ప్రభుత్వాలా?…కంపెనీలా?

కంపెనీలు తమ ప్రోడక్టులు అమ్ముకోవడానికి అనేక రకాలుగా ప్రచారం చేస్తుంటాయి. తమ ఉత్పత్తి గురించి గొప్పగా చెబుతాయి. దాన్ని ప్రజలకు అంటగట్టడం కోసం అనేక స్కీములు పెడతాయి. రాయితీలు ఇస్తాయి. పత్రికల్లో పూర్తి పేజీ…

కంపెనీలు తమ ప్రోడక్టులు అమ్ముకోవడానికి అనేక రకాలుగా ప్రచారం చేస్తుంటాయి. తమ ఉత్పత్తి గురించి గొప్పగా చెబుతాయి. దాన్ని ప్రజలకు అంటగట్టడం కోసం అనేక స్కీములు పెడతాయి. రాయితీలు ఇస్తాయి. పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు ఇస్తాయి. టెలివిజన్‌లో ఆకర్షణీయమైన ప్రకటనలు ప్రసారం చేసి ఊదరగొడతాయి. తమ ప్రోడక్టులు అమ్ముడుపోయేట్లు చేయడానికి నానా పాట్లు పడతాయి.

ప్రస్తుతం ప్రభుత్వాల (కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు) ధోరణి ఇలాగే ఉంది. అవి వస్తువులు అమ్ముకొని లాభాలు గడించే కంపెనీల మాదిరిగా వ్యవహరిస్తున్నాయేగాని పరిపాలన సాగించడంలేదు. ప్రజాక్షేమం కోసం పాటుపడటంలేదు. ఉత్పత్తులు అమ్ముకోవడానికి కంపెనీలు మాయమాటలు చెప్పినట్లే ప్రభుత్వాలు కూడా ‘మాయమాటలు’ చెప్పి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాయి. చిన్న విషయానికీ, పెద్ద విషయానికీ అతిగా ప్రచారం చేస్తూ ప్రజలకు అర చేతిలో స్వర్గం చూపిస్తున్నాయి.

మన తెలుగు రాష్ట్రాలనే తీసుకోండి. ఇద్దరు చంద్రులు ముఖ్యమంత్రుల్లా వ్యవహరిస్తున్నారా? కంపెనీల ఉత్పత్తులు అమ్ముకునే సేల్స్‌మెన్లుగా వ్యవహరిస్తున్నారా? రెండోదే కరెక్టు అనిపిస్తోంది. వీరిద్దరి ఏడాది పాలనను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. అంత చేస్తాం….ఇంత చేస్తాం…అట్ల చేస్తాం…ఇట్ల చేస్తాం…అని ప్రచారాలు చేసుకుంటూ గడిపారు తప్ప ఏమైనా సాధించారా? ఇద్దరు చంద్రులు మాటలు కోటలు దాటించారు.

ప్రజలకు అర చేతిలో స్వర్గం చూపించి ‘మషి పూషి మాయ షేషి’ అనే రీతిగా వ్యవహరించారు. ఈ ధోరణిని కొనసాగిస్తూనే ఉన్నారు. పాలకులు ప్రతి అంశాన్ని ఓట్లు సంపాదించుకునే కోణంలో చూస్తున్నారు తప్ప తమ బాధ్యతగా చేస్తున్నామన్న ధ్యాస లేదు. ప్రధానంగా ఉమ్మడి రాష్ర్టం విడిపోయాక ఇద్దరు చంద్రులు పోటీలు పడుతుండటంతో వారి పనితీరులో ప్రచారం పాలు ఎక్కువైపోయింది.

ఎన్నికల సమయంలో, అధికారంలోకి వచ్చాక చంద్రులు చేసిన ప్రచారం,  చెప్పుకున్న గొప్పలు, మాయ మాటలు వెగటు తెప్పించాయి కూడా. కుప్పలు తెప్పలుగా వాగ్దానాలు చేసిన ఈ ముఖ్యమంత్రులు వాటిని నెరవేర్చలేక నానా తిప్పలు పడ్డ పరిస్థితి కనబడుతూనే ఉంది. 

అధికారానికి వచ్చిన కొత్తల్లో  తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్  రాష్ట్రాన్ని  సింగపూర్ చేస్తానన్నారు. కౌలాలంపూర్ చేస్తానన్నారు. ఆయా దేశాలకు వెళ్లివచ్చారు కూడా. ఒకసారి పాత బస్తీకి వెళ్లి దాన్ని ఇస్తాంబుల్ నగరంలా చేస్తానన్నారు. ఓసారి కొందరు బ్రిటన్ ప్రతినిధులు కేసీఆర్‌తో సమావేశమయ్యారు. వెంటనే ఈయన తెలంగాణను చదవుల్లో లండన్ మాదిరిగా చేస్తానన్నారు. ఒకసారి  టునీషియా ప్రతినిధులు కేసీఆర్‌ను కలుసుకున్నారు. హైదరాబాద్‌ను టునీషియాలా చేస్తానని ప్రకటించారు. జనవరి ఒకటో తేదీనాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభించిన కేసీఆర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. నగరాన్ని ‘సిగ్నల్స్ ఫ్రీ సిటీ’గా మారుస్తామన్నారు. ఆ వెంటనే దీన్ని డల్లాస్ నగరంలా తీర్చిదిద్దుతామన్నారు. ‘బంగారు తెలంగాణ’ పదాన్ని చూయింగం డైలాగ్‌లా తయారుచేశారు. హైదరాబాదును  విశ్వనగరంగా చేస్తానని ఊదరగొట్టిన ఆయన  ఇప్పుడు దాన్ని  ‘చెత్త’ నగరంగా మార్చారు. మున్సిపల్ కార్మికుల సమ్మె రెండు వారాలకు చేరుకున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తన నియంతృత్వ ధోరణిని చాటుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబుదీ ఇటువంటి వైఖరే. ఒక ఇండియా టుడే సంచికలో ప్రచురితమైన కార్టూన్ చంద్రబాబు  వ్యవహారశైలికి అద్దం పడుతోంది. చంద్రబాబు సామాన్యుడి ముందు ఓ బడా పెట్టుబడిదారుడి చిత్రపటం పెట్టి ‘‘ఇది నువ్వే…రాజధానే కాదు నిన్ను కూడా సింగపూర్ దొరలాగా చేద్దామని నా ప్లాను’’ అని బిగ్గరగా నవ్వుతుంటాడు. సామాన్యుడు ఆశ్చర్యకరంగా చూస్తుంటాడు.. వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రా ఎలా ఉంటుందో తెలియదుగాని బాబు మాత్రం స్వర్గం చూపించేస్తున్నారు. ప్రజలను ఆకాశ వీధిలో విహరింపచేస్తున్నారు. ఓ పక్క సింగపూర్ మంత్రం పఠిస్తున్నారు. మరో పక్క జపాన్ జపం చేస్తున్నారు. ఆ రెండు దేశాలను నేరుగా ఆంధ్రాలో దింపేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చూడబోతే సగం పరిపాలన ఈ రెండు దేశాలే ప్రభుత్వాలే చేసేటట్టుగా ఉన్నాయి. ఆంధ్రను సింగపూర్ చేస్తానని ఎన్నికల సమయం నుంచి చెబుతున్న జపాన్ వెళ్లగానే ఆంధ్రలో టోక్యోవంటి నగరాలు నిర్మిస్తామని అన్నారు.

చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ తాము చేసిన అపరిమితమైన వాగ్దానాల కారణంగా, అతి ప్రచారం కారణంగా ఇప్పడు చిక్కుల్లో పడుతున్నారు. వారి మాటల కోటల్లో వారే బందీలవుతున్నారు. ప్రజలకు అపరిమితమైన ఆశలు కల్పించి వాటిని నెరవేర్చలేక, అనేక నిబంధనలు విధిస్తూ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు.. 

ప్రభుత్వాలు చేస్తున్న అతి ప్రచారాలు ఎలాంటి అనర్థాలకు దారి తీస్తాయో గోదావరి పుష్కరాల రోజున ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో జరిగిన ఘోర దుర్ఘటన నిరూపిస్తోంది. చంద్రబాబు నాయుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం చేసిన అతి ప్రచారమే రాజమండ్రి  దుర్ఘటన జరగడానికి ప్రధాన కారణమని మీడియా మాత్రమే కాదు, రోజూ టీవీ ఛానెళ్లలో ఆధ్యాత్మిక  ప్రవచనాలు చేస్తున్న పండితులు కూడా చెప్పారు.

పుష్కరాల గురించి భక్తి ఛానెళ్లు ప్రచారం (కార్యక్రమాలు) చేయడం వేరు. కాని ఆంధ్రాలో పుష్కరాలపై ప్రభుత్వమే భారీఎత్తున ప్రచారం చేసింది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, పాల్గొనకపోవడం వ్యక్తిగత వ్యవహారం. పుష్కరాల్లో పాల్గొనకపోతే మహాపాపమన్నట్లుగా ప్రచారం సాగింది. భక్తులు, యాత్రికులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయడం వరేక ప్రభుత్వం చేయాల్సిన పని. కాని పనిగట్టుకొని దాన్ని గురించి ప్రచారం చేయాల్సిన పని సర్కారుది కాదు. పుష్కరాలపై రెండు రాష్ర్ట ప్రభుత్వాలూ ప్రచారం చేశాయి. పేదల సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం చూపుతున్న పాలకులు పుష్కరాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. వీటిని ‘మహా పుష్కరాలు’ అంటూ తప్పుడు ప్రచారం చేశారు. కుంభమేళాను తలదన్నే రీతిలో నిర్వహిస్తున్నామన్నారు. చరిత్రలో నిలిచిపోయే రీతిలో చేస్తామన్నారు. పుష్కరాల్లో పాల్గొనని వారు నరకానికి పోతారన్నట్లుగా ప్రచారం సాగింది.

అయితే ఆంధ్రలో ప్రభుత్వం రాజమండ్రి పైనే ఎక్కువ దృష్టి పెట్టి దాని మీదనే ఎక్కువ ప్రచారం చేసింది. రాజమండ్రిలో స్నానం చేస్తేనే పుణ్యం వస్తుందనే భావన ప్రజల్లో నాటుకునేలా ప్రచారం సాగింది. దీనితోడు తొక్కిసలాట జరిగిన ఘాట్‌పైనే ఎక్కువ ప్రచారం జరిగిందనే వార్తలు కూడా వచ్చాయి. రాజమండ్రిలో ముప్పయ్ ఘాట్లున్నా ఇదొక్కటే ప్రధానమైందనే తరహాలో వ్యవహరించారు. దుర్ఘటనకు కారణం చంద్రబాబు నాయుడేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మీడియాలోనూ ఈ విధమైన కథనాలే వస్తున్నాయి. వీవీఐపీల కోసం ప్రత్యేక ఘాట్ ఉండగా చంద్రబాబు కుటుంబం, మంత్రులు, ఉన్నతాధికారులు దుర్ఘటన జరిగిన ఘాట్‌లోనే పట్టుబట్టి స్నానాలు, పూజలు చేశారని, అధికారులు చెప్పినా వినకుండా చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించారని సమాచారం. జనసందోహం లేని సమయంలోనే వీవీఐపీలు వచ్చి వెళ్లాలని నిబంధనల్లో స్పష్టంగా ఉందట….! అయినా ఖాతరు చేయలేదట….! పైగా పుష్కరాలపై డాక్యుమెంటరీ చిత్రీకరణ కోసం జనం అధికంగా ఉండాలని, తాను కూడా అక్కడే స్నానం చేస్తానని బాబు పట్టుబట్టినట్లు పత్రికలు కథనాలు రాశాయి. ఈ డాక్యుమెంటరీ ద్వారా జాతీయ స్థాయిలో తన నిర్వహణా సామర్థ్యాన్ని ప్రచారం చేసుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేశారట…!

దుర్ఘటన ఎలా జరిగిందనే దానిపై అనేక రకాల కథనాలు  వినబడుతున్నప్పటికీ ‘ప్రచార కండూతి’ అనేది ప్రధాన కారణంగా కనబడుతోంది. తెలంగాణలో ‘వీవీఐపీ కల్చర్’ కనబడలేదని తెలుస్తోంది. కోట్లు ఖర్చు చేసినా బాబుకు మంచి పేరు రాలేదు. ప్రమాదానికి ఆయనే ప్రధాన కారకుడని చెబుతున్నా ఆయనైతే ‘బకరా’ కాడు గదా….! ఆ దురదృష్టవంతుల కోసం వెతుకున్నారు. 

మేనా