ఓ సినిమా సెట్ ల మీద వుండగానే, దాని ప్రమోషన్ కోసం మరో సినిమాను ప్రకటించడం అన్నది తెలుగు సినిమా నిర్మాతలకు అలవాటు. ఈ సినిమా ప్రమోషన్ కో, అమ్మకాలకో దాన్ని వాడుకోవడం మామూలే. బహుశా అలాగే కావచ్చు. ఓ కొత్త వార్త ప్రచారంలోకి తీసుకువచ్చారు.
నాగచైతన్య, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా ఓకె అయిందని, దాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తారని ఫీలర్ వదిలారు. సాయి కొర్రపాటి ఇప్పటికే అవసరాల దర్శకత్వంలో ఊహలు గుసగుసలాడే అన్న సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీని ప్రమోషన్ ఓ పక్క ప్రారంభించారు . అవసరాల పేరంటాల ఇంటర్వూలు ప్రారంభించారు.
అది చాలదన్నట్లు తాజాగా నాగచైతన్యతో సినిమా ఓకె అయిందని ఫీలర్ బయటకు వచ్చింది. నిజానికి నాగ్ అంత సులువుగా ఏ దర్శకుడికి అవకాశం ఇవ్వరు. ప్రూవ్ చేసుకుంటే తప్ప. విక్రమ్ కుమార్ కు కూడా ఇష్క్ హిట్ అయ్యాకే అవకాశం ఇచ్చారు. స్వామి రారా హిట్ తరువాతే సుధీర్ వర్మకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తొలిసినిమా హిట్ కాకుండా అవసరాలకు అవకాశం ఇచ్చారంటే కాస్త నమ్మడం కష్టం. అధికారిక ప్రకటన వస్తే తప్ప.