ఆంధ్ర రాజధాని కట్టడానికి ఏర్పడిన కమిటీ బాబు సారథ్యంలో సింగపూర్ వెళ్లి అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి వచ్చింది. కళ్లు చెదిరిపోయేలా స్కైస్క్రాపర్స్‌తో, ఎమ్యూజ్‌మెంట్ పార్కులతో, నైట్ క్లబ్‌లతో అచ్చు సింగపూరులా ఆంధ్ర రాజధాని తయారుచేయడానికి తగిన మయుడు సింగపూరే అని భావించారు బాబు. ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ ఇడిను రాజధాని కమిటీలో సలహాదారుగా తీసుకున్నారు. ఇంతవరకు స్పష్టంగా తెలుస్తోంది. రాజధాని నిర్మాణంలో, పోర్టుల నిర్మాణంలో, టూరిజం అభివృద్ధి చేయడంలో సింగపూర్ ప్రభుత్వం పాలుపంచుకుంటుందని, యీ విషయంలో జి-టు-జి (గవర్నమెంట్ టు గవర్నమెంట్) ఒప్పందం డిసెంబరు నెలలో ఖరారు కాబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇవి చదివి నేను కాస్త గందరగోళపడ్డాను. సింగపూరు ప్రభుత్వానికి యిదేం పని? ఇతర దేశాల్లో రాజధానులు, పోర్టులు కట్టడానికి వాళ్లకు ఓ మంత్రిత్వశాఖ వుంటుందా? లాభం వస్తే ఏ ఖాతాలో వేస్తారు? అయినా సింగపూరు హైదరాబాదంత చిన్న దేశం కదా, దానికి వుండే మంత్రులెందరు? ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టడానికి వాళ్లకు తీరిక వుంటుందా? ఇప్పుడు కెసియార్ ప్రభుత్వం సంజీవయ్య పార్కులో ప్రపంచంలోనే ఎత్తయిన భవనం కట్టమంటే దానికీ తయారవుతారా? రూ. 30 వేల కోట్ల బజెట్‌తో తెలంగాణలో 2 వేల కి.మీ.ల స్కైవేలు, రీజనల్ రింగ్ రోడ్డు, ఎలివేటెడ్ హైవేలు గట్రా కట్టండి అంటే ఆ పనీ ఒప్పుకుంటారా? ఇలా ప్రపంచమంతా కాంట్రాక్టులు చేయడమేనా ఆ ప్రభుత్వం పని? మరి పరిపాలన ఎప్పుడు చేస్తారు? నాకేమీ అర్థం కాలేదు.
సాధారణంగా దేశంలో ప్రభుత్వ మూలధనంతో ఏర్పరచిన కార్పోరేషన్లు వుంటాయి. అవి అంతర్జాతీయంగా టెండర్ల ప్రక్రియలో పాల్గొని పనులు తెచ్చుకుంటాయి. మన ఒఎన్‌జిసి వుంది. బంగ్లాదేశ్‌లో ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ చేయాలంటే చేస్తామనవచ్చు. మైనింగ్ కార్పోరేషన్ ఆఫ్రికాలో గనులు తవ్వుతాననవచ్చు. వాళ్లు ఆ పనిలో నిపుణులు. ఆ కార్పోరేషన్‌కు చైర్మన్, సాంకేతిక సిబ్బంది గట్రా వుంటారు. అలాటి సందర్భాల్లో భారతప్రభుత్వం పని ఒప్పుకుంది, ఆఫ్రికాలో గని తవ్వుతోంది, బంగ్లాదేశ్‌లో తైలం తీస్తోంది అంటారా? ప్రభుత్వం అనగానే మార్పులకు గురవుతుంది. ఈ ప్రభుత్వం ఒప్పుకున్నది వచ్చే ప్రభుత్వం కొనసాగించాలని లేదు. మాల్‌దీవుల ఎయిర్‌పోర్టు కాంట్రాక్టు జిఎంఆర్ చేతుల్లోంచి ఎలా జారిపోయిందో చూశాం. అది వాళ్ల దేశంలో వాళ్ల ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు. కాంట్రాక్టరును మార్చింది. మరి యిక్కడ మన దేశంలో మన రాజధాని ప్రాజెక్టును వాళ్లు వచ్చి కట్టాలి. ఇప్పుడున్న ప్రభుత్వానికి యిలాటి కాంట్రాక్టు పనులు చేయడంలో ఉబలాటం వుండవచ్చు, తర్వాత వచ్చే ప్రభుత్వానికి ఎందుకొచ్చిన తలకాయ నొప్పి అని మధ్యలో మానేస్తే, మన పని సగంసగం క్షవరమేనా? మొబిలైజేషన్ ఎడ్వాన్సు అని భారీగా తీసేసుకుని ఆ తర్వాత ఆ డబ్బంతా జాతీయం చేసేశాం, వాతాపి జీర్ణం అంటే..? 'ఎస్ మినిస్టర్'లో ఓ ఉదంతం వుంటుంది. ఆఫ్రికా దేశపు నియంత ఒకడు ఇంగ్లండు పర్యటనకు వస్తే అతన్ని మచ్చిక చేసుకోవడానికి బోల్డు గ్రాంట్లు అవీ యిస్తారు, ఖుషామత్ చేస్తారు. తీరా చూస్తే అతను తిరిగి వెళ్లగానే సైనిక తిరుగుబాటు జరిగి కొత్త ప్రభుత్వం వస్తుంది. వీళ్ల డబ్బంతా క్షవరం! రాజకీయాలపై ఆధారపడిన ప్రభుత్వాలతో వ్యవహారాలు యింత క్లిష్టంగా వుంటాయి. అదే కార్పోరేషన్లయితే ప్రభుత్వం మారినా వాటికి చలనం వుండదు.
Click Here For Greatandhra Epaper
ఈ ఒప్పందాల గురించి నాకు పూర్తి అవగాహన లేదు. అందుకే సింగపూరు పేపర్లు ఏమంటున్నాయా అని చూడబోయాను. మన మీడియా అంతా మన ప్రభుత్వనాయకులు ఏం చెపితే అదే వేసేస్తుంది. సింగపూరు మీడియాకు ఆ మొహమాటాలు లేవు కదా. బోఫోర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నపుడు రాజీవ్ గాంధీ నాయకత్వంలోని ప్రభుత్వం పెద్ద హంగామా చేసింది. అలాటి గొప్ప సంస్థ మనకు శతఘ్నులు అమ్మడమే గొప్ప అన్న బిల్డప్ యిచ్చింది. చాలా ఏళ్ల తర్వాత బోఫోర్స్ ఫ్యాక్టరీ వున్న గ్రామంలో యీ ఒప్పందం కుదిరినప్పుడు ఏం జరిగిందో ఒకాయన రాసిన పుస్తకం చదివాను. అసలప్పుడు బోఫోర్స్‌కు బేరాలే లేవుట. ఇండియాతో ఒప్పందం కుదరగానే 'హమ్మయ్య దొరికిందిరా బకరా' అని ఉత్సవాలు చేసుకున్నారట. అది చదివి 'బోఫోర్స్ – తీరానికి అవతలి కథ' అనే పేరుతో ఒక వీక్లీకి వ్యాసం రాశాను. ఇప్పుడైతే యింటర్నెట్ వుంది కాబట్టి సులభంగా ఆ వూరి పేపర్లు చదివేయవచ్చు.
సింగపూర్‌లో ''స్ట్రెయిట్స్ టైమ్స్'' అనే దినపత్రిక చాలా పాప్యులర్ అనుకుంటా. దాని ఆన్‌లైన్ ఎడిషన్ చూశా. తక్కినవీ చూశా. వాళ్లు బాబు పర్యటన గురించి పెద్దగా పట్టించుకున్నట్టు కనబడలేదు. పర్యటనకు ముందు యిచ్చిన న్యూస్‌లో విదేశ వ్యవహారాల మంత్రి కె షణ్ముగం ఆహ్వానం మేరకు బాబు నవంబరు 12 నుంచి 14 వరకు సింగపూర్ వస్తారని, ప్రధానిని యితర మంత్రులను కలుస్తారని సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్, లాండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, హౌసింగ్ డెవలప్‌మెంట్ బోర్డ్, పోర్ట్ అథారిటీ వగైరాల వద్దకు వెళతారని రాశారు. తక్కినవి సదస్సులు! సెప్టెంబరులో సింగపూర్ మాజీ ప్రధాని గో చోక్ టాంగ్ హైదరాబాదు వచ్చి బాబును కలిసి ఆంధ్ర రాష్ట్రపు అభివృద్ధి పథకాల గురించి మాట్లాడారని, సింగపూరు వచ్చి అక్కడి స్థానిక, విదేశీ యిన్వెస్టర్లను కలిసి, తమ రాజధానిని డెవలప్ చేసుకునే అవకాశాలను పరిశీలించమని కోరారని కూడా రాశారు. ఆయన పెట్టుబడిదారుల గురించే మాట్లాడారు కానీ సింగపూరు ప్రభుత్వం డైరక్టు పెట్టుబడుల గురించి కాని, జి-టు-జి పనుల గురించి మాట్లాడలేదు.
ఆంధ్ర రాజధాని గురించి సలహాలు యివ్వబోయే ఖూ టెంగ్ ఛే గారు సింగపూర్ ప్రభుత్వం ఏర్పరచిన సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ అనే సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్. ఆ సంస్థ 2008లో నెలకొల్పారు. నివాసయోగ్యమైన, పదికాలాలపాటు మన్నగలిగిన నగరాలు నిర్మించడం వారి లక్ష్యం. దాని బోర్డులో ఎకడమీషియన్లు, పారిశ్రామికవేత్తలు, వివిధవర్గాల వారు వున్నారు. ఇప్పటిదాకా ఏమైనా నగరాలు నిర్మించారా, వాటి అతీగతీ ఎలా వుందో తెలుసుకుందామని వారి వెబ్‌సైట్ చూశా. నాకేం కనబడలేదు. ఓపికున్నవాళ్లు మరింత లోతుగా పరిశోధించవచ్చు. ఈ ఛే గారు 2010లో దానికి ఇడి అయ్యారు. ఆయన అనేక సంస్థలకు డైరక్టరుగా కూడా వున్నారు. 1992-96 మధ్య అర్బన్ రీడెవలప్‌మెంట్ అథారిటీకి సిఇఓగా వున్నారు. నాకు అర్థమైనంతవరకు సింగపూరు ప్రభుత్వప్రమేయం ఎంతవరకు వుందంటే యీ సంస్థ తరఫున యీ ఛో గారు మనకు సలహాలిచ్చి, ఫలానా వాడి చేత చేయించుకోండి అని కాంట్రాక్టర్లను చూపించడం వరకేనని! బాబు పర్యటన తర్వాత సింగపూరు పేపర్లు హెడ్‌లైన్స్ పెట్టేస్తాయేమోననుకున్నా. ఎందుకంటే ఆంధ్ర రాజధానే నాలుగైదు లక్షల కోట్ల బిజినెస్, దానికి తోడు పోర్టులు, యింత బిజినెస్ వచ్చిందంటే సింగపూరు ప్రభుత్వం తన ఉద్యోగులకు బోనస్ ప్రకటించేయవచ్చు కూడా.
Click Here For Greatandhra Epaper
అయితే ఏ పేపరూ ఏమీ రాయలేదు. ''ఛానెల్ న్యూ ఏసియా'' అనే వెబ్‌సైట్‌లో కనబడిన రిపోర్టు ప్రకారం – 'ఆంధ్ర రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం ముందంజ వేసింది. ఛే రాజధాని సలహా కమిటీలో నియమించబడ్డారు. ఈశ్వరన్ మాట్లాడుతూ ''ఈ అంశంలో సింగపూరు కంపెనీలు పోషించే పాత్రపై మేం దృష్టి సారించాం. ఆంధ్ర ప్రభుత్వానికి, మన వ్యాపార ప్రయోజనాలకు మేలు కలిగేట్లా సింగపూరు ఏ మేరకు పాలు పంచుకోవాలో గణనలోకి తీసుకుంటున్నాం.'' (“What role Singapore companies can play in that regard, this is something that we are focusing on, to see how best we can calibrate Singapore's involvement in the way that it is meaningful to the Andhra Pradesh and Indian government, and at the same time beneficial to our business interests,” said Mr Iswaran..) అన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ ''మీరు భవంతులు కట్టవచ్చు, టౌన్‌షిప్పులు కట్టవచ్చు, కానీ రాజధాని కట్టడమనేది ఎప్పుడో కాని రాని అవకాశం. ఆంధ్ర రాజధాని సింగపూరు సామర్థ్యానికి ప్రతీకగా మిగిలిపోతుంది. (“It is also a one-time opportunity for Singapore. You may construct some buildings, some townships, some ventures, you can do anything, but constructing a capital is unique. It is a one-time opportunity, it will be an icon for Singapore.”) భావాన్ని గ్రహించి, స్వేచ్ఛానువాదాన్ని చేస్తూనే వాళ్లు చెప్పిన మాటలను యథాతథంగా యిస్తున్నాను.
బాబు మాటల బట్టి అర్థమైనదేమిటంటే – విదేశాలలో స్థానిక పరిస్థితుల కనుగుణంగా రాజధానులు కట్టడంలో సింగపూరు వాళ్లకు పూర్వానుభవం ఏమీ లేదు. మన మీద ప్రయోగాలు చేయమని మనమే వాళ్లను ఆహ్వానిస్తున్నాం.
ఈశ్వరన్ మాటల బట్టి అర్థమైనదేమిటంటే – రాజధాని నిర్మాణంలో పాలు పంచుకునేది సింగపూరు ప్రభుత్వం కాదు, సింగపూరు కంపెనీలు!
వీళ్లిద్దరూ అన్నమాటలు ప్రభుత్వస్థాయి చర్చల్లో జరిగినవి కావు. సింగపూర్ నేషనల్ యూనివర్శిటీలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏసియన్ స్టడీస్ అని 2004లో పెట్టిన ఒక ఆటానమస్ రిసెర్చి సంస్థ ఏర్పరచిన 9 వ అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ అన్న మాటలు. వారు ఎకడమియాకు, వ్యాపారస్తులకు సమన్వయం చేస్తూంటారు కాబట్టి వ్యాపారస్తులను కూడా ఆహ్వానించి వారికి బాబు చేత చెప్పించినట్లున్నారు.
అంటే ఆస్ట్రేలియాలో యిప్పుడు మోదీగారి మిత్రుడు అడానీ బొగ్గు ప్రాజెక్టు పెడుతున్నాడుగా, అలాగే సింగపూరు వ్యాపారవేత్తలు మన రాజధాని కాంట్రాక్టులు తీసుకుంటారన్నమాట. వాళ్లకు సింగపూరు ప్రభుత్వం ఆర్థికంగానో, హార్దికంగానో సాయం చేస్తుందేమో మరి! అడానీకి స్టేటు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా ఒక బిలియన్ డాలర్ల ఋణం యిస్తోంది కాబట్టి, స్టేటు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి సంబంధించిన బ్యాంకు కాబట్టి ఆస్ట్రేలియా అభివృద్ధిలో భారతప్రభుత్వం పాలు పంచుకుందని యిది జి-టు-జి ఏర్పాటని అంటే ఎంత అందంగా వుంటుందో ఆంధ్రరాజధాని-సింగపూరు బంధంలో జి-టు-జి వుందని అంటే అంతే అందంగా వుంటుంది.
Click Here For Greatandhra Epaper
పెరటిచెట్టు పనికిరాదా?
'మన దేశపౌరులు ప్రతిభావంతులు, విదేశాలలోని ప్రముఖ కంపెనీలన్నీ మనవాళ్ల సామర్థ్యంపైనే నడుస్తున్నాయి. అందునా మన తెలుగువాళ్లు కొన్ని రంగాలలో మరీ ముందున్నారు. ఐఐటీకి సెలక్టయ్యేవారిలో అత్యధికులు మనవారే.' అని యింత గొప్పగా చెప్పుకుంటాం కదా. మరి తెలుగు రాజధాని కట్టడానికి వీళ్లెవరి ప్రతిభాపాటవాలూ చాలలేదా? పనికి రాలేదా? సింగపూరు నుంచి విదేశస్తుణ్ని దింపాలా? అతనికి స్థానికపరిస్థితులపై అవగాహన వుంటుందా? తెలంగాణలో నేల వేరు, ఆంధ్రలో నేల వేరు, ఇల్లు నిర్మాణవ్యయంలో తేడా వస్తుంది అంటున్నారు. ముంబయిలో బహుళ అంతస్తులు కట్టినా ఫర్వాలేదు, నిరంతర విద్యుత్ సరఫరా వుంటుంది, మన దగ్గర నాలుగు వానచుక్కలు పడితే కరంటు కట్టేస్తారు. కొన్ని రకాల పశువులను వేరే రాష్ట్రం నుండి తీసుకొచ్చినా వాతావరణం పడక చచ్చిపోతున్నాయి. దేశంలోనే యిన్ని తేడాలుంటే విదేశీ వాళ్లకు మన అవసరాలు, అవకాశాలు, మేన్‌టెనెన్స్ లోపాలు, భద్రతా ప్రమాదాలపై అవగాహన వుంటుందా? ఎత్తయిన బిల్డింగులు కట్టడమే అర్హత అనుకుంటే దుబాయిలో యింకా పెద్ద భవనం వుంది కాబట్టి అరబ్ షేక్‌లను తీసుకుని రావచ్చుగా, సింగపూరు వాళ్లే ఎందుకు? అక్కడి బిల్డింగులు వాళ్లే కట్టారో, మన ఎల్ అండ్ టి వారో, చైనావాళ్లో కట్టారో!? ఇలాటిశంకలు వెలిబుచ్చినపుడు 'అబ్బే స్థానికపరిస్థితులపై, రాజకీయనాయకులపై, అధికారగణంపై పూర్తి పట్టు వున్నవారినే తీసుకొస్తున్నాం. అవడానికి సింగపూరు జాతీయులే కానీ భారతీయ మూలాలున్నవాళ్లే' అని జవాబు వస్తుందేమోనన్న భయం కూడా వుంది. గతంలో బిల్లీ రావు వుదంతం చూశాం కదా! ఫ్యాబ్ సిటీ పెట్టినపుడు కూడా యిలాటి హంగే జరిగింది. ఇంకో ప్రాజెక్టు విషయంలో ప్రమోటరును హైదరాబాదులో ఎందుకు పెడుతున్నారు? అని అడిగితే 'మా ఆవిడకు చార్మినార్ గాజులు నచ్చాయ్' అన్నాడు. మనమంతా ఖుష్ అయిపోయాం. చివరకు బోగస్ అని తేలింది. అధికారంలో ఏ పార్టీ వున్నా సరే, విదేశీ పెట్టుబడిదారులంటూ ఎవర్నో పట్టుకుని రావడం రియల్ ఎస్టేటుకు మేలు చేయడం జరుగుతూ వచ్చింది. చివరకు కేసులు పెట్టడంతో ముగుస్తోంది. ఇప్పుడు అదే మరింత భారీ యెత్తున జరుగుతోందేమోనని కించిత్తు సందేహం.
ఈ సమాచారంలోకాని, ఆలోచనావిధానంలో కాని పొరబాటుంటే సవరించమని పాఠకులను కోరుతున్నాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2014)