అవి నేను పదవతరగతి చదివే రోజులు ..ఫైనల్ ఎక్ష్సమ్స్ అవుతున్నాయి లెక్కలు పేపర్ -1 అయ్యింది . అంతకు ముందు జరిగిన పరీక్షల్లో క్లాసులో రెండు లేదా మూడవ రాంకులో ఉండేవాడిని . లెక్కల్లో అయితే నూటికి 90 శాతం పైనే ఇప్పటిలో ఇది ఒక లెక్క కాదు కాని అప్పట్లో అది గొప్పే .
లెక్కలు పేపర్ -2 మరుసటి రోజు . ఏ లెక్క అయినా కొట్టిన పిండిలా వుండేది, అంత విశ్వాసం వుండేది అయినా రివిజన్ చేస్తున్నాను ..మరుసటి రోజు లెక్కలు పరిక్ష నాకు ఆ రాత్రి అగ్ని పరిక్ష. ఎందుకంటారా ? మా వూరిలో ఏదో సందర్భంగా 16 mm కలర్ బొబ్బిలి పులి సినిమా వేస్తున్నారు ..ఉదయం నుండే మైక్ లో ఒకటే అనౌన్స్ మెంట్ ..అప్పటికి బొబ్బిలి పులి విడుదలై ఏడేళ్ళు ఏడెనిమిదేళ్ళు కావచ్చు ఇప్పటిలా టూరింగ్ టాకీస్ లుకు కూడా రిలీస్ సినిమాలు వచ్చేవి కావు ..చిన్న పట్టణాల్లో కూడా ఏ మూడో రిలీస్ కో నాలుగో రిలీస్ కో వచ్చేవి ..అక్కడకి కూడా వెళ్లి చూసి రావటం గగనమే .అటువంటిది వీదిలో వేస్తునారు 16 mm లో వెయ్యటం ఆ సినిమాకి అదే మొదటిసాటి అదీ కలర్ లో చిన్న స్కోప్ తెర మీద ..ఇంకా నా ఆనందానికి అవధులు లేవు ..ఎప్పటినుండో బొబ్బిలి పులి చూడాలని వుండేది .కాని ఊరిలోకే వస్తుంది ..కాని ఏం లాభం ఆ ఉత్సాహం నీరు కారిపోవటానికి ఎంతో సమయం పట్టలేదు .ఎందుకంటే ఫైనల్ ఎక్ష్సమ్స్ ..అదీ మరుసటి రోజు ఉదయం 9.30 కి .
అన్నయ్య ముందే వార్నింగ్ ఇచ్చాడు ..రాత్రి తొమ్మిది అయ్యింది . అప్పటికే హడావిడి ఊపందుకుంది మైక్ లో. పక్క వూరి నుండి కూడా జనాలు ..నా దృష్టి అంతా పుస్తకం మీద లేదు బొబ్బిలి పులి మీదే ..చాలా రోజులు ఆ కేలండర్ మా ఇంట్లో వేలాడేది ..ఇప్పుడు సినిమా అవుతుంది ..భగవంతుడా ఏం పరిక్ష పెట్టవయ్యా అనుకున్నా పుస్తకం మీద దృష్టి పెట్టా . తొమ్మిదిన్నర అయ్యింది ఒక్కసారి మైక్ సౌండ్ ఆగిపోయింది . ..జనం గోల లేదు అంటే సినిమా మొదలవ్వటానికి సమయం దగ్గర పడింది అనటానికి సంకేతం ..
లోపల నా కోరిక అంతకంతకు బలపడుతుందే తప్ప ఏ మాత్రం బలహీన పడలేదు ..పుస్తకం తెరిచా …హు ..హు .లాభం లేదు కనీసం ఒక్క పది నిమిషాలు అయినా చూసి రావాలి పోనీ పడుకున్దాము అంటే ..నిద్ర రాదు .ఒక నిర్ణయానికి వచ్చాను ..మెల్లిగా పుస్తకం మూసేసా చుట్టూ చూసా అప్పటికే మా వాళ్ళు సినిమాకు వెళ్ళిపోయారు ..మెల్లిగా గడియ పెట్టా టవల్ మొహానికి చుట్టుకున్నా ..బొబ్బిలి పులికి వెళ్ళా ..ఆ సమయం లో పరిక్షని పక్కన పడేసాను బలవంతాన చదివినా ఎక్కి చావదు ..సినిమా మొత్తం చూసి ఆస్వాదించా మా వాళ్ళ కంటపడకుండా …
బొబ్బిలి పులికి క్లైమాక్ష్ సీన్ చూడకపోతే వేస్టు కాని ఎలా? మా వాళ్ళకి తెలియకుండా ముందే వచ్చేయాలి ..ఏది జరిగితే జరగని అని మొత్తం చూసా ..చివర్లో ఓ రెండు నిమిషాల ముందు ఇంటికి హడావిడిగా వచ్చి ..దుప్పటి ముసుగేసా ..
మరుసటి రోజు లెక్కలు చక చకా చేసుకు పోతున్నా నిద్ర లేకపోవటం వలన తలంతా దిమ్ము కట్టింది బరువుగా వుంది . జామింట్రీ సెక్షన్ వచ్చింది ..సడన్ గా మర్చిపోయా ..రెండోది హు హు మూడు హు హు నాలుగు ..ఎంతో ప్రయిత్నించా ఆశ్చర్యం ఏ లెక్క అయినా కొట్టిన పిండిలా వుండేది ..అతి విశ్వాసం నిద్ర లేమి కొంప ముంచాయి …500 మార్కులు సులభంగా వస్తాయి అనుకున్న నాకు 477 వచ్చాయి . లెక్కల్లో 74 వచ్చాయి . అదే జామింట్రీ సెక్షన్ చేసి వుంటే తప్పకుండ వచ్చేవి ..ఇదంతా ఎవరి వలన? యెన్ టి అర్ బొబ్బిలి పులి వలన కాదూ ? అంత అభిమానిని కూడా రిసల్ట్ రోజు ఒక్కసారి ఆయన్ను తిట్టుకున్నా ..”ఏం సమ్మోహన శక్తివి బాసూ” అని . దానివలన క్లాసుకి రెండో రాంకు రావలసిన నాకు మూడవ రాంకు వచ్చింది ..యెన్ టి అర్ ఫోటో చూడగానే నాకెపుడూ అదే సీన్ గుర్తుకి వస్తుంది …మనసులో నవ్వుకుంటా .
అటువంటి సమ్మోహన శక్తి ఇంకా ఈ ప్రపంచం లో పుట్టరు. అందం అభినయం. సాంఘీకం అయినా పౌరాణికం అయినా చారిత్రాత్మికం అయినా ఇన్ని కోణాల్లో ఒదిగి పోయిన నటుడు బహుసా ప్రపంచంలో రామారావు గారే అనిపిస్తుంది . అన్నీటికి మించి రాజకీయంగా సామాజికంగా నిస్తేజంగా వున్న తెలుగు ప్రజలను ఉత్తేజం చేసి డిల్లీ పాలకుల మెడలు వంచటం . బ్రస్టు పట్టిన విధానాల దుమ్ము దులిపి సంస్కరణలు చేపట్టటం ..తెలుగు వారికి ఒక బ్రాండు ని తీసుకు రావటం .
ఇంకా అటువంటి మనిషి పుట్టడు ఆయన స్థానం ఎప్పటికీ పదిలం ఎప్పటికీ ఆయనే నా లాంటి కోటాను కోట్లమందికి అభిమాన హీరో .
మీగడ త్రినాద రావు
“మన తెలుగు మన సంస్కృతి”