నెత్తురు తోటి తడిచిన నేలల
తెగిన గొంతుకలె విత్తులు అయ్యెను
ఆకశ దిశగా మోరలు ఎత్తి
మెల మెల్లగ మను మొక్కలు ఎదిగెను
నాల్కలు చాస్తూ జ్వలించు మంటల
దేహపు బూడిద విభూది అయ్యెను
నుదుట ధరించగ ఆమంత్రితమై
పోరుభూమికే పోరలు ఉరికెను
ఢిల్లీ గద్దెల గుండెలదరగా
ఆశల రవములు గణగణ మోగెను
తెలంగాణమే ఆత్మగోసయను
నినాదమ్ములే ప్రళయములయ్యెను
ప్రళయానంతర ప్రశాంతబంధుర
వరమ్ముగా రణ ఫలమ్ము వచ్చెను
భరత మాత సిగ విరిసెను మోదుగ
తెలంగాణ నవ రాష్ట్రము వెలిసెను
తెలంగాణ నవ రాష్ట్రము వెలిసెను
ఆశల కన్నుల మెరుపులు మెరిసెను
హర్ష ధ్వనులే మిన్నుల ముట్టెను
ఆనందాశ్రుల మన్నులు తడిసెను
తెలంగాణ నవ రాష్ట్రము వెలిసెను
పోరు దారులలొ బంగరు నిండెను
కలల ధారులలొ నగవులు మురిసెను
బతుకమ్మ వేడుకల పూవులు తొణికెను
తెలంగాణ నవ రాష్ట్రము వెలిసెను
తెలుగు జాతి ఘన చరితను చాటగ
రెండు రాష్ట్రములు వేదిక లాయెను
ఆనందాంబుధి కెరటము లెగసెను
– ఆదర్శిని సురేశ్