జూనియర్ తెదేపాకి నిజంగా పనికొస్తాడా?

నాయనమ్మ పోలికలున్నంతమాత్రాన ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ సారధి కాలేదు. తాత పోలికలున్నంత మాత్రాన జూనియర్ ఎన్.టి.ఆర్ తెదేపా కి సారధీ కాలేడు. Advertisement సోనియాగాంధీ తరువాత వారసుడిగా రాహుల్ గాంధి సరైన పనితనం చూపలేకపోవడం,…

నాయనమ్మ పోలికలున్నంతమాత్రాన ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ సారధి కాలేదు. తాత పోలికలున్నంత మాత్రాన జూనియర్ ఎన్.టి.ఆర్ తెదేపా కి సారధీ కాలేడు.

సోనియాగాంధీ తరువాత వారసుడిగా రాహుల్ గాంధి సరైన పనితనం చూపలేకపోవడం, జనాన్ని ఆకట్టుకోలేకపోవడం మొదలైన కారణాల వల్ల ప్రియాంకాగాంధీ అయితే చక్కని ప్రత్యామ్నాయం అవుతుందని, చూడ్డానికి నాయనమ్మ పోలికలున్నాయి కనుక జనం కూడా ఆమెను మరో ఇందిరమ్మను చేసి అందలమెక్కిస్తారని అనుకున్నారు. కానీ ప్రియాంకాగాంధీ నోరు విప్పి మాట్లాడేటప్పటికి అందరికీ అర్థమైపోయింది. ఆవిడలో కాంగ్రెస్ కి సారధ్యం వహించే వ్యవహారం లేదని.

మొన్నామాధ్య చంద్రబాబు ఒకానొక స్థానిక ఎన్నికల ప్రచారానికి వెళితే అక్కడ సాక్షాత్తూ పార్టీ కార్యకర్తలే జూనియర్ ఎన్.టి.ఆర్ ఫ్లెక్సీలు, కటౌట్లు, జెండాలు పెట్టి “జూనియర్ ఎన్.టి.ఆర్…జూనియర్ ఎన్.టి.ఆర్” అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు.

చంద్రబాబు కర్ణపుటలను తాకిన ఆ నినాదాల వల్ల గుండెల్లో ఉన్న పుత్రప్రేమను కలవరపడే ఉంటుంది.

చాలా సందర్భాల్లో బుచ్చయ్య చౌదరిలాంటి నాయకులు సైతం జూనియర్ రాక పార్టీకి అనివార్యం అన్నట్టుగా మాట్లాడారు. ఇదంతా మౌనంగా గమనించిన జూనియర్ కూడా కాస్త చలించి ఉంటే ఉండొచ్చు. తనకు కూడా రాజయోగం ఉందేమో అన్న ఆలోచన వచ్చి ఉండొచ్చు.

కానీ మొన్నటి చంద్రబాబు ఏడుపు తర్వాత వదిలిన వీడియో బైట్లో జూనియర్ ఎన్.టి.ఆర్ ధోరణి చూసి తెలుగుతమ్ముళ్లు అవాక్కయ్యారు. తెదేపా అనుకూల మీడియా కూడా ఇదేమి ఖండన అని విస్తుబోయింది.

అందరూ కోరుకున్నది ఏంటంటే, చంద్రబాబు మీద, ఆయన సతీమణిమీద విపరీతమైన అనురాగాన్ని ప్రదర్శించి వైసీపీ శ్రేణుల్ని మాటలతో తూర్పారబెడతాడని. కానీ ఒక నీతిశాస్త్ర పాఠం వల్లించి, తానసలు ఏ కుటుంబమైతే బాధపడిందో ఆ కుటుంబసభ్యుడిగా మాట్లాడడం లేదని… ఒక తండ్రిగా, కొడుకుగా, భర్తగా, దేశ పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పాడు.

అసలెక్కడా చంద్రబాబు పేరే ప్రస్తావించలేదు. తన మేనత్త భువనేశ్వరి పేరు కూడా తీయలేదు. దీనిని బట్టి అర్థం కావాల్సింది ఒక్కటే. జూనియర్ ఎన్.టి.ఆర్ కి తన తల్లి, భార్య, పిలల్లు తప్ప నారా కుటుంబం కానీ, ఇతర నందమూరి సభ్యులు కానీ మనసుకు దగ్గరగా లేరని.

ఈ దెబ్బకి అసలు జూనియర్ ఎన్.టి.ఆర్ పేరు తెదేపా శ్రేణులు మళ్లీ ఎత్తవు. పైగా వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరూ కూడా జూనియర్ కి స్నేహితులు కావడం, వాళ్లనైనా పేరు పెట్టి ఖండించకపోవడం తెలుగుతమ్ముళ్లకి మింగుడుపడని విషయం. అసంబ్లీలో జరిగిన విషయం బాధపెట్టిందన్నాడు తప్ప “వల్లభనేని వంశీ మొదలుపెట్టిన పుకారు” అని మాత్రం అనలేదు.

అది పక్కన పెడదాం.

ఒకవేళ పైన అనుకున్నట్టు కాకుండా..మళ్లీ ఏదో జరిగి ఎన్.టి.ఆర్ ని నమ్మి తెలుగుదేశం వాళ్లు జూనియర్ ని ఆహ్వానించారనుకుందాం. చంద్రబాబు కూడా గత్యంతరమదే అనుకుని మనసు చంపుకుని స్వాగతించాడనుకుందాం. ఆ పరిస్థితుల్లో జూనియర్ నెగ్గుకురాగలడా?

మొన్నటి వీడియో బైట్ ద్వారా అర్థమయ్యిందేంటంటే ఇతర నందమూరి సభ్యులకంటే అనుకున్న విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా స్పష్టంగా మాట్లాడగలడంతే. అంతే తప్ప అసలా వీడియో అవసరమా, దాని పర్యవసానం ఏమౌతుంది…మొదలైన అంశాలు లెక్కేసుకోలేదు. అవసరం లేకపోయినా ఎవరి వత్తిడికో తలొగ్గి స్టేట్మెంట్ ఇవ్వడమనేది బలమైన నాయకుడి లక్షణం కాదు. ఒక ప్రెస్-నోట్ వదిలి కూర్చున్నా సరిపోయేది.

అయినా ఇప్పుడు రాజకీయాలు మునుపట్లా లేవు. హుందాతనాన్ని చంపేసుకుని దిగాలి. అవసరాన్ని బట్టి ఎలాంటి “భాషైనా” మాట్లాడగలగాలి.

ఉదాహరణకి కేటీఆర్. అతను ఉద్యమం నుంచి వచ్చాడు. నానా గొడవలు ఎదుర్కొన్నాడు. ఉర్దూలోనూ, తెలుగులోనూ పచ్చి బూతులు తిట్టిన సందర్భాలూ చూసాం. పాలిష్డ్ అమెరికన్ ఏక్సెంట్ తో ఇవాంకా ట్రంప్ ని పక్కన పెట్టుకుని అదరగొట్టిన స్పీచులూ చూసాం. అంతటి విస్తృతమైన వాక్పటిమ ఇప్పుడు అవసరం. మాట్లాడమంటే ఎదో మాట్లాడేయడం కాదు, ప్రతి మాట వెనుక ఆలోచన, లాజిక్ ఉండాలి. సోషల్ మీడియా బలంగా విస్తరించిన ఈ రోజుల్లో డైనమిక్ లీడర్ గా నెగ్గుకురావాలంటే ఆ మాత్రం ట్యాలెంట్ కావాలి.

కేటీఆర్ ది ఉద్యమనేపథ్యం అయితే జగన్ మోహన్ రెడ్డిది మరొక నేపథ్యం. తండ్రి మరణం తర్వాత తన వాళ్లెవరో పరాయి వాళ్లెవరో చూసాడు. తెదేపా శ్రేణులు తనపై కక్షగట్టి పెట్టించిన కేసులు, ఊపిరాడకుండా రిమాండ్ ఖైదీగా ఉంచిన తీరు చవిచూసాడు. ముందు నుంచీ నరనరాల్లోనూ రాజాకీయమంటే ఏంటో తండ్రి కాలం నుంచి చూస్తూ వచ్చాడు. జనంతో ఎలా మమేకం కావాలో, ప్రజలకు ఏం చేస్తే పదవులు కట్టబడతారో తెలిసి వచ్చాడు. కనీసం ఈ నేపథ్యమైనా ఉండాలి.

జూనియర్ ఎన్.టి.ఆర్ కి ఇలాంటివేవీ లేవు. వ్యక్తిగతంగా తనకు, నందమూరి-నారా కుటుంబాలకి మధ్య కొంత అగాధం ఉన్నమాట వాస్తవం. అంతకు మించి ప్రజలకు కూడా ఎన్.టి.ఆర్ ఎదుర్కున్న చేదు అనుభవాలేవీ లేవు. రాజకీయంగా రాటుదేలడానికి కావాల్సిన నేపథ్యాలు కూడా లేవు.

అన్నయ్య పెట్టిన పీఆర్పీ నుంచీ రాజకీయాల్లో ఉండి తర్వాత జనసేన పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటివరకు రాజకీయంగా కనీసం మొదటి గేర్ కూడా వేయలేకపోయాడు. ఇంకా బండి న్యూట్రల్లోనే ఉంది. ఆల్రెడీ పవన్ రాజకీయానుభవానికి (పార్ట్ టైం అయినా సరే) పదమూడేళ్లు పూర్తిగావొస్తోంది. అంత ఓపిక, తీరిక జూనియర్ ఎన్.టి.ఆర్ కి ఉన్నాయా?

ఎలా చూసుకున్నా జూనియర్ ఎన్.టి.ఆర్ నాలుగు స్పీచులకి పనికొస్తాడేమో తప్ప మొత్తం రాజకీయాన్ని నడపడానికి, ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడానికి సరిపోడనేది నిశ్చితాభిప్రాయం. ఎందుకంటే కేవలం సినీ హీరో అయినంత మాత్రాన జనం రాజకీయంగా అక్కున చేర్చుకునే రోజులు కానే కావని అందరికీ తెలిసిందే.

రాజకీయం అటుంచి సినిమా విషయమే తీసుకున్నా ఇంకా నెంబర్ వన్ స్థానానికి దూరంలోనే ఉన్నాడు జూనియర్. ముందు ఆ స్థానంపై దృష్టి పెడితే చాలు. తనకా సమర్థత ఉంది.

శ్రీనివాసమూర్తి