వికారుద్దీన్.. పేరుమోసిన టెర్రరిస్ట్.. పోలీసులకు చిక్కాడు, విచారణ జరుగుతున్న సమయంలోనే పోలీసుల కళ్ళు గప్పి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ హతమయ్యాడు. ఇది పోలీసులు చెప్పిన వెర్షన్. అక్కడేం జరిగింది.? అన్నది పక్కన పెడితే, చనిపోయింది టెర్రరిస్టు గనుక, ఈ ఎన్‌కౌంటర్‌ని ఖండించేందుకు ఎవరూ సాహసించకూడదు. కానీ, కొందరు సాహసించారు, అత్యుత్సాహం ప్రదర్శించారు. అది గతం.
ఇక, తాజా ఘటన విషయానికొస్తే, మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జైలు నుంచి ఏకంగా ఎనిమిది మంది ఉగ్రవాదులు పరారయ్యారు. జైలు సెంట్రీని హతమార్చి మరీ, ఆ ఎనిమిది మంది ఉగ్రవాదులూ పారిపోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. పకడ్బందీ భద్రత వుండే జైలు నుంచి, అతి కిరాతకమైన ఉగ్రవాదులు తప్పించుకోవడం ఎలా సాధ్యమవుతుంది.? ఉగ్రవాదులంటేనే, వారికి పటిష్టమైన భద్రత వుంటుంది. భద్రత అంటే, వారు ఏమాత్రం తప్పించుకోడానికి వీల్లేకుండా జైల్లో వుండే ఏర్పాట్లన్నమాట.
ఎలాగైతేనేం.. తప్పించేసుకున్నారు జైలు నుంచి. కానీ, తుపాకీ తూటాల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. వారిని వెతికే క్రమంలో పోలీసులు, ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చింది. చిత్రమైన విషయమేంటంటే, ఆ సమయంలో ఆ ఉగ్రవాదుల వద్ద ఆయుధాలున్నాయి. అంటే, పక్కా ప్లానింగ్‌తో జైల్లోంచి ఎస్కేప్ అయి వుండాలి. అలా వాళ్ళు ఎస్కేప్ అవడానికి జైల్లోనే ఎవరో సహకరించి వుండాలి. అదీ అధికారుల స్థాయిలోనే జరిగి వుండాలి.
తప్పించుకున్న కాస్సేపట్లో తీవ్రవాదులు ఎన్‌కౌంటర్ అవడంతో దేశమంతా ఊపిరి పీల్చుకుంది. నిషేధిత సిమి సంస్థకు చెందిన ఉగ్రవాదులే ఈ ఎనిమిది మందీ. స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఇన్ ఇండియా పేరుతో చాలాకాలంగా తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి. రద్దీగా వుండే ప్రాంతాల్లో బాంబులు పెట్టడం, పోలీసుల్ని హతమార్చడం, దేశంలో అల్లకల్లోలం సృష్టించడం.. ఇదీ సిమీ కార్యకలాపాల తీరు. పాకిస్తాన్ నుంచే ఈ సంస్థకు నిధులు పెద్దమొత్తంలో అందుతున్నట్లు గతంలోనే గుర్తించారు.
మామూలుగా ఎన్‌కౌంటర్ జరిగిందనగానే ఇది బూటకపు ఎన్‌కౌంటర్.. అని గగ్గోలు పెట్టే హక్కుల సంఘాలు, అడపా దడపా ఇలాంటి ఘటనల్లోనూ పెదవి విప్పుతుంటాయి కామెడీగా. తీవ్రవాదులంటే సమాజానికి పట్టిన క్యాన్సర్ లాంటోళ్ళు.. తప్పదు, అంతమొందించాల్సిందే. ఫేక్ ఎన్‌కౌంటర్ కావొచ్చు, నిజంగానే ఎన్‌కౌంటర్ జరిగి వుండొచ్చు.. కానీ, తప్పదు.. సమాజంలో ఇలాంటోళ్ళకు జీవించే హక్కు లేనే లేదు.