ముంపు మండలాల్లో రాజ్యాంగ సంక్షోభం…!

దేశంలోని ప్రతి ప్రాంతానికీ చట్ట సభల్లో ప్రజాప్రతినిధి ఉండాల్సిందే. పంచాయతీ సభ్యుడు  మొదలుకొని పార్లమెంటు సభ్యుడి వరకు ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తుంటారు. ప్రజావాణిని  గ్రామ పంచాయతీ నుంచి అత్యున్నత చట్ట సభ అయిన పార్లమెంటు…

దేశంలోని ప్రతి ప్రాంతానికీ చట్ట సభల్లో ప్రజాప్రతినిధి ఉండాల్సిందే. పంచాయతీ సభ్యుడు  మొదలుకొని పార్లమెంటు సభ్యుడి వరకు ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తుంటారు. ప్రజావాణిని  గ్రామ పంచాయతీ నుంచి అత్యున్నత చట్ట సభ అయిన పార్లమెంటు వరకు వినిపిస్తఉవుంటారు. ప్రజాస్వామ్యమే మనకు పట్టుగొమ్మ కాబట్టి స్థానిక స్వపరిపాలనా సంస్థలు మొదలుకొని పార్లమెంటు వరకు క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ కారణాలతో ప్రజాప్రతినిధుల స్థానాలు ఖాళీ అయినప్పుడు నిర్ణీత సమయంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంత పకడ్బందీగా ఉండటానికి కారణం ప్రజలకు ప్రజాప్రతినిధులు లేకుండా ఉండకూడదని రాజ్యాంగం నిర్దేశించడమే. అయితే ఒక్కోసారి రాజ్యాంగ నిర్మాతలు ఊహించని పరిణామం కూడా జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితిని వెంటనే చక్కదిద్దకపోతే రాజ్యాంగ సంక్షోభానికీ దారి తీయొచ్చు. దానికి బీజం మన తెలుగు రాష్ట్రాల్లోనే పడింది. 

ప్రజాప్రతినిధులు లేని పోలవరం ముంపు మండలాలు

ప్రజలు తమ సమస్యలను తమ ప్రాంత ప్రజాప్రతినిధుల ద్వారానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతుంటారు. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు ప్రజావాణిని ప్రభుత్వానికి వినిపించి సమస్యలు పరిష్కరింపచేసేది ప్రజాప్రతినిధులే. ప్రభుత్వంతో పోరాడో, బతిమాలో నిధులు, అభివృద్ధి పనులు సాధించేది ప్రజాప్రతినిధులే. ఇంతటి కీలకమైన ప్రజాప్రతినిధులు కొన్ని లక్షల మందికి లేకుండాపోతే ఏమవుతుంది? వారి సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించేవారు ఎవరూ ఉండరు. దాదాపుగా ఒక నియోజకవర్గం ప్రజలకు ప్రజాప్రతినిధి లేకుండాపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయమేనా? ఆ ప్రజలు అలా ఐదేళ్లపాటు అనాథలుగా మిగిలిపోవల్సిందేనా? మిగిలిపోకూడదు.

Click Here For Greatandhra Epaper

కాని ఆంధ్రప్రదేశ్‌ పనర్వ్యవస్థీకరణ సవరణ చట్టం ప్రకారం అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల ప్రజలకు ప్రస్తుతం ప్రజాప్రతినిధులు లేకుండాపోయాడు.  ‘ఆంధ్ర ప్రాంతంలోని భూమి మాకు ఒక్క ఇంచి కూడా అక్కర్లేదు. తెలంగాణను యథాతథంగా ఇవ్వండి చాలు’ అని కేసీఆర్‌ సహా తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్‌ చేశారు. కాని చివరకు ఏమైంది? తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేయడం ద్వారా జూలైలో ఈ మండలాల విలీనం జరిగిపోయింది. 

నిరసించిన తెలంగాణ ప్రభుత్వం

ఈ విలీనాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా ఖమ్మం జిల్లా ప్రజలంతా నిరసించారు. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ బంద్‌ కూడా నిర్వహించారు. ముఖ్యంగా భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని ప్రజలు రోజుల తరబడి ఆందోళనలు చేశారు. ఎవరేం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ మండలాలు ఒకప్పుడు (1956లో తెలంగాణ`ఆంధ్రరాష్ట్రం విలీనం కాకముందు) ఆంధ్ర ప్రాంతానివేనని, ఇప్పుడు మళ్లీ మేం తీసేసుకున్నామని ఎపి ప్రభుత్వం చెప్పింది. అసలు భద్రాచలం ఆలయం కూడా ఆంధ్రాకే రావాలని పేచీ పెట్టారు అక్కడి నాయకులు. అదో పెద్ద వివాదం. ఇక అసలు విషయానికొస్తే… తెలంగాణలోని భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రలో కలిపారు.     అవి: కుక్కునూరు, వేలరుపాడు, వరరామచంద్రాపురం,  చింతూరు, కూనవరం, బూర్గంపాడు, భద్రాచలం (ఆలయ ప్రాంతం మినహా). ఇక్కడే రాజ్యాంగానికి పరీక్ష ఎదురైంది. ఇప్పుడు ధర్మ సందేహం నివృత్తి కావల్సివుంది.  

ఎమ్మెల్యేలు తెలంగాణలో…ఓట్లేసిన జనం ఆంధ్రలో

2014 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఎం తరపున సున్నం రాజయ్య, అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు(వైకాపా), పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు (వైకాపా) ఎన్నికయ్యారు.  ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయి. విభజన ప్రక్రియ జరిగింది కాని రాష్ట్రం అధికారికంగా అప్పటికి విడిపోలేదు. రాజయ్య ఎన్నికైన భద్రాచలం నియోజకవర్గంలో నాలుగు ముంపు మండలాలు ఉన్నాయి. అవి: వరరామచంద్రాపురం, చింతూరు,కూనవరం, భద్రాచలం మండలాలు. ఈ మండలాల. ప్రజలంతా రాజయ్యకు ఓట్లు వేశారు.

Click Here For Greatandhra Epaper

అయితే తీరా ఎన్నిలయ్యాక, రాష్ట్రం విడిపోయాక కొన్నాళ్లకు ఈ నాలుగు మండలాలు ఆంధ్రలో కలిశాయి. చివరకు రాజయ్య స్వగ్రామం సున్నంవారిగూడెం ఉన్న వరరామచంద్రాపురం (విఆర్‌పురం) కూడా ఆంధ్రాకు వెళ్లిపోయింది. ఈయన తెలంగాణ ఎమ్మెల్యేగా ఉండగా, ఓట్లేసిన గ్రామాలు ఆంధ్రకు పోయాయి. పాయం వెంకటేశ్వర్లు ప్రాతినిథ్యం వహిస్తున్న పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు ఆంధ్రలో కలిసింది. తాటి వెంకటేశ్వర్లు ప్రాతినిథ్యం వహిస్తున్న అశ్వారావుపేట నియోజకవర్గంలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు ఆంధ్రలో కలిశాయి. ఇవన్నీ గిరిజన మండలాలు. సహజంగానే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు గిరిజనులే.  మొత్తం ఏడు మండలాలు  ఆంధ్రాలో విలీనం కాగానే తెలంగాణ ప్రభుత్వం వాటిల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించకూడదని, సంక్షేమ పథకాలు అమలు చేయకూడదని, నిధులు ఇవ్వకూడదని,  పింఛన్లు, రేషన్‌ కార్డులు తదితరాలు ఇవ్వకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సమగ్ర సర్వే నుంచి కూడా ఈ మండలాలను మినహాయించారు. వాస్తవానికి ఈ ముంపు మండలాలకు ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు.  అసెంబ్లీలో ఈ మండలాల సమస్యలను ప్రస్తావించాల్సిన బాధ్యత వీరిదే.

రెండు అసెంబ్లీలకూ వెళతామంటున్నారు

 ఈ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీకి వెళ్లగలరుగాని ఆంధ్ర అసెంబ్లీలో స్థానం లేదు కదా…! మరి ఈ ముంపు మండలాల ప్రజలకు ఎమ్మెల్యేలు  ఎవరు? వారిని అనాథలుగా వదిలేయాల్సిందేనా? వారు తమ సమస్యలు ఎవరికి చెప్పకోవాలి? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు కావాలి. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలూ కూడా ఇదే అడుగుతున్నారు. తమను నమ్మి వారు ఓట్లేశారని, వారి బాధలు ఎవరు తీరుస్తారని ఆవేదన చెందుతున్నారు. అందుకే తమను రెండు రాష్ట్రాలకు ఎమ్మెల్యేలుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆ తరువాత రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌ అయిన నరసింహన్‌ను కలిసి విన్నవించారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల  ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. 2019లో మళ్లీ ఎన్నికలు జరిగేవరకూ ఆంధ్ర అసెంబ్లీలో కూడా తాము ఎమ్మెల్మేలుగా కొనసాగుతామని అంటున్నారు. ముంపు మండలాల్లో అభివృద్ధి పనులు చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెబుతున్నా వారికంటూ ప్రజాప్రతినిధులు లేకపోవడం బాధగా ఉంది.  ఇప్పటివరకు ఇలాంటి సమస్య ఏ ఎమ్మెల్యేకూ వచ్చివుండదు. 

ఇలాంటి సంక్షోభం దేశంలో ఇదే తొలిసారి

ఎమ్మెల్యేలు ఒక రాష్ట్రంలో ఉండి, వారిని గెలిపించిన ప్రజలు మరో రాష్ట్రంలో ఉండటం దేశంలో ఇదే తొలిసారని ఈ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని న్యాయ నిపుణులు కూడా అంటున్నారు. రాజ్యాంగానికి పరీక్షేనని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఇది కీలకమైన సమస్య అయినా దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ పట్టించుకున్న దాఖలాలు లేవు. 

-ఎం.నాగేందర్‌

Click Here For Greatandhra Epaper