‘దైవ సన్నిధానం’పై కోర్టుకు వెళతారా?

హైదరాబాదులోని ఫిల్మ్‌ నగర్‌లో ఉన్న 'దైవ సన్నిధానం' ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ దానికి నోటీసులు ఇచ్చిందని, త్వరలో స్వాధీనం చేసుకోబోతున్నదనే వార్త సినిమా వర్గాల్లో సంచలనమే.…

హైదరాబాదులోని ఫిల్మ్‌ నగర్‌లో ఉన్న 'దైవ సన్నిధానం' ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ దానికి నోటీసులు ఇచ్చిందని, త్వరలో స్వాధీనం చేసుకోబోతున్నదనే వార్త సినిమా వర్గాల్లో సంచలనమే. హైదరాబాదులో బిర్లా మందిర్‌, సంఘీ టెంపుల్‌కు ఎంత పేరుందో ఫిల్మ్‌ నగర్‌లోని దైవ సన్నిధానం ఆలయానికి అంత పేరుంది. తెలుగు సినిమా పెద్దల ఆధ్వర్యంలో నిర్మితమై, వారే నిర్వహిస్తున్న ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

దీన్ని దేవాదాయ శాఖకు ఎందుకు కట్టబెట్టాలని అనుకుంటోంది? ఆలయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని, నిర్వహణ కమిటీ లెక్కలు సమర్పిండంలేదని ప్రభుత్వం చెబుతోంది. నిజంగా ఇవే కారణాలా? మరేదైనా కోణం ఉందా? కొందరు 'ఆంధ్రా' కోణం ఉందేమోనని అనుమానిస్తున్నారు. ఈ ఆలయానికి చాలాకాలం ప్రముఖ నిర్మాత, దర్శకుడు వీబీ రాజేంద్ర ప్రసాద్‌ (జగపతి బాబు తండ్రి) ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన నిజాయితీపరుడు. అజాత శత్రువు. సినిమా పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తి. ఆయన మరణించిన తరువాత దైవ సన్నిధానం ట్రస్టు బోర్డుకు ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్‌ ఛైర్మన్‌ అయ్యారు. 

ప్రభుత్వం ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలనుకోవడానికి రెండు కారణాలు ఊహిస్తున్నారు. ఒకటి ఛైర్మన్‌ మురళీ మోహన్‌ టీడీపీ పార్లమెంటు సభ్యుడు. మరొకటి ఈ ఆలయాన్ని విశాఖపట్నంలోని శారదా పీఠానికి అనుసంధానించారు. ఆలయ ట్రస్టు బోర్డులో ఉన్నవారంతా సినిమా ప్రముఖులే కాబట్టి ఏం జరిగినా వారు చూసుకుంటారు. దీంట్లో ప్రభుత్వం కల్పించుకునేందుకు ఏమీ లేదు. దైవ సన్నిధానం ఆలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నాలపై ఆలయ ట్రస్టు బోర్టు, ఇతర సినిమా ఎలా స్పందిస్తారనేది ఇంకా తెలియదు. కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వచ్చింది. ఒకవేళ అదే జరిగితే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రా సినిమా ప్రముఖులను వేధిస్తోందనే ప్రచారం జరిగినా ఆశ్చర్యం లేదు. 

రాష్ట్రం విడిపోయిన సమయంలో టాలీవుడ్‌లో ఇలాంటి భయాలే తొంగిచూశాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులు షూటింగ్‌లను అడ్డుకోవడం, సినిమా ప్రదర్శనలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అప్పట్లో పెద్ద వివాదాలు జరిగిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకున్న కొందరు సినిమా ప్రముఖులు విభజన తరువాత భయపడటంతో ఈ సంగతి గ్రహించిన కేసీఆర్‌ ప్రభుత్వం సినిమా వారికి భరోసా ఇచ్చింది. రెండు వేల ఎకరాల్లో మరో ఫిల్మ్‌ సిటీ కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం మీద హైదరాబాదులో సినిమా పరిశ్రమ ప్రశాంతంగానే ఉన్న నేపథ్యంలో ఈమధ్య ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో సినిమా స్థిరపడితే సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఆంధ్రాలోనూ సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందవచ్చేమోగాని మొత్తం తరలివెళ్లే అవకాశం లేదని కొందరు సినిమా ప్రముఖులు చెప్పారు. 

దైవ సన్నిధానం వ్యవహారం వివాదంగా మారితే సినిమా పరిశ్రమపై చర్చ జరగవచ్చు. దైవ సన్నిధానం ఆలయ సముదాయం 2004 జూన్‌లో ప్రారంభమైంది. దీన్ని పూర్తిగా సినిమా పరిశ్రమవారే కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించారు. దాదాపు ఏడాదిన్నరపాటు నిర్మాణం సాగింది. దీనికి మొదటి ఛైర్మన్‌ కమ్‌ మేనేజింగ్‌ డైరెక్టరుగా వీబీ రాజేంద్రప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించారు. 11 మంది ట్రస్టీలతో ట్రస్టు బోర్డు ఏర్పాటైంది. అనేక సినిమాల్లో ఈ ఆలయం కనబడుతుంది. ఆలయంలో షూట్‌ చేయాల్సిన సన్నివేశాలకు దైవ సన్నిధానమే ఉపయోగించుకుంటుంటారు. జూబ్లీ హిల్స్‌ ప్రజలకు ఈ ఆలయం సుపరిచితం. ఇది కనుక దేవాదాయ శాఖ చేతుల్లోకి వెళితే టాలీవుడ్‌ పరిశ్రమకు పెద్ద దెబ్బే. ఎండోమెంట్‌ శాఖ చేతుల్లో ఆలయాలు ఎంత లక్షణంగా ఉంటాయో తెలిసిందే.