భారతీయ జనతా పార్టీకి 'హిందూత్వ పార్టీ' అనీ, 'హిందూ అతివాద భావజాలం గల పార్టీ' అనీ ఓ గుర్తింపు వుంది. అది చెడ్డదా.? మంచిదా.? అన్నది వేరే విషయం. ఆ ఇమేజ్ కారణంగా, భారతీయ జనతా పార్టీకి 'ముస్లిం' ఓట్లు చాలావరకు దూరం.. అనేది నిర్వివాదాంశం. అయితే, బీజేపీ నేతలు ఈ వాదనతో విభేదిస్తారు. 125 మంది భారతీయుల్లో ముస్లిం ఓటర్ల మద్దతు లేకుండా నరేంద్రమోడీ ప్రధాని ఎలా అవుతారు.? అన్నది బీజేపీ వాదన.
బీజేపీ వాదన వేరు, వాస్తవం వేరు. ఆ వాస్తవమేంటో బీజేపీకి తెలుసు. నరేంద్రమోడీకి ఇంకా బాగా తెలుసు. అందుకే, మైనార్టీ ఓటు బ్యాంకుని టార్గెట్ చేశారు. మొత్తంగా, ముస్లిం మత పెద్దలు వ్యతిరేకిస్తున్నా, ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ససేమిరా అంటున్నా, 'ట్రిపుల్ తలాక్' విధానంలో నరేంద్రమోడీ తనదైన ఆలోచనతో ముందడుగు వేస్తున్నారు.
'మహిళ ఎక్కడైనా మహిళే.. హిందూ మతంలో అయితే, చట్ట ప్రకారం విడాకులు తీసుకోకుండా ఓ భర్త, తన భార్యను వదిలి, ఇంకో మహిళను పెళ్ళాడటం కుదరదు. తద్వారా ఓ వ్యక్తిని పెళ్ళాడిన మహిళకు చట్టబద్ధంగా రక్షణ లభిస్తోంది.. అదే రక్షణ ముస్లిం మహిళలకు ఎందుకు దక్కకూడదు.?' ఇదీ నరేంద్రమోడీ ప్రశ్న. ఇప్పటిదాకా ఈ విషయమై బీజేపీ నేతలు మాత్రమే స్పందించారు. ఇప్పుడిక స్వయంగా నరేంద్రమోడీ రంగంలోకి దిగేశారు.
నిజానికి, ముస్లిం మహిళల్లో చాలామంది 'ట్రిపుల్ తలాక్' బాధితులే. అనేక గణాంకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. కానీ, ముస్లిం మత పెద్దలు ఈ వాస్తవాన్ని అంగీకరించే పరిస్థితుల్లేవు. ట్రిపుల్ తలాక్ విషయమై సుప్రీంకోర్టు స్పందనతో, నరేంద్రమోడీకి భలే ఛాన్స్ దొరికింది. స్వయంగా కొందరు ముస్లిం మహిళలు, నరేంద్రమోడీకి మొరపెట్టుకుంటున్నారు 'ట్రిపుల్ తలాక్' విధానాన్ని రద్దు చేయాలని. ఇకనేం, నరేంద్రమోడీ చెలరేగిపోకుండా వుంటారా.?
ఈ వివాదంతో మొత్తంగా ముస్లిం సమాజానికి సంబంధించి పురుష ఓటర్లంతా నరేంద్రమోడీకి వ్యతిరేకంగా పనిచేసినా, మహిళా లోకం గంపగుత్తగా నరేంద్రమోడీకి మద్దతుగా నినదించే అవకాశాలున్నాయన్నది బీజేపీ అంచనా. ఆ అంచనాలు నిజమయ్యే రోజు అతి త్వరలోనే వుందని బీజేపీ నేతలు అప్పుడే సంబరాలు షురూ చేసేశారు.
రాజకీయ ఉద్దేశ్యాలు, రాజకీయ అవసరాలు పక్కన పెడితే, చాలామంది మహిళల్ని ట్రిపుల్ తలాక్ వేధిస్తోంది. బాధిత మహిళలు, ట్రిపుల్ తలాక్ విధానంతో తాము నరకాన్ని చవిచూశామని వాపోతున్నారు. సో, ట్రిపుల్ తలాక్ రద్దయితే.. ముస్లిం మహిళా లోకం, పూర్తిస్థాయిలో స్వేచ్ఛను పొందినట్లే.