి ఈయన హీరో అయిపోయాడు. తర్వాతి జీవితంలో కూడా నాగేశ్వరరావు ఈయనకు ఫ్రెండ్‌, ఫిలాసఫర్‌, గైడ్‌గా వున్నారు. మార్గదర్శకత్వం చేసిన సందర్భాలు వుండడమే కాదు, ఆయన్ని డైరక్టరుగా చేసిన ఘనత కూడా నాగేశ్వరరావు గారిదే! ఆ సినిమా 'దసరా బుల్లోడు'.

'దసరా బుల్లోడు' కథ రాజేంద్రప్రసాద్‌ రూపొందించుకున్నదే. ఆయనకు తెలిసిన వాతావరణంలోంచే ఆ కథ పుట్టుకువచ్చింది. అయిదేళ్లపాటు దాన్ని గురించి ఆలోచించి, ఆలోచించి కథ తయారుచేసుకున్నారు. నాగేశ్వరరావుగారికి వినిపిస్తే 'బాగుంది' అన్నారాయన. సినిమాకి పనికి వస్తుందన్న ధైర్యం రాగానే ఎప్పుడు తీద్దామా అనుకుంటూండగానే అదృష్టం కలిసివచ్చింది. అప్పట్లో నాగేశ్వరరావుగారు కాల్షీట్లు యిచ్చిన సినిమా కథ ఆయనకు నచ్చలేదు. షూటింగ్‌ కాన్సిల్‌ అయింది. డేట్స్‌ ఖాళీగా వున్నాయి. 'నీ సినిమా పెట్టేసుకో' అన్నారు. ఇక ఈయన గబగబా హీరోయిన్‌గా జయలలితను, ఇతర పాత్రలకు ఎస్‌వి రంగారావు, గుమ్మడి, చంద్రకళ – ఇలా అందర్నీ అడిగి కాల్షీట్లు సంపాదించారు.  ఇక డైరక్టరు. రాజేంద్రప్రసాద్‌ సినిమాలన్నిటికీ వి.మధుసూదనరావుగారే డైరక్టరు. ఆయన్ని వెళ్లి అడిగారు. కానీ ఆయన ఇతర సినిమాలకు ఆల్‌రెడీ కమిట్‌ అయివున్నారు. ఇది ముందు అనుకున్నది కాదు. అందువల్ల సారీ అనేశారు. ఏం చేయాలి? 

సెకండ్‌ ఛాయిస్‌గా ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గరకి వెళ్లి 'దసరా బుల్లోడు'కు దర్శకత్వం వహించమని రాజేంద్రప్రసాద్‌ అడిగారు. ఆయనకీ సేమ్‌ ప్రాబ్లెమ్‌. అప్పటికప్పుడంటే ఏ పెద్ద దర్శకుడు దొరుకుతాడు? నాగేశ్వరరావు గారి డేట్స్‌ దొరికాయి కదాని సినిమా మొదలుపెట్టబోతే అన్నీ కుదిరాయి గానీ డైరక్టరు కుదరడం లేదు. 'ఎలాగండీ' అని నాగేశ్వరరావుగార్ని అడిగారు ఈయన. 'ఆగండి, చూద్దాం' అన్నారు నాగేశ్వరరావు. రెండురోజులు పోయాక రాజేంద్రప్రసాద్‌కి ఓ ఫ్లాష్‌ ఐడియా వచ్చింది. సినిమాను నాగేశ్వరరావుగారినే డైరక్టు చేయమంటే ఎలా వుంటుందాని? ఎందుకంటే 'దసరా బుల్లోడు' సినిమా రూరల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వున్న సినిమా. నాగేశ్వరరావుగారిదీ అదే నేపథ్యం. 
కానీ నాగేశ్వరరావు 'నో' అనేశారు. 'నేను డైరక్టరుగా దీనిలో ఫుల్‌గా ఇన్వాల్వ్‌ అయిపోతే నేను యాక్ట్‌ చేసే తక్కిన సినిమాల గతి ఏమవుతుంది? అయినా నాకు డైరక్షన్‌ మీద మోజు లేదు.' అనేశారు.  అంతేకాదు, 'కథ తయారుచేసింది నువ్వు, పాత్రలపై అవగాహన పెంచుకున్నది నువ్వు, అందుకని నువ్వే డైరక్టు చేయి.' అన్నారు. 'చాల్లెండి. నా సినిమా షూటింగు అవుతున్నా నేనెప్పుడూ సెట్లో వున్నది లేదు. ఏ చెట్టు కిందో రేడియో పెట్టుకుని వింటూండేవాణ్ని.  డైరక్షన్‌ ఎప్పుడూ అబ్జర్వ్‌ చేయలేదు. నా వల్లకాదు.' అన్నారు రాజేంద్రప్రసాద్‌. 

'అలా అయితే నేనింక నీ సినిమాల్లో యాక్ట్‌ చేయను' అని బ్లాక్‌మెయిల్‌ చేశారు నాగేశ్వరరావు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వానికి ఒడికట్టారు. 

షూటింగు ప్రారంభం 'పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లా' పాటతో! డాన్స్‌ డైరక్టరు హీరాలాల్‌ తను డిజైన్‌ చేసిన భంగిమలు చేసి చూపిస్తున్నారు. నాగేశ్వరరావుగారు రాజేంద్రప్రసాద్‌తో 'ఏమిటయ్యా ఈ నృత్యభంగిమలు, ఆడంగి చేష్టల్లా వున్నాయి?' అని కోప్పడ్డారు. ఈయన బిక్కమొహం వేశారు. వెంటనే నాగేశ్వరరావు ఫక్కున నవ్వి 'షాక్‌ తిన్నావా? అప్పుడప్పుడు ఇలాటివి ఇస్తూంటాను. నువ్వు దర్శకుడిగా రాటుతేలి, రాణించాలంటే ఇలాటివి అవసరం.' అని వెన్నుదట్టారు. అదీ ఆయన రాజేంద్రప్రసాద్‌గార్ని తీర్చిదిద్దిన తీరు. 

నాగేశ్వర్రావుతో యీయన మొదటి సినిమా 'ఆరాధన'. ఆ సినిమా సగం అయిపోయిన తర్వాత రాజేంద్రప్రసాద్‌ సహనిర్మాత 'ఇప్పటివరకూ చేసింది ఎవరైనా అనుభవజ్ఞులకు చూపిద్దాం' అన్నారు. అప్పుడు వీళ్లు కొంతమంది వెటరన్స్‌కి చూపించారు. వాళ్లలో బియన్‌ రెడ్డిగారు ఒకరు. 

వాళ్లు సినిమా చూసి పెదవి విరిచారు. 'రొమాంటిక్‌ ఇమేజి వున్న నాగేశ్వరరావును గుడ్డివాడిగా చూపిస్తే ఎవరు చూస్తారు?' అన్నారు. ఆ సినిమాకు బెంగాలీ మూలం వుంది. ''సాగరికా'' అని. ''బెంగాలీలో చూశారు కదండీ' అని దర్శకుడు అంటే 'ఆ ప్రేక్షకులు వేరు.' అన్నారు యీ పండితులు. బియన్‌ రెడ్డి అలా అన్నాక నాగేశ్వరరావు కూడా నిజమే కాబోసు అన్నారు. 'పోయినది ఎలాగూ పోయింది. ఇంకో మంచి కథ చూసుకోండి. నేను కాల్‌షీట్లు యిస్తాను.' అన్నారాయన. దాంతో నిర్మాతలిద్దరూ కంగారు పడ్డారు. మళ్లీ మొదటినుండీ తీయడం అంటే నష్టం ఖాయం. అంతకంటె ఈ సినిమానే పూర్తి చేసి రిస్కు తీసుకోవడం మేలు అనుకుని ఆ మాట నాగేశ్వరరావుగారికి చెప్పారు. సరే కానీయండి అన్నారాయన.  .(సశేషం)

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2015)

[email protected]

Click Here For Part-1