నాడు ‘సెజ్‌’లు – నేడు భూసేకరణ – తప్పిదాలు పునరావృతం

గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వుండిన దివంగత రాజశేఖర్‌ రెడ్డి గొప్పగా అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసినవారు వాటి అమలుపై పెదవి విరిచారు. రాజకీయ, వ్యక్తిగత చరిష్మా కోసం పథకాల…

గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వుండిన దివంగత రాజశేఖర్‌ రెడ్డి గొప్పగా అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసినవారు వాటి అమలుపై పెదవి విరిచారు. రాజకీయ, వ్యక్తిగత చరిష్మా కోసం పథకాల ప్రకటనగా గోచరించినా అందులో సింహభాగం అట్టడుగు, బాధాతత్పరుల అన్ని రకాల ప్రజల సంక్షేమం దాగివుండడంతో ప్రజలనుండి మెప్పు లభ్యమయింది. వూహించని రీతిలో ప్రభుత్వ భూములు, ఖాళీగా సాగులేని పోరంబోకులు, సముద్రం అంచున ఇసుక రీచ్‌లతో బాటు కొంతమేర వ్యవసాయ భూములు కూడ సేకరణ ప్రారంభించాడు. అంటే ఆ సేకరణ భూములు పారిశ్రామిక తదితర కేరిడార్‌ల కోసం కేటాయించి అందుకు ముందుకు వచ్చిన వారికి ఆ భూముల సేకరణ అనుమతించారు. భూములకు వూహించని రీతిలో ధరలు పలికి సామాన్య రైతులు లక్షాధికారులయ్యారు. 

పారిశ్రామిక యజమానులు ధర ప్రభుత్వానికి చెల్లించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం సమకూర్చబడిందని వృధాగా విలువ లేని భూములు ధనంగా మారాయని అప్పటి ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. ఎక్కువ ధర రావడంతో రైతులు, సంక్షేమ పథకాలలో సామాన్యులు రాజశేఖర్‌ రెడ్డి పట్ల కృతజ్ఞత చూపాయి. అయితే కధ అనేక మలుపులు తిరిగి పైకి కనిపించే యీ సందర్భం ఆయన కుమారుడు జగన్‌మోహన్‌ రెడ్డి వేరే రూపంలో క్యాష్‌ చేసికొని వేల కోట్ల రూపాయల అవినీతి సామ్రాజ్యం కోటలు కట్టాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జైలు పాలై కేసులు విచారణలో వున్నాయి. ఇది గతం.

నేడు రాష్ట్రంలో నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణం ఆవశ్యకం. నూతన రాజధాని అత్యావశ్యకం. అందుకు రాజధాని ప్రాంతం ఎంపిక చేయబడింది. విజయవాడ కృష్ణా నది ఒడ్డున నిర్మాణం లక్ష్యంగా 33 వేల ఎకారలు భూసేకరణ గుర్తించబడింది. ఇందులో 60 శాతం రైతులు భూమి అప్పగింతకు అంగీకరించారు.

భూమి స్వాధీనం చేయకపోతే చట్టప్రకారం స్వాధీనం తప్పదంటున్నారు మంత్రులు. భూసేకరణ ప్రతిపాదిత ప్రాంతం సారవంతమైన భూములు కలది. కనీసం మూడు పంటలు నిఖార్సుగా పండే అవకాశం వున్నది కావడంతో రైతులు భూమి అప్పగింతకు సందేహిస్తున్నారు. ఆ కారణంగా భూములకు వూహించని రీతిలో ఎక్కువ ధర, దాదాపు 10 సంవత్సరాల వరకు ఆర్థిక సహాయం, కొత్తగా ఇళ్ళు నిర్మించి యివ్వడం, అప్పుల మాఫీ, వీలుంటే ఉద్యోగం లాంటి అనేక తాయిలాలు అయాచితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖాళీగా వున్న భూములు, ప్రభుత్వ భూములు అనే అంశం వైపు రాష్ట్రం కనీసం కన్నెత్తి కూడా చూడకుండా ఆ ప్రాంతాల్లో రాజధాని వెర్రివాళ్ళు నిర్మిస్తారు, తెలివైనవాళ్ళు సారవంతమైన భూముల్లో నిర్మిస్తారని చెప్తోంది.

మరలా రాష్ట్రం సాధ్యమైనన్ని ఎక్కువ విమానాశ్రయాల నిర్మాణం ప్రభుత్వ ఆలోచన. విమానాశ్రయాలు తక్షణ అవసర పథకాలు కాకపోయినప్పటికీ, విమాన ప్రయాణం అవసరం తగిన స్థాయిలో వుండక పోవడం అంశాలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాబోవు 20 లేదా 30 సంవత్సరాల విజన్‌తో ప్రభుత్వం పయనిస్తోందేమో.

విజయనగరం దగ్గర భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం కోసం 10 నుండి 15 వేల ఎకరాల భూసేకరణ ఆరంభమైంది. రైతులు యిక్కడ సహజంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సేకరణలో రైతులకు భారీగా పరిహారం, జీవన భృతి వగైరా షరా మామూలుగా ప్రభుత్వం చెల్లిస్తుంది.

విజయవాడ గన్నవరం విమానాశ్రయం ఆధునీకరణ కూడా ప్రభుత్వం తలపెట్టింది. భూసేకరణ కోసం ఒక్కొక్క ఎకరాకు 46 లక్షల నుండి కోటివరకు చెల్లింపు, కొత్త ఇళ్ళ నిర్మాణం, జీవనభృతి షరా మామూలుగా వున్నాయి. రాష్ట్రంలో ప్రతి పట్టణంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకో రాష్ట్రమే చెప్పాలి. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో అంతర్జాతీయ విమానాశ్రాయాలు ఏ రీతిలో వున్నాయో మన రాష్ట్ర ప్రభుత్వానికి అనవసరం. ఎందుకంటే తెలివంతా మన రాష్ట్ర పాలకులకే వుందన్నది వారి భావన.

కేంద్రం సరిక్రొత్త మార్గంలో భూసేకరణ బిల్లు తేను పట్టుపడ్తోంది. యజమానులు ఒప్పుకొన్నా లేకపోయినా కోర్టులు సైతం వ్యతిరేకంగా తీర్పు చెప్పలేని క్లాజుతో బిల్లు తయారయింది. యిప్పుడున్న కేంద్ర భూసేకరణ చట్టం యించుమించు ఆ రూపంలోనే వుంది. ప్రస్తుతం నోటిఫై చేస్తే ఎవరూ ఏమీ పీకలేరు. కాకపోతే కోర్టు అడ్డంకులు కూడా లేకుండా చేయాలన్నది నేటి ఆలోచన. యీ భూసేకరణ విచిత్రమైన చట్టం. ప్రభుత్వ ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులు, ఆ భూముల హామీపై అప్పటివరకు యిచ్చివున్న అప్పులు సైతం సేకరణ చట్టం లెక్కలోకి తీసికోదు. వాటి వసూలుకు ఆయా సంస్థలు చాలా తిప్పలు పడాలి. ప్రజాధనంపై ప్రభుత్వం శ్రద్ధ ఏపాటిది అన్నదానికి ఈ చట్టం ఉదాహరణ.

రాజధాని నిర్మాణం కోసం మహా అయితే 10 వేల ఎకరాలు చాలునని, భోగాపురం విమానాశ్రయానికి 2 వేల ఎకరాలు చాలవా అన్నది విపక్షం వాదన. రాజధాని నిర్మాణం కోసం కనీసం 50 వేల ఎకరాలు సేకరించాలని తలపోసిన ప్రభుత్వం, రైతులు, విపక్షాల గొడవతో 33 వేల ఎకరాలకు ప్రస్తుతానికి సర్దుకొంది.  మిగతాది యింకా వేరే రూపాల్లో భూసేకరణపై ప్రభుత్వం ఖచ్చితంగా వుంది. భవిష్యత్తులో సేకరణ జరిగిపోయేటట్లే వుంది. ప్రస్తుతం ప్రభుత్వం తాము తలపోసింది తప్ప వేరేవారి మాట వినడం, ఆలోచన పరిగణనలోకి తీసుకోవడం లేదు. తీసుకోదు కూడా. గతంలోనూ, నేడు కూడా ఇదే ప్రభుత్వ నైజం, గమ్యం, లక్ష్యం.

ప్రభుత్వం ప్రస్తుత భూసేకరణ పారదర్శకంగా చేస్తున్నానంటోంది. అంటే ఎందుకోసమో, అవసర మేమిటో స్పష్టంగా విడమర్చి చెప్తున్నందున సేకరణలో తప్పులు పట్టే అవకాశం లేదంటోంది. ఒకవైపు చట్ట ప్రకారం రైతులను ఒప్పించి సేకరిస్తామంటూనే మంత్రులు స్వయంగా సంబంధిత అధికార్లను ప్రక్కనబెట్టి, అధికారం, పరిపాలన చేతిలోకి తీసికొని, స్వీకరించిన భూములను వాహనాలతో చదును అంటూ పరోక్షంగా దాడి చేస్తున్నారు.

ప్రభుత్వం ప్రతిపక్షాలను లెక్కించదు. కనీసం ప్రజల మనోభావాలు కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. అవసరం మించి భూసేకరణ అనర్థం అని, భవిష్యత్తులో భూవ్యాపారం ద్వారా అనేక సమస్యలకు జవాబు చెప్పాల్సి వస్తుందని ఆలోచించడం లేదు, లెక్కించడం లేదు. భూసేకరణ అనంతరం చేతులు మార్చి కార్పొరేట్‌లకు అమ్మకం తద్వారా ఆదాయంతో పాటు అనేక అవసరాలు నెరవేరను ఇదొక్కటే మార్గం అని ప్రభుత్వం గ్రహించింది.

అంత సారవంతమైన భూములైతే రైతులు ఎందుకు అప్పగించను ఒప్పుకొంటున్నారని తాజాగా సంబంధిత శాఖ మంత్రి. మరి పోరంబోకు భూములకే రాజధాని ప్రాంతంలో ఒక్కో ఎకరాకు 2 నుండి 3 కోట్ల పరిహారం చెల్లింపు, వుదారంగా నెలవారీ జీవనభృతి, అనేక వసతులు ఎందుకు యిస్తున్నారో భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సిన అవసరం రాదా!

నాడు సెజ్‌ల పేర భూసేకరణ, ఆ అనుభవంతో తెలివిగా మరోపేరున ఇంకో నెపంతో భూసేకరణ, రెండూ ఒకటే భవిష్యత్‌లో అనేక అంశాల్లో జవాబు చెప్పాల్సి రావాల్సిన పరిస్థితులు రావడానికి.

-ములుమూడి ప్రభాకరరావు