2014 సంవత్సరంలో రెండు ఘోర దుర్ఘటనలు తెలుగు రాష్ట్రాల్ని విషాదంలో ముంచేశాయి. వాటిల్లో ఒకటి నీరు కారణంగా, ఇంకోటి నిప్పు కారణంగా. రెండు ఘటనల్లోనూ నిర్లక్ష్యమే ప్రాణాల్ని హరించడం దురదృష్టకరం. మొదటిది బియాస్ దుర్ఘటన కాగా, ఇంకోటి నగరం దుర్ఘటన.
హైద్రాబాద్‌కి చెందిన ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు విహారయాత్రకి వెళ్ళారు. ఈ క్రమంలోనే హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో దిగారు విద్యార్థులు. ఆ టైమ్‌లో నదిలో పెద్దగా నీరు లేకపోవడంతో సరదాగా నదిలోకి దిగి ఫొటోలకు పోజులిచ్చారు. అనూహ్యంగా వరద ముంచుకొచ్చింది.. ఆ విద్యార్థులు వరద నీటిలో కొట్టుకుపోయారు. మొత్తం 24 మంది విద్యార్థులు నీట్లో మునిగి ప్రాణాలు కోల్పోయారు. రోజుల తరబడి విద్యార్థుల మృతదేహాల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రయత్నించాల్సి వచ్చింది.
నీటిని కిందికి వదిలే సమయంలో హెచ్చరికలు చేయాల్సి వున్నా, ప్రాజెక్టు సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో ఈ ప్రమాదం వాటిల్లింది. అదే సమయంలో, విద్యార్థులు ప్రమాదకర ప్రదేశాల్లోకి వెళ్ళకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన టూర్ నిర్వాహకులూ నిర్లక్ష్యం ప్రదర్శించడంతో 24 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్నీ తీవ్ర ఆవేదనకు గురిచేసింది. దేశమంతా ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
ఇక, నిప్పు విషయానికొస్తే.. తూర్పుగోదావరి జిల్లాలోని నగరం అనే గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్ పేలుడు సంభవించడంతో 20 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. తాము నివాసం వుంటోన్న చోటే భూగర్భంలో ఏర్పాటు చేసిన గ్యాస్, చమురు పైప్‌లైన్లు మృత్యు కోరలు చాస్తున్నా.. భయంతో కాలం వెల్లదీయడం మినహా ఏమీ చేయలేని దుస్థితి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ వాసుల దుస్థితి. ఒకప్పుడు కోనసీమ అంటే కొబ్బరికాయలు.. ఇప్పుడు కోనసీమ అంటే బ్లో`అవుట్‌లు.. అనేంతగా పరిస్థితులు మారిపోయాయి. దేశాన్ని కుదిపేసింది నగరం దుర్ఘటన.
ఇతర ప్రమాదాల విషయానికొస్తే, మెదక్ జిల్లా మసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద స్కూల్ బస్సుని, రైలు ఢీకొంది. ఈ ఘటనలో 25 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. వీరిలో ఎక్కువమంది పదేళ్ళలోపు చిన్నారులే కావడం అత్యంత దురదృష్టకరమైన విషయం. ఇక్కడా నిర్లక్ష్యమే నిండు ప్రాణాల్ని బలిగొంది. లెవెల్ క్రాసింగ్ వద్ద సిబ్బంది లేకపోవడం, స్కూలు పిల్లల్ని తీసుకెళ్తున్న బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలు. తూర్పుగోదావరి జిల్లాలోనే బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుళ్ళు జరగడంతో పదహారు మందికి పైగా ‘పేలిపోయారు’.
చెప్పుకుంటూ పోతే.. రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, ఇతరత్రా ప్రమాదాలూ లెక్కలేనన్ని జరిగాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో గడచిన ఏడాది కాలంలో. వీటిల్లో నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదాలే ఎక్కువ. పాలకులు ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ ‘పొరపాటుకు అవకాశం ఇవ్వబోం..’ అని చెబుతూనే వుంటారుగానీ, నిర్లక్ష్యంగా జరుగుతోన్న ప్రమాదాలు మాత్రం ఏడాదికేడాదీ పెరిగిపోతున్నాయి తప్ప, తగ్గడంలేదు.