పద్మశ్రీ.. ఈ పురస్కారం దక్కిందంటే చాలు, తమ జీవితానికి సార్ధకత లభించినట్టే. కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పద్మశ్రీ గురించి చిన్న పిల్లాడినడిగినా కథలు కథలుగా చెప్తాడు. కారణం ఆ పురస్కారం కాదు, ఆ పురస్కారాన్ని పాలకులు అపహాస్యం చేయడమే. అధికారంలో వున్నవారు తమక్కావాల్సిన వారి కోసం ఎడా పెడా పద్మ పురస్కారాల్ని ప్రకటించడం చాలా చిన్న విషయమైపోయింది.
అసలు పద్మ పుర్కారాల్ని ఎలా ప్రకటించాలి.? ఎలా అవార్డులకు వ్యక్తుల్ని ఎంపిక చేయాలి.? అన్నది చాలామందికి తెలియని విషయం. అదిప్పుడు అనవసరమైన విషయంగానూ మారిపోయిందంటే ఆ పురస్కారాలకున్న గౌరవాన్ని పాలకులు ఎంతగా తగ్గించేశారో అర్థం చేసుకోవచ్చు.
కేంద్రం ఇచ్చే భారతరత్న దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం. ఆ తర్వాత పద్మ పురస్కారాలు. ఇందులో పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ తదితర పురస్కారాలుంటాయి. భారతరత్న పురస్కారం అంటే అదో అద్భుతం. అత్యంత పవిత్రమైన గుర్తింపు. అబ్దుల్‌కలాం కన్నా చాలామంది ముందే భారతరత్న పురస్కారాలు అందుకున్నారు. వారంతా మహనీయులే. అబ్దుల్ కలాం గురిచి కొత్తగా చెప్పేదేముంది.? దేశంలోని యువతకు ఆయనో రోల్‌మోడల్.
సచిన్ టెండూల్కర్‌కీ భారతరత్న పురస్కారం దక్కింది. కానీ, ఆ సమయంలో ఆయన ఓ పార్టీకి ప్రాతినిథ్యం వహించకపోయినా, ఓ పార్టీ కారణంగా రాజ్యసభ సభ్యత్వం పొందిన వ్యక్తి. క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ ఓ అద్భుతం. కానీ, అతన్నీ రాజకీయ కూపంలోకి లాగేశాక భారతరత్న పురస్కారం వచ్చిందంటే, ఆ పురస్కారం పేరు చెప్పి సచిన్‌నీ, సచిన్ పేరు చెప్పి భారతరత్న పురస్కారాన్నీ అపహాస్యం పాల్జేశారన్నది నిర్వివాదాంశం.
ఏటా పద్మ పురస్కారాల కోసం కేంద్రానికి రాజకీయ నాయకులు చేసే పైరవీల గురించి తెలిస్తే పద్మ పురస్కారాల్ని గౌరవించేవారెవరైనా సిగ్గుతో తలదించుకోవాల్సిందే. అంత దారుణమైన పైరవీలు అత్యున్నత పురస్కారాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇది ఖచ్చితంగా పాలకుల దుర్మార్గమే. ఫలానా వ్యక్తికి పద్మ పురస్కారం వచ్చిందంటే చాలు, అధికార పార్టీ అతన్ని కావాలనుకుంటోందనో, లేదంటే అధికార పార్టీకి ఆ వ్యక్తి సాగిలా పడ్డాడనో భావించాల్సిన దుస్థితి నెలకొంది. పద్మ పురస్కారాల ఆవేదన ఇది.
డాక్టరేట్ల సంగతేమిటి.? అంటే దీనికి ఇంకా చాలా పెద్ద కథ వుంది. ఇది మరీ దారుణమైన విషయం. డాక్టరేట్లు అందుకున్నవారిలో నిజాయితీగా ఆ అవార్డులని గెల్చుకున్నవారు కాస్త క్షమించాలి. ఎందుకంటే, నడి రోడ్డుమీద చిత్తుకాగితాల్లా తయారయ్యాయి చాలావరకు డాక్టరేట్లు. విదేశాల్లో యూనివర్సిటీలు, స్వదేశంలోని అనామక యూనివర్సిటీలూ ఎడా పెడా డాక్టరేట్లు సమర్పించేస్తున్నాయి. సారీ, అమ్మేసుకుంటున్నాయి. డాక్టరేట్ కావాలా.? ఎంతిస్తారు.? అంటూ బ్రోకర్లు పెద్ద సంఖ్యలో పుట్టుకొచ్చేశారన్నది నిష్టుర సత్యం.
‘ఆడికి డాక్టరేట్ వచ్చిందిరా..’ అంటే, ‘ఎంతక్కొన్నాడేంటి.?’ అనే ప్రశ్న వెంటనే వచ్చేస్తోందంటేనే డాక్టరేట్ అన్న గుర్తింపుకు వున్న గొప్పతనమేంటో. ఆల్రెడీ డాక్టరేట్ పొందినోడు కూడా, కొత్తగా డాక్టరేట్ తెచ్చు‘కొన్న’వాడిని చూసి వెటకారం చేస్తున్నాడంటే మొదటివాడు ఆ డాక్టరేట్‌ని ఎంతకు కొనేసుకున్నాడో అన్పిస్తోంది.
పద్మ పురస్కారాలైనా, డాక్టరేట్ అయినా.. వాటి గొప్పతనం వాటికి వుంది. పద్మ పురస్కారం పొందినా, గౌరవ డాక్టరేట్ పొందినా.. ఆయా వ్యక్తుల కారణంగా ఆయా పురస్కారాల మీద సామాన్యుల్లో గౌరవం మరింత పెరిగాలి. కానీ, ఇప్పుడు జరుగుతున్నది అది కాదు. వ్యక్తులు పొందుతున్న పురస్కారాలతో, ఆయా పురస్కారాల గౌరవం తగ్గిపోతోంది. వ్యక్తుల గౌరవమూ నాశనమైపోతోంది.
ఇప్పుడిదంతా ఎందుకంటారా.? సినీ నటులు మోహన్‌బాబు, బ్రహ్మానందం విషయంలో వారికి ఇదివరకు కేంద్రం ప్రకటించిన పురస్కారాలు, వాటిని వారు వాడుకున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పురస్కారాల గురించిన చర్చ సర్వత్రా జరుగుతోంది. పేరుకి ముందు పద్మశ్రీ, పద్మభూషణ్.. అనే బిరుదుల్నీ, డాక్టరేట్ గౌరవాల్నీ ‘వాడుకోవడం’ ఇదే కొత్త కాదు, కానీ న్యాయస్థానాలు ఇప్పటికైనా స్పందించినందుకు ప్రతి ఒక్కరూ హర్షించాలి. పురస్కార గ్రహీతలూ ఆయా పురస్కారాల పట్ల గౌరవంతో, భక్తిభావంతో మెలగాలి.