మోడీ మహాప్రభో.. నా పరువు తీయొద్దు.!

అయ్యోపాపం.. ప్రపంచానికే పాఠాలు చెప్పానని చెప్పుకునే చంద్రబాబుకి ఎంత ఖర్మ వచ్చిపడింది.? దేశంలో చంద్రబాబుకి ముఖ్యమంత్రిగా 13వ స్థానం లభించిందట. ప్రధాని నరేంద్రమోడీ ఆయా రాష్ట్రాల సీఎంల పనితీరు, ఆయా రాష్ట్రాల్లో సంక్షేమ, అభివృద్ధి…

అయ్యోపాపం.. ప్రపంచానికే పాఠాలు చెప్పానని చెప్పుకునే చంద్రబాబుకి ఎంత ఖర్మ వచ్చిపడింది.? దేశంలో చంద్రబాబుకి ముఖ్యమంత్రిగా 13వ స్థానం లభించిందట. ప్రధాని నరేంద్రమోడీ ఆయా రాష్ట్రాల సీఎంల పనితీరు, ఆయా రాష్ట్రాల్లో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరు వంటి విషయాలపై చేయించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయంటూ మీడియా కోడై కూస్తోంది. 

దాసరికం ఏమీ లేదు.. అంతా ఓపెనే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి మొదటి స్థానం.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారికి 13వ స్థానం లభించాయన్నది మీడియా కథనాల సారాంశం. గతంలోనూ జాతీయ స్థాయిలో జరిగిన సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి మెరుగైన స్థానం లభించింది. చంద్రబాబుకి మాత్రం మొదటి నుంచీ ఝలక్కులే. అయినప్పటికీ, చంద్రబాబు 13వ స్థానం తనకు దక్కడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట. 

విదేశీ పర్యటనలో వున్న చంద్రబాబు, తన 'ఆప్తమిత్రుడు' వెంకయ్యనాయుడి వద్ద గోడు వెల్లబోసుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనే ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని పలుమార్లు అభినందిస్తూ వచ్చారు. కేసీఆర్‌, నరేంద్రమోడీని కలిసినప్పుడు ఒకలా.. చంద్రబాబు, నరేంద్రమోడీని కలిసినప్పుడు ఇంకోలా పరిస్థితులు కన్పించేవి. మిత్రపక్షమన్న పేరు తప్ప, చంద్రబాబుని ఎప్పుడూ నరేంద్రమోడీ మిత్రుడిలా చూసిన సందర్భాల్లేవు. 

అమరావతి శంకుస్థాపనకు హాజరయ్యే సమయంలో నరేంద్రమోడీ, చంద్రబాబుకి కేసీఆర్‌ని కలవాల్సిందిగా షరతు పెట్టిన విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించుకోవాల్సిందే. అక్కడా అమరావతి విషయంలో కాస్తో కూస్తో కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు, అమరావతికి తనవంతుగా సహాయ సహకారాలు అందించాలనుకున్నారు. నరేంద్రమోడీ ప్రధాని హోదాలో ఉత్తచేతులతోనే సరిపెట్టారు. ఇలా, ఎప్పుడూ ఎక్కడా ఏ సందర్భంలో చంద్రబాబుని, ఓ ముఖ్యమంత్రిగా.. మిత్రుడిగా నరేంద్రమోడీ లెక్కల్లోకి తీసుకున్న సందర్భాలే లేవు. 

ఏమాటకామాటే చెప్పుకోవాలి.. పరిస్థితుల్ని చూస్తోంటే, 'మీకు నేనే దిక్కు..' అని వెంకయ్యనాయుడు చెప్పిన మాటల్ని గుర్తుచేసుకోకతప్పదు. అందుకే చంద్రబాబు కూడా తనకు పెద్ద దిక్కు అయిన వెంకయ్యనాయుడు వద్ద మొరపెట్టుకోవాల్సి వస్తోందిప్పుడు. త్వరలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నరేంద్రమోడీ సమావేశమవనున్న దరిమిలా, అక్కడే ఈ ర్యాంకుల వ్యవహారంపై అధికారిక ప్రకటన వెల్లడయ్యే అవకాశముందట. ఈలోగా ర్యాంకుల్ని 'మ్యానిప్యులేట్‌' చెయ్యడానికి చంద్రబాబు విశ్వప్రయత్నాలూ చేస్తున్నారట. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు చాణక్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 

ఏదిఏమైనా.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇవ్వడం ద్వారా తానే డిక్టేటర్‌ అన్పించుకుంటున్న చంద్రబాబుకి, నరేంద్రమోడీ ఇచ్చిన ర్యాంకులతో దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిపోయింది. ఇంతకీ, చంద్రబాబు మంత్రాంగం ఫలిస్తుందా.? ర్యాంకులు తారుమారవుతాయా.? ఇంత పబ్లిక్‌ అయిపోయాక, ర్యాంకుల్ని మార్చడం అసాధ్యమేగానీ, చంద్రబాబు ఏడుపుకి నరేంద్రమోడీ కాస్తయినా కరిగితే.. కొంచెం బెటర్‌ ర్యాంక్‌ చంద్రబాబుకి దక్కొచ్చేమో.! 

కొసమెరుపు: తెలంగాణ మిగులు రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్‌ విభజనతో అభివృద్ధిలో వెనక్కి నెట్టేయబడ్డ రాష్ట్రం.. దీనికి కారణం కాంగ్రెస్సే.. అంటూ అప్పుడే టీడీపీ నేతలు బుకాయింపులు షురూ చేసేశారు చంద్రబాబు దక్కిన ర్యాంకుని కవర్‌ చేసుకునేందుకు.