కొత్తా దేవుళ్లండీ..

దేవుడంటేనే లోక రక్షకుడు.. కానీ.. ఇప్పుడు కొత్త రక్షకులు పుట్టుకొస్తున్నారు..వీరు దేవుడిని కూడా తాము రక్షించే కేటగిరీ కింద పరిగణించగలరు.. దేవడికి అన్యాయం జరిగిపోయిందని నానా యాగీ చేయగలరు…దేవుడి ముసుగులో జనసామాన్యంలోని ఉద్రేకాలను బాగా రెచ్చగొట్టగలరు.. వారి…

దేవుడంటేనే లోక రక్షకుడు.. కానీ.. ఇప్పుడు కొత్త రక్షకులు పుట్టుకొస్తున్నారు..వీరు దేవుడిని కూడా తాము రక్షించే కేటగిరీ కింద పరిగణించగలరు.. దేవడికి అన్యాయం జరిగిపోయిందని నానా యాగీ చేయగలరు…దేవుడి ముసుగులో జనసామాన్యంలోని ఉద్రేకాలను బాగా రెచ్చగొట్టగలరు.. వారి మనోభావాలతో విచ్చలవిడిగా ఆడుకోగలరు..

ప్రశాంతంగా మనుగడ సాగిస్తున్న సమాజంలో అగ్గిపుల్ల గానీ, చెకుముకి రాయి గానీ అవసరం లేకుండానే నిప్పును రాజేయగలరు.. తమ తమ రాజకీయాలకు దేవుడిని ఒక ‘మార్కెట్ ఎలిమెంట్’ గా వాడుకోగలరు. ‘దేవుడి’ నుంచి ఓట్లను పిండుకోగలిగే నవీన రాజకీయ శాస్త్రవేత్తలు వీరు.అందుకే.. వీరు కేవలం నేతలు కాదు… కొత్త దేవుళ్లు!

వర్తమాన ఆంధ్రప్రదేశ్ లో దేవుడిచుట్టూ ముదురుతున్న రాజకీయాలపై గ్రేటాంధ్ర విశ్లేషణాత్మక కథనం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. దేవుళ్లను రక్షించడానికి కొత్త దేవుళ్లు పుట్టుకొచ్చారు. దేవుడు అపాయంలో ఉన్నాడని వీరు గుర్తించారు. లేదా.. దేవుడు తాను కష్టాల్లో ఉన్నానని వీరికి కలలో కనిపించి చెప్పాడు. 

అందుకే వీళ్లంతా ఇప్పుడు దేవుడిని రక్షించడానికి తమ సర్వశక్తులూ ఒడ్డి పోరాటాలు చేసేస్తున్నారు. ‘దేవో రక్షతి రక్షితః’ మంత్రాన్ని పఠిస్తున్నారు. అన్నింటినీ మించి జగన్మోహన రెడ్డిని ఒక రాక్షసుడిగా, దైవ కంటకుడిగా, రావణాసురుడిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. 

ఏం జరుగుతోంది?

రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. సువిశాలమైన రాష్ట్రంలో కనీసం ఊరికి పది వంతున అయినా ఉండే హిందూ దేవాలయాల్లో.. ఎక్కడో ఒక చోట ప్రతిరోజూ ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉండడం చాలా క్లిష్టమైన పని. అప్పటికి అంతర్వేది రథం దగ్ధం తర్వాత.. పోలీసులు కొంత చురుగ్గానే చర్యలు తీసుకున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని ముఖ్యమైన దేవాలయాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయించారు. తద్వారా ఎవ్వరూ ఎలాంటి ఆగడానికి పాల్పడే సాహసం చేయకుండా పటిష్టం చేశారు. ఇదే ప్రయత్నం రామతీర్థంలో కూడా జరిగింది. 

అయితే ప్రధాన ఆలయంలో సీసీటీవీలు ఉన్నాయి గానీ.. బోడికొండ మీద ఉన్న .. చిన్న ఆలయంలో ఈ దురాగతం జరిగింది. నిందితులెవరో ఇంకా తేలలేదు. ఈలోగా రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో మరికొన్ని సంఘటనలు జరిగాయి. ఒక మంచి పరిణామం ఏంటంటే.. ఏ రెండు ఘటనలు కూడా ఒకే తరహాలో జరిగిన నేరాలు కావు. మరో చోట కూడా ఒక చిన్న ఆలయంలో విగ్రహానికి చేతులు విరగ్గొట్టారు. మరో చోట రోడ్డు మద స్వాగతతోరణంలో ఉండే దైవప్రతిమలను కొంత దెబ్బతీశారు. 

ఇవన్నీ హిందూ ఆలయాలలో జరిగిన దుర్ఘటనలే! ఆ విషయం కాదనలేం. కానీ.. ఇవి మతకలహాలను  ప్రేరేపించడానికి జరిగిన చర్యలా? హిందూత్వం మీద దాడులా? వైఎస్సార్ కాంగ్రెస్ స్వయంగా తమ మనుషుల్ని పురమాయించి.. ఇలాంటి దురాగతాలకు కారణమైందా? అనే ప్రశ్నలు వినిపించడమే చిత్రం!

వాటిలో మెజారిటీ ఆకతాయి పనులు. కొందరు దుర్మార్గులు, తుంటరివాళ్లు చేసిన పనులు. రాముడి విగ్రహం తల పగులగొట్టడం తుంటరి పని కాకపోవచ్చు గానీ.. మిగిలిన వాటిలో చాలా వరకు అంత సీరియస్ ఘటనలు కావు. కానీ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కావడం అనేది విపక్షాలకు ఒక పెద్ద అస్త్రంలాగా ఉపయోగపడింది. 

ముఖ్యమంత్రికి ముడిపెట్టడానికి ఇదంతా క్రిస్టియన్లు చేస్తున్న దాడులుగా అభివర్ణించే ప్రయత్నం… అలాంటి దుర్మార్గపు క్రిస్టియన్లందరికీ ముఖ్యమంత్రి దన్నుగా ఉన్నారని చెప్పే ప్రయత్నం జరిగాయి. ఇవి ఎంతవరకు పతనం అయ్యాయంటే.. ఆలయ గోపురానికి రంగులు వేసే క్రమంలో కార్మికుడికి కాలు జారడం వలన.. గోపురంలో భాగంగా ఉండే ఒక ప్రతిమ కొంత దెబ్బతిటే.. దాన్ని కూడా హిందూ ఆలయాల మీద దాడులు అనేంతగా రంగు పులమడానికి జరిగిన ప్రయత్నం అసహ్యం పుట్టిస్తుంది. 

ఇదివరకెప్పుడూ జరగలేదా?

హిందూ ఆలయాల మీద దాడులు ఇప్పుడు మాత్రము జరుగుతున్నాయా? ఇదివరకు ఎప్పుడూ జరగలేదా? అనేది చాలా పెద్ద ప్రశ్న. గతంలో కూడా అనేక ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తెలుగుదేశం హయాంలో ఆలయాల మీద జరిగిన దాడులు మాత్రమే కాదు. అంతకు పూర్వం దశాబ్దాల కిందటినుంచి కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. 

అయితే అప్పట్లో క్రిస్టియన్ ముఖ్యమంత్రి లేరు. అలాంటి దాడులకు క్రిస్టియన్ రంగు పులిమి.. రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించే గోతికాడ నక్క రాజకీయ నాయకులు లేరు. ఇప్పుడు రాజకీయ విలువలు పతనం కావడమే.. ఇండైరక్టుగా.. ఈ ఆలయాల్లో దుర్ఘటనలను భూతద్దంలో చూపిస్తుండడానికి కూడా కారణం అవుతోంది. 

హిందూ ఆలయాలమీదే ఎందుకు జరుగుతాయి? ఇదికూడా ఆలోచించాల్సిన ప్రశ్నే. ఆలయం మీద జరిగే ప్రతి దాడి వెనుక.. మతపరమైన  కారణాలు మాత్రమే ఉంటాయని అనుకుంటే.. అది అవగాహన లేకుండా మాట్లాడడమే అవుతుంది. కొన్ని మతపరమైన దాడులు ఉండొచ్చు గానీ.. ప్రతిదీ అలాంటిది కాదు. అదే ఇస్లాం, క్రిస్టియన్ మతాల ప్రార్థనాలయాల మీద జరిగే దాడులు అచ్చంగా మతప్రేరేపిత దాడులు మాత్రమే అనుకోవాలి. 

ఎందుకంటే.. హైందవ ధర్మంలో ఆచారాల ప్రకారం.. ఆలయ నిర్మాణం జరిగేప్పుడు దాని పునాదుల్లో కొంత ధనం, బంగారం, నవరత్నాలు వంటి విలువైన వాటిని ఉంచుతారు. ప్రత్యేకించి గర్భాలయంలో మూలవిరాట్టును ప్రతిష్టించేప్పుడు కూడా ఇలాంటివి దాని అడుగు భాగంలో ఉంచుతారు. మూలవిరాట్టుల కింద ఇంకా పెద్దస్థాయి నిధులు దొరుకుతాయనే నమ్మకాలు కూడా చాలా మందిలో ఉంటాయి. అందుకే దశాబ్దాల నాటినుంచి కూడా.. మారుమూల జనసంచారం ఉండని ప్రాంతాల్లో ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసేయడం.. తవ్వి పెకలించడం వంటి దుర్ఘటనలు చాలా తరచుగా జరుగుతూ ఉండేవి. 

ఇప్పుడు అలాంటి ఘటనలు తగ్గాయి గానీ.. ఆలయాలపై దాడుల విషయంలో ఆకతాయిలు పెరిగారు. కొన్ని సంఘటనలు మతపరం కాగా, మిగిలిన అన్నింటికీ కూడా మతం రంగు పులిమి.. శవం మీద పేలాలు ఏరుకున్నట్టుగా రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. 

నీచ రాజకీయాలు

ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, అత్యంత సహజంగా భారతీయ జనతా పార్టీ ఈ వివాదాలను పెద్దవి చేస్తున్నాయి. బీజేపీ దేశవ్యాప్తంగా హిందూత్వానికి తమకు పేటెంటు హక్కులున్నాయని భావిస్తుంటుంది. తెలుగుదేశం ఇప్పుడు కొత్తగా హిందూత్వ పాట ఎత్తుకుంది. ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాక్టికల్ గా ఏం జరిగింది? ఇలాంటి సమస్యకు వాస్తవమైన పరిష్కారం ఏంటి? అని ఆలోచిస్తున్న వారు లేరు. అందరూ రాద్ధాంతం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్న వాళ్లే. 

ప్రతిపక్షాలు చేస్తున్న యాగీ ఎలా తయారైందంటే.. సాక్షాత్తూ ప్రభుత్వమే, అంటే సీఎం జగన్మోహన్ రెడ్డే మనుషుల్ని పురమాయించి.. ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసేస్తున్నంతగా రభస చేస్తున్నారు. కేవలం రాజకీయ కాంక్ష తప్ప మరేమీ వారి ఎజెండాగా ఉన్నట్టు తోచడం లేదు. ఈ నీతిమాలిన రాజకీయాలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. 

ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ఇలాంటి ఆగడాలు జరుగుతున్నప్పుడు.. ఏం చేస్తే సవ్యంగా ఉంటుందో ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి. కానీ ఆ పని ఎవ్వరూ చేయడం లేదు. ప్రభుత్వం నిందలు వేయడానికి మాత్రమే తెగబడుతున్నారు. చివరికి ప్రసంగాల్లో రంకెలు వేయడం తప్ప.. ప్రజాదరణ ఇసుమంతైనా నిరూపించుకోలేకపోయిన పవన్ కల్యాణ్ కూడా.. అదే పని చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి గుడికీ ఒక షాడో టీం ఏర్పాటు చేస్తానని ఆయన అంటున్నారు. 

రాష్ట్రంలో ప్రతి గుడికీ ఒక షాడో ఏర్పాటు చేయదలచుకుంటే గనుక.. తద్వారా… హిందూ ఆలయాల పరిరక్షణకు నడుంబిగించిన వ్యక్తిగా, హిందూత్వ సముద్ధారకుడిగా తనను తాను ఆయన చాటుకోదలచుకుంటే గనుక.. తక్షణం చేసేయవచ్చు గదా? అనేది ప్రజల సందేహం. ప్రభుత్వం చేసేదాకా ఆగుతానని, వారు గదువులోగా చేయలేకపోతే తాను రంగంలోకి దిగుతానని రంకెలేయడం ఎందుకు? ఇప్పుడు ఆయన ఆ పనిచేస్తే ఆలయాల రక్షణ జరుగుతుందని అనుకుంటే.. చేస్తే ఎవరు కాదన్నారు. 

మరో రకంగా చూసినప్పుడు కొన్ని ఆలయాల్లో కొందరు దుండగులు కొన్ని దుడుకు పనులు చేసినంత మాత్రాన రాష్ట్రంలో ప్రతి ఆలయానికీ మూడు షిఫ్టుల్లో పోలీసు రక్షణ పెట్టించాల్సిందే అని డిమాండ్ చేస్తే గనుక.. అసలు ఈ రాష్ట్రంలో ఉండే పోలీసులు సరిపోతారా? అనేది ప్రశ్న. అదే సమయంలో.. ప్రతి గుడికీ షాడో టీం అంటున్న పవన్ కల్యాణ్ కు నిజంగా అంతగా ఏర్పాటు చేసే సత్తా ఉంటే.. అంత జనబలం ఆయన చెంత ఉంటే.. కనీసం ఆయన రెండింట ఒక్క సీటులో అయినా గెలిచి ఉండేవారు కదా…? అనేది కూడా ప్రజల్లోమెదలుతున్న సందేహంగా ఉంది. 

ఇలా చేవలేని వాళ్లంతా కొత్త దేవుళ్లుగా అవతరించి.. హిందూ దేవుళ్లని ఉద్ధరించేస్తామనం అంటుండడం ప్రజల దౌర్భాగ్యం. రాజకీయ కుట్రలు, కూహకాలతో వీరు రెచ్చిపోతున్నారు. ప్రజల దృష్టిలో క్రిస్టియానిటీతో ముడిపెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లుతున్నాం అనుకుంటున్నారు గానీ.. వాస్తవంలో.. ఇలాంటి కుయుక్తుల ద్వారా ప్రజల దృష్టిలో తమను తామే పలుచన చేసుకుంటున్నారని వారు తెలుసుకోవాలి. 

.. ఎల్. విజయలక్ష్మి

నువ్వు ఒడిపోతే పార్టీ మూసివేస్తావా !

దృతరాష్టుడి మాదిరిగా మారిపోతారేమో?