తెలంగాణలో ఇవాంకా తప్ప ఇంకో న్యూస్ విన్పించడంలేదు. రేపు.. అంటే, నవంబర్ 28న హైద్రాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్ట్‌ని ప్రధాని నరేంద్రమోడీ జాతికి అంకితం చేస్తారనే వార్తకంటే ఎక్కువగా, ఇవాంక గురించిన వార్తలు విన్పిస్తున్నాయి. ఇవాంక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె కావడంతోనే ఆమెకింత ప్రాధాన్యత. పైగా, ఆమె వైట్‌హౌస్ ప్రతినిథి.. డోనాల్డ్ ట్రంప్ సలహాదారు.. వీటితోపాటుగా, ఆమె మహిళా ఎంటర్‌ప్రెన్యూర్.!
వివిధ దేశాల నుంచి 1500 మందికి పైగా ప్రతినిథులు హైద్రాబాద్‌లో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఈఎస్)లో పాల్గొననున్నారు. ఈ సదస్సుకి సెంటరాఫ్ ఎట్రాక్షన్ ఇవాంకనే. ప్రధాని నరేంద్రమోడీ, మెట్రో రైలు ప్రాజెక్ట్‌ని జాతికి అంకితం చేసిన తర్వాత, జీఈఎస్‌కి హాజరవుతారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, నగరాలు పోటీ పడినా, జీఈఎస్ సదుస్సు హైద్రాబాద్‌కే రావడమంటే చిన్న విషయమేమీ కాదు.
అయినాసరే, ఇవాంక విషయంలో ఇంత 'హడావిడి' అవసరమా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజమే మరి, ఇవాంక దెబ్బకి హైటెక్స్ పరిసరాల్లో కొన్ని స్కూళ్ళకు సెలవులు ప్రకటించేశారట. ట్రాఫిక్ ఆంక్షలు మామూలే. ఎన్నడూ లేని విధంగా ఆ పరిసర ప్రాంతాలన్నీ తళతళ్ళాడిపోతున్నాయి. భారీయెత్తున ఖర్చు చేసి మరీ, ఈ ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కేవలం ఇవాంక కోసమే కాదని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నా.. 100 కోట్లు అంతకు మించి, కేవలం 'ఆకర్షణల కోసమే' ఖర్చు చేయడం విమర్శలకు తావిస్తోంది.
మరోపక్క, ఇవాంకకు ఇచ్చే బహుమతుల విషయమై పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. ఎంత పెద్దయెత్తున అంటే.. దేశవ్యాప్తంగా ఈ బహుమతుల గురించిన ఆసక్తి నెలకొనేంతలా. ఆ బహుమతుల లెక్క పక్కన పెడితే, హైద్రాబాద్‌కి ఇవాంక ఏం తీసుకొస్తుందట.? ఇదిప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఆమె ప్రత్యేకంగా తెచ్చేదేంటి.? ఆమె రావడమే పెద్ద బహుమతి అన్న వాదనా లేకపోలేదు. ఇవాంక రాకతో జీఈఎస్‌కీ కొత్త వెలుగు రానుందనీ, తెలంగాణ రాష్ట్రానికి పెద్దయెత్తున పెట్టుబడులు వస్తాయనీ ప్రచారం జరుగుతోంది. నిజమేనా.? అంటే, ఆ వివరాలు సదస్సు పూర్తయ్యాకే తెలుస్తాయి.
ఇక, ప్రధాని నరేంద్రమోడీ నుంచి ప్రత్యేకంగా ఆశించడానికేమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్ళి, గుప్పెడు మట్టి.. చెంబుడు నీళ్ళు తీసుకెళ్ళిన ఘనుడాయన. మినిమమ్ కర్టసీ.. అని కూడా ఆలోచించని మోడీ నుంచి ఏమన్నా తెలంగాణ ప్రభుత్వం అదనంగా ఆశిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అన్నట్టు, ఆల్రెడీ అమరావతి శంకుస్థాపనలో మోడీ ఔదార్యం.. దగ్గరుండి కేసీఆర్ చూసేశారండోయ్.!