ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన జరిగాక, ఆంధ్రప్రదేశ్‌లోని ఏ నగరం అభివృద్ధి చెందుతుంది.? హైద్రాబాద్‌తో సమానంగా, లేదంటే దానికి కాస్త తక్కువలో అయినా అభివృద్ధి చెందేందుకు ఏ నగరమైనా అనుకూలంగా వుందా? లేదా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు తలెత్తాయి. హైద్రాబాద్ ఫ్యాషన్ ట్రెండ్స్‌కి కేరాఫ్ అడ్రస్.. ఖరీదైన పార్టీలకీ, ఇతరత్రా సినీ కార్యక్రమాలకీ.. ఇంకోటీ ఇంకోటీ.. చెప్పుకుంటూ పోతే చాలానే. ఇవన్నీ హైద్రాబాద్‌కి కొత్త గ్లామర్‌ని తీసుకురావడమే కాదు, ఆర్థికంగానూ ఉపయోగపడ్డాయి.
జనం ఖర్చు ఎక్కడ ఎంత ఎక్కువ చేస్తే ప్రభుత్వానికి అంతగా ఆదాయం లభిస్తుంది. ఆ స్థాయిలో ఖర్చు, ఆంధ్రప్రదేశ్‌లో ఏ నగరంలోనూ వుండదనేది నిర్వివాదాంశం. విశాఖలో హైఫై కల్చర్ కాస్త వున్నా, హైద్రాబాద్‌తో పోల్చితే చాలా తక్కువ. విజయవాడ ఇందుకు మినహాయింపేమీ కాదు. మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్.. ఇవేవీ హైద్రాబాద్ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా లేవు.
కానీ, క్రమక్రమంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ట్రెండ్ మారుతోంది. సినిమా ఫంక్షన్లూ జరుగుతున్నాయి. ఫ్యాషన్ షోలు కావుగానీ, ఆ స్థాయిలో ఏదో ఒక కార్యక్రమం జరుగుతోంది. పబ్ కల్చర్ కూడా ఇప్పుడిప్పుడే వేళ్ళూనుకుంటోంది. తుపాను దెబ్బకి విశాఖ కాస్త కుదేలైందిగానీ, త్వరగానే తేరుకుంది. ఆ దెబ్బ తగలకుండా వుండి వుంటే, విశాఖ ఊహించని రీతిలో వెలిగిపోయేదే.
మొత్తమ్మీద, హైద్రాబాద్‌తో సమానంగా అనలేంగానీ, సమాంతరంగా పోటీ పడేందుకు విశాఖ, దాంతోపాటుగా విజయవాడ నగరం కూడా పోటీ పడే అవకాశాలైతే భవిష్యత్తులో లేకపోలేదు.