‘ఆంధ్రజ్యోతి’ని కేసీఆర్‌ ఏం చేస్తారు?

తెలుగులోని  దాదాపు అన్ని ప్రధాన దిన పత్రికలు (ఈనాడు సహా) ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాయడానికి భయపడుతున్నాయి. వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ, ఆ తరువాతా చెలరేగిపోయి కథనాలు…

తెలుగులోని  దాదాపు అన్ని ప్రధాన దిన పత్రికలు (ఈనాడు సహా) ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాయడానికి భయపడుతున్నాయి. వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ, ఆ తరువాతా చెలరేగిపోయి కథనాలు వెలువరించిన ‘ఈనాడు’ రాష్ట్ర విభజన జరిగి కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పడగానే కుక్కిన పేనులా మారిందనే విమర్శలున్నాయి. చెలరేగిపోయి వ్యతిరేక కథనాలు రాయకపోయినా ఆయన విధానాల్లోని లోపాలను, అనుచిత ధోరణులను విమర్శించవచ్చు. కాని ఆ పనీ చేయడంలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి విమర్శలు చేయడం భావ్యం కాదనుకుందా? అదేమీ కాదు. రామోజీరావుకు అనేక వ్యాపారాలున్నాయి. ఫిలిం సిటీ ఉంది. వాటిల్లో అనేక అన్యాయాలు జరుగుతున్నాయి. లోటుపాట్లున్నాయి. దీంతో కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాస్తే ఇబ్బందులు పెడతాడనే భయం ఉంది. అందుకే ‘ఈనాడు’ ఆయనకు అనుకూలంగా ఉంది. ఆర్‌ఎఫ్‌సీలో అసైన్డ్‌ భూములున్నాయిని, అక్రమాలు ఉన్నాయని, ఫిలింసీటీని లక్ష నాగళ్లు పెట్టి దున్నిస్తామని తెలంగాణ ఉద్యమ సమయంలో హూంకరించిన కేసీఆర్‌ ఇప్పుడు మంచోడైపోపోయారు. ఇద్దరూ ‘అలాయ్‌ బలాయ్‌’ అనుకుంటున్నారు. కొన్నాళ్ల కిందట కేసీఆర్‌ ఫిలంసిటీకి వెళ్లి దాదాపు ఐదారు గంటలు అక్కడ గడిపారు. ఫిలిం సీటీ తెలంగాణకు గర్వకారణమన్నారు. రామోజీరావు నిర్మించబోయే ఆధ్యాత్మిక నగరం ఓం సిటీని మెచ్చుకున్నారు. ప్రభుత్వం తరపున అవసరమైతే సహాయం చేస్తామన్నారు.

ఇక్కడ  ప్రత్యేకంగా ‘ఈనాడు’ గురించి ఎందుకు చెప్పుకోవల్సివచ్చిదంటే అది లార్జెస్ట్‌ సర్క్యులేటెడ్‌ దినపత్రికే కాకుండా ప్రభుత్వాలను ఢీకొన్న చరిత్ర ఉంది. ఇలాంటి ఈనాడు పత్రికే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి లొంగిపోతే ఇక మిగిలిన పత్రికల గురించి చెప్పుకునేదేముంది? ప్రస్తుతం కేసీఆర్‌ పగబట్టిన దిన పత్రిక ‘ఆంధ్రజ్యోతి’. మంత్రివర్గ ప్రమాణ స్వీకార సమయంలో దాన్ని గురించి వ్యంగ్య కథనాలు ప్రసారం చేశాయంటూ ఎబిఎన్‌`ఆంధ్రజ్యోతి ఛానెల్‌ పైనా, టీవీ`9 పైనా నిషేధం విధింపచేశారు కేసీఆర్‌. ఆపరేటర్లకు కోపం వచ్చి వారు నిషేధం విధించారని, దీంతో ప్రభుత్వానికిగాని, తనకుగాని సంబంధం లేదన్నారు. టీవీ`9  క్షమాపణలు చెప్పడంతో చాలాకాలం తరువాత దానిపైన నిషేధం ఎత్తేయించారు. కాని ఎబిఎన్‌పై ఇంకా నిషేధం కొనసాగుతూనే ఉంది. ఈ రోజుకు 233 రోజులకు చేరుకుంది. ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు. ఈ విషయంలో న్యాయస్థానాలూ ఏం చేయలేకపోయాయి. కేంద్ర ప్రభుత్వమూ చేతులెత్తేసింది. 

ఇదిలా కొనసాగుతుండగానే తాజాగా మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆంధ్రజ్యోతిపై నిప్పులు చెరిగారు. లడాయికి సిద్ధమయ్యారు. నిజామాబాద్‌ జిల్లాలో మంజీరా నది ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, ఇందులో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, కేసీఆర్‌ కూతురు కమ్‌ ఎంపీ కవిత హస్తముందని కథనం ప్రచురించడంతో కేసీఆర్‌కు కోపం వచ్చింది. ఆంధ్రజ్యోతిపై కేసులు వేయాలని మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు చెప్పారు. తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టుల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు ఇచ్చే డబ్బులో పర్సంటేజీలు వసూలు చేస్తున్నారని, ఇప్పటికి రూ.200 కోట్లు వసూలు చేశారని, ఇందులో ముఖ్యమంత్రి సహా కీలక వ్యక్తులకు వాటాలున్నాయని ఆంధ్రజ్యోతి సమాచారం. ఇలాంటి అక్రమ వసూళ్లకు రశీదులు గట్రా ఉండకపోయినా కోర్టులో కేసు వేస్తే రుజువు చేసే సత్తా తమకు ఉందని ఆంధ్రజ్యోతి చెబుతోంది. అవినీతి, అక్రమాలపై రాసినందున కేసులు వేసుకోవచ్చని సవాలు చేసింది. ఈ సవాలును స్వీకరించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంగాని, ఆ పార్టీ నేతలుగాని కోర్టులో కేసు వేస్తారా? 

గతంలో వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై నిప్పులు చెరిగేవారు. ఎప్పుడూ ‘ఆ రెండు పత్రికలు’ అంటూ మాట్లాడేవారు. ఆ రెండు పత్రికలపై ద్వేషంతోనే ‘సాక్షి’ పత్రిక పెట్టారు. తనకు పడని పత్రికలకు కొన్నాళ్లు ప్రభుత్వ ప్రకటనలు కూడా బంద్‌ చేశారు. ఇప్పుడు కేసీఆర్‌ కూడా అదే దారిలో నడుస్తున్నారు. కేసీఆర్‌తో పెట్టుకుంటే ఇబ్బందులు పడాల్సివస్తుందనే ప్రధాన పత్రికలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి. ఈమధ్య ప్రారంభమైన ‘మన తెలంగాణ’ పత్రిక కూడా కేసీఆర్‌ భజన బృందంలోదే. దాంట్లో టీఆర్‌ఎస్‌ నాయకుల పెట్టుబడులున్నాయి. అవినీతిపై కథనాలు వచ్చినప్పుడు విచారించి నిగ్గు తేల్చాలేగాని కేసులు పెట్టి ఇబ్బందుల పాలుచేయడం, నిషేధం విధించడం ప్రజాహితం కోరుకునే పాలకులు చేయాల్సిన పనికాదు.

ఎం నాగేందర్

[email protected]