ఈనాటి సమాజంలో అన్ని చోట్లా, అందరి నోటా వినబడే మాటలు రెండు – టెన్షన్, డిప్రెషన్. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడుతున్నారు, మానసిక రోగాలు పెంచుకుంటున్నారు. సైకియాట్రిస్టుల సంఖ్య దినదినం పెరుగుతోంది, ఆత్మహత్యల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. విద్యార్థులు, గృహిణులు. మధ్యవయస్కులు, రైతులు – ఏ వర్గం తీసుకున్నా జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోలేమనే అధైర్యంతో ఉసురు తీసుకోవడం కనబడుతోంది.
దీనికి కారణం స్థయిర్యం లేకపోవడం. మనిషికి యిన్ని సమకూర్చిన సృష్టికర్త ఆత్మవిశ్వాసాన్ని, చిత్తస్థయిర్యాన్ని యివ్వకుండా వుంటాడా? ఇచ్చే వుంటాడు, కానీ ఆందోళనలో మునిగిన మానవుడు దాన్ని గుర్తించడం లేదు. ఆందోళన తగ్గించుకుంటేనే మనలో వున్న బలమేదో, బలహీనత ఏదో స్పష్టంగా తెలుస్తుంది. బలహీనతలను తగ్గించుకుని, బలాన్ని ద్విగుణీకరించుకుని సరైన దిశలో పయనమైతే చాలు విజయం సిద్ధిస్తుంది. అయితే ఆందోళన తగ్గించుకోవడం ఎలా? మనోవ్యాకులతను అదుపులో వుంచుకోవడం ఎలా?
నా దృష్టిలో మానసిక అశాంతిని దూరం చేయగలిగే టానిక్కులు రెండు – హాస్యం, సంగీతం. మనోవ్యాధికి మందు లేదని పెద్దలంటారు. నిజమే… యివి చెట్ల నుండి, పుట్టల నుండి నూరి తెచ్చే మందులు కావు. హాస్యం, సంగీతం అనుభవించడానికి, ఆస్వాదించడానికి మన జ్ఞానేంద్రియాలకు తోడు సరైన దృక్పథం వుండాలి. ఆ దృక్పథం అలవర్చుకుంటే చాలు మన చుట్టూ వున్న సమాజంలోని మనుష్యుల ప్రవర్తనలో హాస్యం, చమత్కారం గోచరిస్తాయి పెదవులపై చిరునవ్వు మొలుస్తుంది. అలాగే సంగీతాన్ని గ్రహించేలా మన చెవులకు తర్ఫీదు యిస్తే – చెట్ల ఆకుల గలగలలో, ధాన్యం చెరిగే చేటలో, దంచే రోటిలో, పోలీసుల కవాతులో, రైలు పట్టాల మోతలో, మేకపిల్ల అరుపులో, పసిపాప బోసినవ్వులో వినగలిగే వారికి శ్రావ్యమైన సంగీతం వినబడుతుంది.
శ్రావ్యమైన సంగీతం అనేది ఏది? మీకు కోకిలగానంగా అనిపించినది నాకు కాకి అరుపులా తోచవచ్చు. లలిత సంగీతం మిన్న అని నేనంటే, శాస్త్రీయం తప్ప తక్కినదేదీ సంగీతం కాదని మీరనవచ్చు. పాప్ మ్యూజిక్‌తో పోలిస్తే రెండూ చప్పగా వుంటాయని అని మీ పిల్లలు తీసిపారేయవచ్చు. ఒకే సంగీతం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఎందుకు అనిపిస్తుంది? అన్ని రకాల సంగీతాలకూ శ్రోతలున్నారు. వారి వారి అభిరుచి బట్టి ఆ యా సంగీతాలు వింటారు.
అభిరుచి అనేది వారసత్వంగా మనకి సంక్రమించేది కాదు. మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, చిన్నప్పటినుంచి పెద్దలు మనల్ని తీర్చిదిద్దిన తీరును బట్టి మనలో ఏర్పడుతుంది. సాహిత్యకారుల్లో నారికేళపాకం, ద్రాక్షాపాకం అందించే వారున్నట్టే శాస్త్రీయ సంగీతకారుల్లో కూడా గమకవరియికలతో, క్లిష్టమైన స్వరకల్పన, లయవిన్యాసాలతో పాండితీప్రకర్ష ప్రదర్శించే వారు కొందరైతే, శ్రావ్యమైన వరుసలతో ఆకట్టుకునే వారూ వున్నారు.
అసలు సంగీతం ఎలా ఉద్భవించింది అన్న విషయంపై శాస్త్రవేత్తలు, మేధావులు, వేదాంతులు అనేక రకాలైన అభిప్రాయాలు వెలిబుచ్చారు. అనాది నుంచీ మానవుడు తన ఉత్సాహ ఉద్రేకాలను, సుఖదుఃఖాలను కంఠస్వరం ద్వారానే వ్యక్తం చేస్తూ వచ్చాడు. తీరిక వేళల్లో తన మనస్సుకు ఉల్లాసం కలిగించే ఆటపాటలు సృష్టించుకున్నాడు. ప్రకృతి ఒడిలో పెరిగిన ఆదిమానవుని చుట్టూ వున్న అనంతమైన ప్రకృతి అతని పాఠశాల. ప్రకృతిలోని ప్రతి దృశ్యం, ప్రతి ధ్వని అతణ్ణి ప్రభావితుణ్ని చేశాయి.
వర్షాకాలపు మేఘగర్జన, పౌర్ణమినాటి సముద్రపు ఘోష, కొండలోయల ప్రతిధ్వనులు, ఉల్లాసంగా తొండం పైకెత్తి ఏనుగు చేసే ఫీుంకారం, ఆకలితో వున్న సింహగర్జన, వినీలాకాశంలోకి రివ్వున ఎగిరిపోయే పిట్ట కూత, బెబ్బులి గాండ్రింపు – యిలాటి ధ్వని విశేషాలన్నీ ఆదిమానవుడికి ఉత్సాహ ఉద్రేకాలు, భయాందోళనలు కలుగచేసినవే. వీటిని అనుకరిస్తూ ఆటవికులు ‘ప్రకృతి పాటకచేరీలు’ చేసేవారట.
మానవుడి శ్రవణేంద్రియం అనేక ధ్వనులను వడబోసి, అతణ్ని పరవశుణ్ని చేసేది. స్వరసౌందర్యం కోసం అతని అన్వేషణ సాగుతూనే వచ్చింది. గుండె నింపుకోలేనంత సంతోషం పెల్లుబికి పైకి వచ్చినపుడు గాని, గుండెలు బ్రద్దలు చేసే దుఃఖం అతణ్ని ముంచెత్తినపుడు గాని అతని కంఠం లోంచి చీల్చుకుని వచ్చిన మహత్తర ధ్వని విశేషం ఏదో అతణ్ని ఆకర్షించి ఆకట్టుకుంది. ఆ ధ్వని విశేషమే సంగీతంలో మొదటి స్వరం అని కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. పాలగుమ్మి విశ్వనాథం గారి రచనల ఆధారంగా నేను కొన్ని సాంకేతిక విషయాలు మీతో పంచుకుంటున్నాను. ముందుగా వారికి నా కృతజ్ఞతలు.
సంగీతకళకు పునాది అయిన ఆ మొదటి స్వరం ధ్వని శాస్త్రానికి సంబంధించిన కొన్ని సూత్రాలకు కట్టుబడి వుంటుంది. ఇంకోలా చెప్పాలంటే, సెకండ్‌కి 240 ప్రకంపనాలు కలిగి వున్నది ‘షడ్జస్వరం’ (స) అన్నమాట. ఆ స్వరానికి రంజింపచేసే స్వభావం వుంటుంది. వేదపఠనం ఒకప్పుడు ఏకస్వర గాయన పద్ధతిలోనే ఉండేది. ఆ తర్వాత మానవమేధ మరొక స్వరం కనుక్కోవడంతో, ద్విస్వర గాయన పద్ధతి వచ్చింది. (సెకనుకు 270 ప్రకంపనాలైతే ‘రి’) ఆదిజాతుల తెగలలో అనేక తెగలు పాటలు రెండు స్వరాల సంగీతమే.
మరి కొంతకాలానికి త్రిస్వరగాయన పద్ధతి.. (సెకనుకు 300 ప్రకంపనాలైతే ‘గ’) సామవేదకాలం నాటికి, ఉదాత్త, అనుదాత్త స్వరితాలతో సామగానం అయింది. క్రమేణా యింకో రెండు స్వరాలు చేరి (‘మ’ అంటే సెకనుకి 320 ప్రకంపనాలు, ‘ప’ అంటే 360 ప్రకంపనాలు) అయిదు స్వరాలై వాటి రాగాలను ఔడవ రాగాలన్నారు. ‘మోహన’, ‘హంసధ్వని’ ఔడవ రాగాలే. మరి కొంతకాలానికి మరి రెండు (సెకనుకి 405 ప్రకంపనాలతో ‘ద’. 450 ప్రకంపనాలతో ‘ని’) వచ్చి సప్తస్వరాలు ఏర్పడ్డాయి. ప్రపంచంలో ఏ సంగీతానికైనా వుండేవి ఈ సప్తస్వరాలే.
ఆదిమవాసుల సంగీతం స్థాయి ఎదిగి పల్లెసీమల్లో జానపద సంగీతంగా రూపురేఖలు దిద్దుకుంది. ఈ సంగీతంలో ధాతుమాతువులు సమతూకంలో ఉంటాయి. జానపద సంగీతంలో ఒక పరిధిలో వున్న రాగపద్ధతి పెరిగి, జనక, జన్య, భాషాంగ, ఉపాంగ రాగాలుగా విస్తరిల్లింది. ప్రాచీన నాగరికత వర్ధిల్లిన దేశాలలో సంగీతకళ గురించి లోతైన పరిశీలన జరిగింది. గ్రీస్ దేశంలో జ్ఞానులందరూ సంగీతానికి సముచిత స్థానం యిచ్చారు.
ఈ విశాల విశ్వంలో ఏ గణితశాస్త్ర సూత్రాల ప్రకారం – సకల గోళాలు తిరుగుతున్నాయో, ఆ సూత్రాలే నాదాన్నీ, లయనీ నడుపుతున్నాయని పైథాగరస్ అభిప్రాయం. సంగీతం ఈ విశ్వాన్ని ప్రతిబింబింప చేయడమే కాదు, విశ్వంపై తన ప్రభావం చూపగల కళ అని కూడా అన్నాడు. సత్యసౌందర్యాన్వేషణలో నిమగ్నం కావడానికి సంగీతం ఉపకరిస్తుందని అరిస్టాటిల్ అన్నాడు. మనస్సుకి శిక్షణ యివ్వడానికి విద్యావిధానంలో సంగీతం ఒక అంశంగా వుండాలని ప్లేటో అన్నాడు.
ప్రాచీన చైనా దేశంలోకూడా సంగీతానికి ఎంతో ప్రాముఖ్యత వుండేది. ‘హృదయంలోని వివేకమే సంగీతం’ అన్నాడు కన్‌ఫ్యూషియస్. చైనా దేశంలో ఏ సంగీతం ఎప్పుడు వాడాలీ అనే విషయమై చట్టాలు వుండేవి. ఒక్కొక్క ఋతువుకు ఒక్కొక్క సంగీతం వినిపించాలి. ఋతువు మారినప్పుడల్లా దేశం నలుమూలలా నగారాలు మ్రోగించేవారట. మన భారతీయ శాస్త్రీయ సంగీతంలో కూడా వివిధ రకాలైన సంగీతానికి కొన్ని కొన్ని రాగాలను, కొన్ని కొన్ని సమయాలను నిర్దేశించారు.
పగలు ప్రథమ యామం (యామం అంటే మూడు గంటలు) అంటే సూర్యోదయం నుండి మూడు గంటల పాటు – శాంత, భక్తి రసాలకు అనుకూలాలు. అప్పుడు భూపాల, భైరవి, బిలహరి వంటి రాగాలలో కూర్చిన గీతాలు అనువుగా వుంటాయి. పగలు తృతీయ యామంలో వీర, గంభీర, రౌద్రరస స్ఫోరకమైన మధ్యమావతి, నీలాంబరి, శుద్ధ సారంగ వంటి రాగాలలో కూర్చిన గీతాలు, సూర్యాస్తమయ సమయంలో, కరుణ, నైరాశ్య, వియోగ, విషాద, రసాలుట్టిపడే పూర్విమారువ, శ్రీ గౌరి మొదలైన రాగాల పాటలు వింటే బాగుంటాయి.
రాత్రి సమయానికి వచ్చేసరికి తొలియామంలో కళ్యాణకార రస ప్రధానమైన నట, కళ్యాణి, మోహన, కేదార రాగాలలో, ద్వితీయ యామంలో శృంగార రస ప్రధానమైన కాఫీ, బాగేశ్రీ, శహన వంటి రాగాలలో పాడడానికి యోగ్యంగా వుంటాయి. తెల్లవారురుఝామున భక్తి రసానుకూలమైన సమయం కాబట్టి బిలావల్, పంతువరాళి వంటి రాగాలలో పాడవచ్చు.
అయితే ప్రయోక్తలు యిలా పరిమితం చేసుకోలేదు. పూర్వసంగీతశాస్త్ర గ్రంథాలలో చెప్పినదాని ప్రకారం ` గాంధార (గ), నిషాద (ని) స్వరాలు కరుణరసానికి, మధ్యమ (మ), పంచమ (ప) స్వరాలు హాస్యశృంగార రసాలకు, ధైవత (ద) స్వరం బీభత్స, భయానక రసాలకు వాడాలి. రాగాల పరంగా చెప్పాలంటే – భైరవి రాగం రౌద్ర రసానికి, భూపాల రాగం శృంగార రసానికి, ఫలమంజరి రాగం కరుణరసానికి, వసంత రాగం హాస్యరసానికి, మాళవ రాగం భయానక రసానికి, బంగాళా రాగం అద్భుత రసానికి, నాట రాగం వీర రసానికి వాడాలని చెప్పారు.
కానీ సంగీతంలో ప్రయోగాలు చేస్తూ వచ్చిన వాగ్గేయకారులు అన్ని రాగాలనూ భక్తి రసాన్ని, శృంగారరస పూరితమైన మధురభక్తి పోషించడానికి వినియోగించారు. భూపాల రాగంలో ఎన్నో మేలుకొలుపు పాటలు వినిపించారు. బీభత్సరసానికి గుర్తుగా చెప్పిన శ్రీ రాగంలో ‘ఎందరో మహానుభావులు’ పాడారు త్యాగరాజస్వామి.
ఫలానా రాగం వినిపిస్తే ఫలానా భావం ఉద్దీప్తమై ఫలానా వ్యాధి నయం అవుతుందని మ్యూజిక్ థెరపిస్టులు అంటున్నారు. మరి ఒకే రాగంలో వివిధ రకాలైన భావాలు పలికించ గలిగినపుడు ఏ భావాన్ని వ్యాధిగ్రస్తుడు గ్రహిస్తాడన్నది పరిశీలించ వలసిన విషయం. ఏది ఏమైనా సంగీతం వలన ఆరోగ్యం మెరుగుపడుతుందనే వాదన అనాదిగా వుంది. ఆదిమ జాతుల్లో వైద్యం చేసే వ్యక్తి రోగికి మందు యిచ్చేటప్పుడు, ఊగుతూ మంత్రం చదువుతున్నట్లు పాట పాడుతూ మందు యిస్తాడు. వ్యాధులని బట్టి పాడే తీరు కూడా మారుతుంటుంది. వ్యాధి ఉధృతాన్ని బట్టి పాట తీవ్రత కూడా పెరుగుతుంది.
పాటలో సంగీత సాహిత్యాలు ఏ నిష్పత్తిలో సమకూరాలన్నది కూడా ఆలోచించ దగిన విషయమే. రామదాసు, త్యాగరాజు, అన్నమయ్య వంటి వాగ్గేయకారులు సంగీతసాహిత్యాలు రెండింటిలోనూ సామర్థ్యం సంపాదించుకుని కీర్తనలు రచించారు. వారిలోని ఆవేదన, ఆర్తి సరళమైన పదజాలంతో సహజ సంగీతకవచంతో అలవోకగా, ఆశువుగా వారి గళాల నుండి వెలువడ్డాయి. వీరి వలన ప్రభువుల ఆస్థానాలలో వినిపించే ఉత్తమ సంగీతం ప్రజాబాహుళ్యం మధ్యకు వచ్చింది.
అలాగే శ్రుతిలయలను సంగీతానికి మాతాపితలంటారు. సంగీతంలో మైమరపించే గుణం కలిగిన నాద విశేషాన్ని ‘శ్రుతి’ అని స్థూలంగా చెప్పుకోవచ్చు. మనల్ని రంజింపచేసే గాత్రాలు గాని, వాయిద్యాలు గానీ శ్రుతిపక్వంగా వుంటాయి. ఇక లయ విషయానికి వస్తే సృష్టిలో ప్రతి కదలికలో లయ వుంది. ఆదిమవాసుల సంగీతం లయప్రధానమైనది. శ్రుతి జోకొడితే, లయ మేల్కొల్పుతుంది, గంతులేయిస్తుంది.
ఇక వాయిద్యాల విషయానికి వస్తే – గాలి వాయిద్యాలు (వేణువు, కొమ్ము బూరా వంటివి), తంతి వాయిద్యాలు (వీణ, సితార్, వయొలిన్, సారంగి వంటివి), తాళ సంబంధమైన వాయిద్యాలు (మృదంగం, తబలా, డప్పు వంటివి) వున్నాయి. మన సంగీతంలో వాయిద్యాలకు ప్రత్యేక సంగీతం అంటూ లేదు. గాత్ర సంగీతాన్నే వాయిద్యాలు అనుకరిస్తాయి. పాశ్చాత్య సంగీతంలో సింఫోనీ మొదలైన వాద్య సంగీతరచన లున్నాయి. వారికీ మనకీ మౌలికమైన వ్యత్యాసం వుంది.
మన సంగీతానిది రాగపద్ధతి. మన సంగీతంలో స్వరాలు విడివిడిగా ఒకదాని వెంబడి ఒకటి వస్తాయి. దీన్ని ‘మెలోడీ’ అంటారు. ఒకప్పుడు పాశ్చాత్యసంగీతంలో కూడా యీ పద్ధతి వుండేది. తర్వాత అక్కడి సంగీత పరిణామంలో ‘హార్మోనీ’ అనే పద్ధతి వచ్చింది. మిత్రస్వభావం కలిగిన 3 నుంచి 5 స్వరాల సమూహాన్ని ఖ్వార్డ్ అంటారు. ఒకదాని వెంబడి ఒకటి వచ్చే స్వరసమూహాలను హార్మోనీ అంటారు. అంటే కొన్ని స్వరాలు ఒకేసారి వినిపిస్తాయి. దీనివలన మాటల సహాయం లేకుండా, వాయిద్యాలకు స్వయం ప్రతిపత్తి వచ్చింది. ఈ వాద్య రచనలకి ఒక యితివృత్తం వుంటుంది.
నేను దేశవిదేశాలలో తిరిగినపుడు అనేక దేశాల సంగీతాలను విన్నాను. భాష తెలియకపోయినా, కేవలం వాద్యనాదాలతో ఆ కంపోజిషన్స్ నన్ను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో వేణువుతో చేసిన ప్రయోగాలు అద్భుతం. సంగీతకారులకు ప్రతి దేశంలోనూ చాలా విలువ నిస్తారు. ఆదిమ జాతుల్లో చూసినా జాతి పెద్ద తర్వాత హోదా తెగ చరిత్ర పాడుతూ బాజా వాయించేవాడిదే. సంగీతం ప్రపంచ ప్రజలను చేరువ చేస్తుంది.
ఒకే రకమైన సంగీతం అన్ని జాతులనూ, అన్ని వయసుల వారినీ మైమరపిస్తుందని చెప్పలేము కానీ కొన్ని కొన్ని వాద్యరచనలు చాలామందిని ప్రభావితం చేయగలుగుతాయని ఒప్పుకోవాల్సిందే. ఏ రకమైన సంగీతాన్నీ మనం తక్కువగా చూడలేము. ఎటువంటి సంగీతాన్ని ఆదరించాలనేది పూర్తిగా వైయక్తికం. ఇక హాస్యం గురించి మరోసారి ముచ్చటిస్తాను,
– కె.ఐ. వరప్రసాద్ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్)
Finally a good article in GA
Good article, for a change