నెలకి 15 వేలు.. సేవంటే ఇదీ.!

‘నెల రోజులకి 15 వేల రూపాయల ఖర్చు.. త్రీ స్టార్‌ హోటల్‌లో వున్నట్లుగా సౌకర్యాలుంటాయి. ఫ్రీ భోజనం, ఫ్రీ జ్యూస్‌..  ఇవన్నీ సేవాభావంతోనే చేస్తున్నాం..’ మంతెన వారి మాట ఇది. ప్రకృతి వైద్యం పేరుతో…

‘నెల రోజులకి 15 వేల రూపాయల ఖర్చు.. త్రీ స్టార్‌ హోటల్‌లో వున్నట్లుగా సౌకర్యాలుంటాయి. ఫ్రీ భోజనం, ఫ్రీ జ్యూస్‌..  ఇవన్నీ సేవాభావంతోనే చేస్తున్నాం..’ మంతెన వారి మాట ఇది. ప్రకృతి వైద్యం పేరుతో మంతెన సత్యనారాయణరాజు తెలుగు ప్రజలందరికీ సుపరిచితుడు. అన్ని అనర్ధాలకూ మనం తినే అడ్డదిడ్డమైన తిండే కారణమని చెబుతారాయన.

అలాంటి మంతెన సత్యనారాయణరాజు, కృష్ణా నది ఒడ్డున ఓ ఆశ్రమం స్థాపించారు. తమ ట్రస్ట్‌కి అనుమతి వుందనీ, విదేశాలనుంచి విరాళాల్ని స్వీకరించేందుకూ అనుమతులున్నాయనీ, బ్యాంక్‌ లోన్‌ తీసుకుని ఆశ్రమం నిర్మించామనీ చెబుతున్నారు మంతెన. ఇప్పుడీయన సీన్‌లోకి ఎందుకొచ్చారంటే, కృష్ణానది ఒడ్డున అక్రమ నిర్మాణాలంటూ మీడియాలో నాలుగైదు రోజులుగా కథనాలు గుప్పుమంటున్నాయి. అందులో అక్రమ కట్టంగా మంతెనవారి ఆశ్రమం కూడా వుంది మరి.

నెలకి 15 వేల రూపాయలు రోగుల నుంచి తీసుకుంటోంటే, ఇది సేవ ఎలా అవుతుంది.? అన్న ప్రశ్న సామాన్యులకు కలగడం సహజం. ఇదేమీ సీక్రెట్‌ కాదు. చాలామందికి తెల్సిందే. పద్ధెనిమిది వేలు కూడా వసూలు చేస్తామని మంతెనవారే చెబుతున్నారు. మసాజ్‌లూ ఇంకేవేవో చేస్తారట ఈ ఆశ్రమంలో. తమ ఆశ్రమానికి వచ్చే రోగులు చాలా ఆనందంగా చికిత్స తీసుకుని వెళ్తారని సెలవిస్తున్నారాయన.

ప్రస్తుత ఎంపీ గోకరాజు గంగరాజు ట్రస్ట్‌కి విరాళంగా ఇచ్చిన భూమిలోనే నిర్మాణం జరిగిందని చెబుతున్న మంతెన, భూమి కబ్జా చేసింది అయితే, అనుమతులు ఎలా వస్తాయనీ, బ్యాంకులు ఎలా అప్పులు ఇస్తాయనీ అతి తెలివితో ప్రశ్నిస్తున్నాయి. ఈ రోజుల్లో రాజకీయ పలుకుబడి వుంటే అనుమతులు వాటంతట అవే వచ్చేస్తాయి. కావాల్సిందల్లా అధికారంలో వున్నవారితో సన్నిహిత సంబంధాలే.

నో డౌట్‌.. మంతెన సత్యనారాయణరాజు చెప్పే ఆహార నియమాలతో చాలామంది కొన్ని రోగాల నుంచి బయటపడ్డారు. ప్రధానంగా అధిక బరువు, డయాబెటిస్‌, బీపీ వంటి రుగ్మతల నుంచి ఉపశమనం కలుగుతుంది ఆయన చెప్పే ఆరోగ్య సూత్రాలతో. ఆ కారణంగానే ఆయనంటే చాలామందికి ఓ గౌరవభావం. కానీ, కృష్ణా నది ఒడ్డున ఆశ్రమం నిర్మించాక, ‘ఆయన చాలా కాస్ట్‌లీ వైద్యుడు..’ అనే భావన పెరిగిపోయింది.

ఇప్పుడేమో ఈ వివాదం తెరపైకొచ్చింది. ఆయనంతట ఆయనే నెలకి 15 వేలు ఛార్జ్‌ చేస్తున్నాం.. కొందరికి 18 వేలు కూడా తీసుకుంటున్నాం.. అని చెబుతున్న దరిమిలా, ఆయన చేస్తున్న ‘సేవ’లో వాస్తవం ఏంటో స్పష్టమవుతోంది. సేవ వేరు, వ్యాపారం వేరు. సేవ ముసుగులో జరుగుతున్న వ్యాపారం ఇది. కాదంటారా మంతెనవారూ.?