ఇట్‌ హ్యాపెన్స్‌ ఓన్లీ ఇన్‌ ఇండియా.!

సామాన్యుడి స్కూటర్‌లో పెట్రోల్‌ కొట్టించాలంటే లీటర్‌కి అరవై రూపాయలకు పైనే చెల్లించుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో కన్నా తెలంగాణలో ఇంకో రెండ్రూపాయలు అదనంగానే పలుకుతోంది పెట్రోల్‌ ధర. ప్రస్తుతానికి అరవై ఐదు రూపాయలకు అటూ ఇటూగా పెట్రోల్‌…

సామాన్యుడి స్కూటర్‌లో పెట్రోల్‌ కొట్టించాలంటే లీటర్‌కి అరవై రూపాయలకు పైనే చెల్లించుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో కన్నా తెలంగాణలో ఇంకో రెండ్రూపాయలు అదనంగానే పలుకుతోంది పెట్రోల్‌ ధర. ప్రస్తుతానికి అరవై ఐదు రూపాయలకు అటూ ఇటూగా పెట్రోల్‌ ధర వుందిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో.

అదే, విమానంలో ఉపయోగించే ఏటీఎఫ్‌ (ఏవియేషన్‌ టర్బయిన్‌ ఫ్యూయల్‌) ధర ఎంతో తెలుసా? జస్ట్‌ 52 రూపాయల 42 పైసలు మాత్రమే. పోటీపడి మరీ, విమానయాన రంగాన్ని ప్రోత్సహించేందుకు వివిధ రాష్ట్రాలు ఏటీఎఫ్‌పై ట్యాక్స్‌లను తగ్గిస్తున్నాయి. విమానయానంపై వివిధ రాష్ట్రాలకు వున్న మక్కువ అలాంటిది. సామాన్యుడేం పాపం చేశాడోగానీ, పాలకులు సామాన్యుడి నడ్డి విరుస్తూ అదనంగా పెట్రోల్‌పై టాక్స్‌లను రుద్దేస్తున్నాయి.

ఏమన్నా అంటే, పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే కదా, ప్రజలకు సుపరిపాలన అందించేది.. అంటూ అతి తెలివి వాదనకు ప్రభుత్వాలు ఎప్పుడూ సిద్ధంగా వుంటాయనుకోండి.. అది వేరే విషయం. విమానాలకు లేని ఇంధన పన్నులు, వాతలు.. సామాన్యుడి చిన్న చిన్న వాహనాలకే ఎందుకు.? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఎవరి వద్దా వుండదు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిదే.. సామాన్యుడికి నిత్యావసర వస్తువుల ధరల నుంచి కాస్త ఊరట లభిస్తుంది. మరీ ముఖ్యంగా డీజిల్‌ ధర తగ్గితే, దానివల్ల సామాన్యుడికి కలిగే ప్రయోజనం అంతా ఇంతా కాదు. ఆర్టీసీ, రైల్వే వంటి సంస్థలకు డీజిల్‌ వినియోగం ఎక్కువ కదా.. వాటికన్నా పన్నుల నుంచి మినహాయింపునిస్తే, సరుకు రవాణా, సామాన్యుల ప్రయాణం.. అన్నీ చవకవుతాయి. కానీ, ఇవేవీ పాలకులకు పట్టని అంశాలు.

ఎవరేమన్నా అనుకోనీ.. చాలా ఎక్కువ ధర వుండాల్సిన ఏటీఎఫ్‌, సామాన్యుడు నిత్యం వినియోగించే పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని చూసి వెక్కిరిస్తోందంటే.. అది పాలకుల పాపమే. ఇట్‌ హ్యాపెన్స్‌ ఓన్లీ ఇన్‌ ఇండియా.!