బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదన్నట్లుగా ఉంది పాపం.. కంచి కామకోటి పీఠాధిపతులవారి దుస్థితి. హత్యానేరం మోపబడి కొన్నాళ్లు జైల్లో కూడా గడిపిన ఈ స్వాములు ఆ తరువాత నిర్దోషులుగా బయటకు వచ్చారు. అయితే.. ఇప్పుడు అదే హత్యకేసును పై న్యాయస్థానంలో అప్పీలు చేసేందుకు మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంచి స్వాములతో మళ్లీ కటకటాలు లెక్కపెట్టించాలని కేసులు తిరగతోడుతున్నారు.
కాంచీపురం వరదరాజస్వామి దేవాలయ మేనేజర్ శంకర్రామన్ అనుమానాస్పద పరిస్థితుల్లో కంచిపీఠంలో హత్యకు గురయ్యారు. ఈకేసులో పీఠాధిపతులు కూడా నిందితులు. ఈ హత్య కేసు దేశవ్యాప్తంగా చాలా పెద్ద సంచలనాన్నే సృష్టించింది. సుదీర్ఘకాలం విచారణ తర్వాత స్థానిక కోర్టు ఈ హత్యకేసులో కంచి పీఠాధిపతుల సహా.. 22 మంది నిందితులు నిర్దోషులు ని తేల్చేసింది.
అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. ప్రస్తుతం పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును విడచిపెట్టదల్చుకోవడం లేదు. దీనిపై అప్పీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ వీరేంద్ర కటారియా ఈమేరకు ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశాలు కూడా ఇచ్చారు. కేసు సీరియస్గా విచారణ సాగితే.. మళ్లీ స్వాములు జైలు పాలవుతారేమోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు.