కీలకమైన మ్యాచ్‌లో కెప్టెన్ ధోనీ చేతులెత్తేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా పీకల్లోతు కష్టాల్లో వుంది. రెండు మ్యాచ్‌లు గెలిచి ఆస్ట్రేలియా దాదాపుగా సిరీస్ కైవసం చేసుకునే పరిస్థితుల్లో వుంది. ఈ టైమ్‌లో జట్టును ముందుకు నడిపించడంలో కెప్టెన్‌గా ధోనీ సమర్థవంతంగా వ్యవహరించాల్సింది పోయి.. చేతులెత్తేస్తుండడాన్ని ఏమనాలి.?
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 530 పరుగలు చేయగా, భారత్ కూడా కాస్త ధీటుగానే ఆస్ట్రేలియాకి సమాధానమిచ్చింది. 8 వికెట్లు నష్టపోయి 468 పరుగులు చేసింది. కోహ్లీ, రెహానే సెంచరీలతో టీమిండియాని గట్టున పడేశారు. వారిద్దరూ ఔటయ్యాక, ధోనీ వున్నాడు కదా.. అనుకున్నారు భారత క్రికెట్ అభిమానులు. కానీ, ధోనీ ఎలా వచ్చాడో, అలానే వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ దశలో ధోనీ కనీసం అర్థసెంచరీ చేసినా ఆస్ట్రేలియా మీద తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా లీడ్ సాధించడానికి అవకాశముండేది.
ఇంకా 68 పరుగులు వెనకబడి వుంది టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో. చేతిలో రెండు వికెట్లున్నాయి. అదే ఆసీస్ టెయిల్ ఎండర్లయితే, యాభై పైన పరుగులు చేస్తారేమో అనుకోవచ్చు. టీమిండియాకి ఆ ఛాన్స్ లేదు. ఈ టెస్ట్ సిరీస్‌లో ఒక మ్యాచ్‌కి కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో ధోనీ ఆడలేదు. ఆడిన రెండో మ్యాచ్‌లోనూ ధోనీ పెద్దగా జట్టుకి బ్యాటింగ్ పరంగా ఉపయోగపడిందేమీలేదు.
మెల్బోర్న్లో జరుగుతోన్న మూడో టెస్ట్‌లో ఫలితం తేలే అవకాశాలు తక్కువగానే కన్పిస్తున్నాయి. మ్యాచ్ డ్రా అయితే మాత్రం ఆస్ట్రేలియా సిరీస్ గెలిచినట్లే. ఇంతకీ ధనాధన్ ధోనీకి ఏమయ్యింది.? ధోనీ బ్యాట్ నుంచి పరుగులెందుకు రావట్లేదు.? ధోనీ పనైపోయిందనుకోవచ్చా.? ఏమో మరి.. పరిస్థితులు చూస్తోంటే, ధోనీ కెరీర్ అటకెక్కేలానే కన్పిస్తోంది.