విభజనతో తీవ్రంగా నష్టపోయిన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ నెత్తిన హుద్‌హుద్ తుపాను పిడుగులా పడిరది. దేశ చరిత్రలో ఇంత తీవ్రమైన తుపాను ఎప్పుడన్నా ఎక్కడన్నా వచ్చిందా.? అన్న అనుమానం కలిగేలా, ఆంధ్రప్రదేశ్‌లో హుద్‌హుద్ తుపాను బీభత్సం సృష్టించింది. అంచనాలకు అందని విధ్వంసం సృష్టించిందీ తుపాను.
తీవ్ర తుపాను, అతి తీవ్ర తుపాను.. ఇలా చాలా అంచనాలు తుపానుకు ముందు వాతావరణ శాఖ నుంచి వ్యక్తమయ్యేసరికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ అప్రమత్తమయ్యాయి. అవసరమైన మేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశాయి. అయితే అంచనాలను మించిన తీవ్రతతో తుపాను విశాఖలో తీరం దాటింది. విశాఖ నగర శివార్లలోని కైలాసగిరి ప్రాంతానికి సమీపంలో తుపాను తీరం దాటడంతో, ఆ ప్రభావం విశాఖ నగరంపై అత్యంత తీవ్రంగా పడిరది.
తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించడానికే వారం రోజులు పట్టిందంటే తుపాను తీవ్రత ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని ప్రాణ నష్టం నివారించగలిగామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొలుత చెప్పినా, ప్రాణ నష్టమూ భారీగానే సంభవించింది. అయితే తుపాను తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే ప్రాణ నష్టాన్ని వీలైనంతవరకు తగ్గించేలానే పాలకులు సమర్థవంతంగా వ్యవహరించారని చెప్పక తప్పదు.
అయితే, సహాయక చర్యల విషయంలో మాత్రం బాధితులు ఆశించిన స్థాయిలో పాలకులు చేపట్టలేకపోయారన్నది నిర్వివాదాంశం. ఎక్కడికక్కడ పడిపోయిన చెట్లతో రవాణా సౌకర్యాలకు తీవ్ర ఆటంకం వాటిల్లి, తద్వారా పరిస్థితిని చక్కబెట్టేందుకు వీలు లేకుండా పోయింది. ఓ నగరంపై తుపాను విరుచుకుపడ్డం.. అదీ ఇంత తీవ్రస్థాయిలో.. ఇది దేశ చరిత్రలోనే తొలిసారి.. అని నిపుణులు అభిప్రాయపడ్తున్నారు.
విమానాశ్రయం పైకప్పు ఎగిరిపోయి, అది అంతర్జాతీయ విమానాశ్రయం కాదు.. ఏదో రేకుల షెడ్.. అన్పించేలా తయారయ్యింది తుపాను తీవ్రతకి. షిప్‌యార్డ్‌లో అయితే పరిస్థితి మరీ భయానకం. చాలా బోట్లు సముద్రంలో మునిగిపోయాయి. పచ్చని విశాఖ కాస్తా అంద విహీనంగా తయారయ్యింది. పర్యాటకులకు స్వర్గధామమైన కైలాసగిరి ఆనవాళ్ళను కోల్పోయింది. అరకుకి సంబంధాలు తెగిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే హుద్‌హుద్ తుపాను సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. మొత్తంగా చూస్తే విశాఖ సహా ఉత్తరాంధ్రను హుద్ హుద్ తుపాను విలవిల్లాడిరచిందనే చెప్పాలి.
ప్రధాని నరేంద్ర మోడీ తుపాను అనంతరం విశాఖలో పర్యటించి, వెయ్యి కోట్ల తక్షణ సహాయం ప్రకటించారు. హాస్యాస్పదమైన విషయమేంటంటే, 23 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం అంచనాలతో కేంద్రానికి ఏపీ సర్కార్ నివేదిక ఇస్తే, కేంద్రం ఆరొందల కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పడం. జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిన హుద్‌హుద్ విలయాన్ని.. సాదా సీదాగా కేంద్రం భావించడం దారుణాతిదారుణం.
ఆంధ్రప్రదేశ్‌కి ఆర్థిక రాజధాని, ఐటీ రాజధాని అవుతుందనుకున్న విశాఖ నగరం హుద్‌హుద్ తుపాను దెబ్బతో అతలాకుతలమైపోయింది. విశాఖ పునర్నిర్మాణం జరగాల్సిన తరుణమిది. కానీ, దానికి కేంద్రం సహాయం అందించడం అవసరం. అయితే ఇచ్చే స్థితిలో కేంద్రం వున్నట్లుగా కన్పించడంలేదు. స్మార్ట్ జాబితాలో విశాఖను ప్రధాని మోడీ ప్రకటించారు, అమెరికా భాగస్వామ్యంతో.. అని చెప్పారు.. కానీ ఆదుకుంటున్న దాఖలాలే లేవు.!
ఏదిఏమైనా, 2014 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో.. మరీ ముఖ్యంగా విశాఖ చరిత్రలో.. అత్యంత దురదృష్టకరమైన ఏడాది. విభజన కన్నా దారుణమైన నష్టాన్ని కలిగించింది హుద్‌హుద్ తుపాను, ఆంధ్రప్రదేశ్‌కి.
కొసమెరుపు: హుద్‌హుద్ తుపాను సృష్టించిన బీభత్సత్సానికి ప్రతి ఒక్కరూ విలవిల్లాడిపోయారు. బాధితుల్ని ఆదుకునేందుకు అంతా నడుం బిగించారు. వివిధ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌కి బాసటగా నిలిచాయి. తెలంగాణ సర్కార్ సైతం తనవంతు సహాయంగా సహాయక సామాగ్రిని ఆంధ్రప్రదేశ్‌కి పంపింది. సామాన్య ప్రజానీకం చేతనైనంత మేర సహాయం చేసి, బాధితుల్ని ఆదుకునేందుకు ప్రయత్నించారు. ఆహార సామాగ్రి నుంచి, ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల దాకా.. ఆ సహాయం రకరకాల రూపంలో కన్పించింది. తెలుగు సినీ పరిశ్రమ ‘మేముసైతం’ పేరుతో భారీ కార్యక్రమం చేపట్టి, భారీ మొత్తాన్ని ఏపీ సర్కార్‌కి అందించింది.