కోయదొర మాట కోరి కోరి కష్టాలను తెచ్చిపెట్టింది. చిన్నారిని బలిస్తే పట్టిన శని వదులుతుందనుకున్నారు.. తప్పు చేస్తున్నామని తెలిసి కూడా తప్పటడుగు వేశారు.. ఎన్ని ఎత్తులు వేసిన చివరకు పోలీసుల ముందు చిత్తై చేసిన నేరం అంగీకరించక తప్పలేదు. చిన్నపాటి క్లూ కూడా లేని ఈ కేసు చిక్కుముడి విప్పింది ఒక్క బొట్టు రక్తం.. ఆ రక్తమే దంపతుల భరతం పట్టింది. 14రోజుల పాటు పోలీసుల ముప్పతిప్పలు పెట్టిన ఉప్పల్ చిన్నారి బలి కేసుపై ఓ రిపోర్ట్..
ఎలినాటి శని.. వెంటాడే బాధలు… అనారోగ్య సమస్యలు ఆ కుటుంబాన్ని నిత్యం నరకం చూపించాయి. వాటి నుండి విముక్తి పొందాలంటే డాక్టర్ల కన్నా… పూజలే బెటర్ అనుకున్నారు.. నాగరికులై ఉండి అనాగరికులుగా ప్రవర్తించారు. జాతరకు వెళ్లి వస్తే జీవితాలు మారుతాయని భావించారు.. కానీ వారి జీవితం జైలుపాలవుతుందని ఆ దంపతులు ఊహించలేక పోయారు. కోయదొర చెప్పిన మాటలు చెవికెక్కించుకొని చివరకు ఊచలు లెక్కించే పనిలో పడ్డారు.
14రోజులపాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన ఉప్పల్ చిలుకానగర్ లో చిన్నారి బలి కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులు కారు డ్రైవర్ రాజశేఖర్, అతని భార్య శ్రీలతే అని తేల్చారు.. ఒక్క రక్తపు బొట్టు ఈ కేసు మిస్టరీని ఇట్టే చేధించింది. అయితే ఈ దుర్మార్గానికి బీజం పడింది జాతరలోనే.. చిలుకానగర్ కు చెందిన రాజశేఖర్ వృత్తి రీత్యా కారు డ్రైవర్. అతని భార్యకు కొంత కాలంగా ఆరోగ్యం సరిగా ఉండటం లేదు.
అమావాస్య రోజు కాలుజారి కిందపడటంతో ఇబ్బందులు మరింత పెరిగిపోయాయి. అందులోను ఆర్థిక ఇబ్బందులతో నిత్యం సతమతం అవుతున్నారు. అయితే సమ్మక్క సారక్క దర్శనం కోసం వెళ్లిన ఆ దంపతులకు ఓ కోయదొర దర్శనం ఇచ్చాడు. తియ్యని మాటలతో వారిని మభ్యపెట్టి సమస్యలు పోవాలంటే పాపను బలివ్వాలని చెప్పాడు. అలా బలిస్తే మొత్తం దోశాలన్ని పోయి కుబేర యంత్రం మీ వశమౌతుందని చెప్పాడు.
కోయదొర మాటలను బాగా చెవికెక్కించుకున్న ఆ దంపతులు సికింద్రాబాద్ లోని బోయిగూడలో మూడునెలల పాపను దొంగిలించారు. అక్కడి నుండి నేరుగా ప్రతాప సింగారం మూసి వద్దకు వెళ్లి పాపను బలిచ్చారు. మొండెం, కత్తిని మూసిలో పడేసి తలను మాత్రమే ఇంటికి తీసుకు వచ్చారు. ఆ తరువాత నట్టింట్లో కూర్చొని భార్యభర్తలు పూజలు చేశారు.. ఆ తరువాత తలను ఇంటిపై భాగంలో పెట్టి రాత్రి చంద్రగ్రహణం, ఉదయం సూర్యక్రాంతి పడితే పీడా విరగౌతుందని భావించారు.. ప్లాన్ ప్రకారం అనుకున్నది అనుకున్నట్లైంది. ఇంతలో డ్యామిట్ కథ కాస్తా అడ్డం తిరిగింది. ఇంటిపై భాగంలో తల కనిపించే సరికి చుట్టుపక్కల జనం పోలీసులకు సమాచారం అందించారు.
ఇంకేముంది రంగంలోకి దిగిన పోలీసులు 100సిసి కెమేరాల డేటాను పరిశీలించారు. 40మంది సాక్షులను విచారించి, మరో 45మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 122ఫోన్లు.. 54సెల్ టవర్ ల డేటాను అనలైజ్ చేశారు. అయినా చిన్న క్లూ కూడా చిక్కలేదు. ఇక రాజశేఖర్ చెప్పే విషయాలపైనే పోలీసులకు అనుమానం వచ్చింది. అతని ఇంటిని మరోసారి పరిశీలిస్తే ఒక రక్తపు బొట్టు కనిపించింది. దాన్ని సేకరించిన పోలీసులు తల పడేసిన భవనంపై కారిన రక్తం సేకరించి ఎఫ్ఎస్ఎల్ కి పంపారు. డిఎన్ఎ రిపోర్ట్ ఆ రక్తం పాపదే అని తేలడంతో కేసు చిక్కుముడి వీగిపోయింది.
రిపోర్ట్ చేతికందిన వెంటనే దంపతులను పోలీసులు తమ స్టయిల్ లో విచారించారు. అంతే నేరం అంగీకరించక తప్పలేదు. ప్రతాప సింగారంకి వెళ్లి మూసిలో గాలించిన మిగతా శరీర భాగం మొండెం, కత్తి మాత్రం లభించలేదు. అయితే పాప తల్లిదండ్రులు కూడా ఎవరనేది తేలలేదని ఎవరైన వివరాలు చెబితే వారికి తగిన రివార్డ్ అందిస్తామంటున్నారు పోలీసులు.
మొత్తానికి సాక్షాలు దొరక్కుండా జాగ్రత్త పడిన పోలీసుల ఇన్వెస్టిగేషన్ ముందు నేరస్తుల ఆట కట్టించినట్లైంది. చిన్నారి రక్తపు బొట్టే వారిని బంధీలు చేసింది. నరబలి ఇస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించడం అవివేకమని, జాతకాలు.. పూజలు అంటూ మాంత్రికులు, కోయదొరల మాట వింటే ఇదిగో ఈ దంపుతుల్లానే ఊచలు లెక్కించాల్సి వస్తుందని పోలీసులు హితవు పలికారు.