నో డౌట్‌.. ఇది కేసీఆర్‌ ఓటమి.!

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఇక్కడ మళ్ళీ నైతిక గెలుపు, నైతిక ఓటమి.. అనేవి కూడా వుంటాయండోయ్‌. ఓడినోడేమో, నైతిక విజయం తనదేనంటాడు. గెలిచినోడిది అనైతిక గెలుపు అంటాడు. ఎన్నికల వ్యవహారమిది. కానీ, ఇక్కడి మేటర్‌…

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఇక్కడ మళ్ళీ నైతిక గెలుపు, నైతిక ఓటమి.. అనేవి కూడా వుంటాయండోయ్‌. ఓడినోడేమో, నైతిక విజయం తనదేనంటాడు. గెలిచినోడిది అనైతిక గెలుపు అంటాడు. ఎన్నికల వ్యవహారమిది. కానీ, ఇక్కడి మేటర్‌ వేరు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, భూ సేకరణ విషయంలో దారుణ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. మల్లన్నసాగర్‌ సహా తెలంగాణలో పలు ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించేందుకుగాను, రాత్రికి జీవోల్ని జారీ చేసి పారేసింది కేసీఆర్‌ సర్కార్‌. ఇంకేముంది, విపక్షాల చేతుల్లో ఆయుధం పడ్డట్టే. 

ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ రంగంలోకి దిగితేగానీ, కేసీఆర్‌కి వెన్నులో వణుకు పుట్టుకురాలేదు. 'చేతకాకపోతే దిగిపో..' అని కోదండరామ్‌ విసిరిన సవాల్‌తో, ఒక్కసారిగా కేసీఆర్‌ పీఠం కదిలింది. ఆ దెబ్బకి, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలంతా, ఒకే ఒక్కడు కోదండరామ్‌పై దాడికి దిగారు. మాటల తూటాలు పేల్చారు. ఇక్కడే, కేసీఆర్‌ పరాజయం పాలయ్యారు. కానీ, అధికారం తన చేతిలో వుంది కదా, మసిపూసి మారేడుకాయని చేసేందుకు ప్రయత్నించారు. 

ఓ దశలో మల్లన్నసాగర్‌ నిర్వాసితుల్ని ఒప్పించేందుకు తెలంగాణ మంత్రి హరీష్‌రావు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. మామకు కలిగిన తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు నానా పాట్లూ పడ్డారు. కొందరు రైతులతో తెలంగాణ ప్రభుత్వానికి జేజేలు పలికించారు. అదే సమయంలో మిగిలిన రైతులు మాత్రం తెలంగాణ ప్రభుత్వంపై అగ్గిమీద గుగ్గిలమవుతూనే వచ్చారనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, విపక్షాల సంగతి సరే సరి. కోదండరామ్‌ ఇచ్చిన జోష్‌తో విపక్షాలు రెచ్చిపోయాయి. తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రజల మీదకే దాడికి వెళుతుండడాన్ని ఖండిస్తూ, నానా హంగామా చేశాయి. ఓ క్రమంలో మల్లన్నసాగర్‌ కాస్తా రణభూమిగా మారిపోయింది. లాఠీఛార్జీలతో మార్మోగిపోయింది. ఇంతా చేసి, కేసీఆర్‌ మల్లన్నసాగర్‌ వివాదంలో పైచేయి సాధించలేకపోయారు. న్యాయస్థానం, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోల్ని కొట్టి పారేసింది. నిజానికి ఇది తెలంగాణ సర్కార్‌కి చెంపపెట్టు. రెండు జీవోల్ని హైకోర్టు కొట్టివేసిన దరిమిలా, కేసీఆర్‌ సర్కార్‌ నోట మాట రావడంలేదు. 'అప్పీల్‌కి వెళతాం..' అని నీరసంగా కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. 

తెలంగాణ ప్రజలకి ఉద్యమాలు కొత్తేమీ కాదు. ఆ ఉద్యమాలతోనే కేసీఆర్‌, నిరాహార దీక్షని మధ్యలోనే వదిలేసినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మల్లన్నసాగర్‌ విషయంలోనూ ప్రజలు తమ పోరాటంలో సక్సెస్‌ అయ్యారు. చీటికీమాటికీ ఆంధ్రోళ్ళపై విరుచుకుపడే కేసీఆర్‌ అండ్‌ టీమ్‌, ఇప్పుడు న్యాయస్థానానికి ఆ 'ప్రాంతీయత'ను ఆపాదించగలదా.? ఏదిఏమైనా, ఇది కేసీఆర్‌కి నైతిక ఓటమి. ఇప్పటికే చాలా విషయాల్లో హైకోర్టు నుంచి మొట్టికాయలేయించుకున్న కేసీఆర్‌, నవ్విపోదురుగాక మనకేంటి.? అన్నట్లే వ్యవహరిస్తారా.? మెట్టు దిగి లాఠీదెబ్బలు తిన్న రైతులకు క్షమాపణ చెప్తారా.? వేచి చూడాల్సిందే.