పాపం చంద్రబాబు..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎంత మందినో సంతృప్తిపరచాల్సిన బాధ్యత ఉన్నది. అటు కృష్ణా జిల్లాకు చెందిన తమ వర్గీయులను మెప్పించాలి. వారిని మెప్పిస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర నేతలు బాధపడకుండా వారిని మెప్పించేదుకు రకరకాల…

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎంత మందినో సంతృప్తిపరచాల్సిన బాధ్యత ఉన్నది. అటు కృష్ణా జిల్లాకు చెందిన తమ వర్గీయులను మెప్పించాలి. వారిని మెప్పిస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర నేతలు బాధపడకుండా వారిని మెప్పించేదుకు రకరకాల విన్యాసాలు చేయాలి. మరోవైపు కాపులను సంతృప్తిపరచాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహాయపడాలంటే మోడీ ఏమి మాట్లాడినా చప్పట్లు కొట్టాలి. చివరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేతలు అసంతృప్తి చెందకుండా చూసుకోవాలి. వారికోసం బతుకమ్మ ఆటలు ఆడి పాదాలు కదపాలి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా, మళ్లీ వైఎస్సార్సీ నేత జగన్మోహన్ రెడ్డి విజృంభిస్తారన్న భయంతో కూడా వణికిపోవాలి.

ఇది చంద్రబాబునాయుడు దుస్థితి. ఆయన చుట్టూ కృష్ణా, గుంటూరు జిల్లాకు చెందిన ఆయన వర్గీయులు కమ్మేసుకున్నారు. వారు ఏమి చెప్పినా చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు. వారు చెప్పినట్లు రాజధానిని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏర్పాటు చేస్తే సరిపోవడం లేదు. రాజధాని నిర్మాణంలో వారు అడుగడుగునా సూచించే చర్యలను అంగీకరించి వారికి లాభాలు చేపట్టే పనులు చేయాలి. అందువల్ల ఆయన స్వంత నిర్ణయాలకు తావులేదు. గతంలో ఆయన ఎప్పుడూ తన హయాంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేయలేదు. ఆయన వాజ్‌పేయి హయాంలో,ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించలేదు. ఇప్పుడు ఆయన ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని కేబినెట్‌లో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపారంటే అది పూర్తిగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తన వర్గీయులను సంతృప్తి పరచడం కోసమే.  ఎన్టీఆర్ ఒక చారిత్రక మహాపురుషుడని, ఆయనకు భారత రత్న ఇస్తే దేశం తనను తాను సత్కరించుకున్నట్లవుతుందని చంద్రబాబు ఈ తీర్మానంలో పేర్కొన్నారు. 

విచిత్రమేమంటే తెలుగువారి తరఫున తొలి ప్రధాని అయిన పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. పివి ప్రారంభించిన సంస్కరణల ఘనత తనకు ఆపాదించుకున్న చంద్రబాబు కనీసం పార్లమెంట్‌లో ఆయన విగ్రహం పెట్టాలని కూడా డిమాండ్ చేయలేదు. అంటే పివి కంటే ఆయన, ఆయన వర్గీయులు ఎన్టీఆర్‌కు ఎక్కువ విలువనిస్తున్నట్లేనని అర్ధమవుతుందని, చంద్రబాబుకు పివి అంటే ఎంత అభిమానం ఉన్నా తన వర్గీయుల మాట జవదాటరని దీన్ని బట్టి అర్ధమవుతోంది. 

విచిత్రమేమంటే చంద్రబాబునాయుడు నరేంద్రమోడీకి పూర్తిగా సమంతుడిలా వ్యవహరిస్తున్నారు. నరేంద్రమోడీ అమెరికా పర్యటనను శ్లాఘిస్తూ ఆయన ఏకంగా కేబినెట్ తీర్మానం ప్రవేశపెట్టారు. అంత గొప్ప పర్యటన మరే ప్రధాని చేయలేదట. మోడీకి ముందు పివి, వాజ్‌పేయి, మన్మోహన్‌సింగ్‌తో అమెరికాకున్న సత్సంబంధాలను చంద్రాబాబు విస్మరించి మోడీకి చెక్కభజన చేసే దుస్థితిలో పడ్డారు. ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత నరేంద్రమోడీ పొరుగుదేశలతో ఏర్పర్చుకున్న సంబంధాలు అమోఘం. ప్రశంసనీయం. ఆయన పర్యటనలు దేశప్రతిష్టను పెంచాయి. భారత అమెరికా సంబంధాలకు మోడీ పర్యటన కొత్తదిశను, దశను కల్పించింది.దీనివల్ల ప్రపంచశాంతి ఏర్పడి ఉగ్రవాద నిర్మూలన జరుగుతుంది. అని చంద్రబాబు కేబినెట్ మోడీని వేనోళ్ల ప్రశంసించింది. అమెరికా సహకారంతో విశాఖపట్టణాన్ని స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేయడాన్ని కూడా కేబినెట్ ప్రశంసించింది.

నిజానికి మోడీ అమెరికా పర్యటనను అభినందిస్తూ చంద్రబాబు ఒక ప్రకటనను విడుదల చేస్తే చాలు. మొత్తం కేబినెట్ సాగిలపడేలా చేసి తీర్మానం చెయించనక్కర్లేదు. అసలు నరేంద్రమోడీ ఎన్డీఏ సర్కార్‌లో తెలుగుదేశం పార్టీకి పెద్దవిలువే ఇవ్వడం లేదు. బిజెపితో కొన్ని దశాబ్దాలుగా సన్నిహితంగా ఉన్న శివసేన పార్టీనే ఆయన పక్కన పడేశారు. మహారాష్ట్రలో ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. ఇది చంద్రబాబుకు వణుకు పెట్టింది. పుటుక్కున ఏదో ఒక సాకు చెప్పి తెలుగుదేశంతో కూడా మోడీ తెగతెంపులు చేసుకుంటే తన గతేమిటి? రాష్ట్రానికి నిధులు ఎక్కడినుండి వస్తాయి.? అందుకే ఆయనను మోడీని మెప్పించేదుకు ఆయన రకరకాల విన్యాసాలు చేశారు. మోడీ ప్రకటించిన స్వచ్ఛభారత్‌ను ఆయన స్వచ్చంధంగా అమలు చేశారు. తాను, మంత్రులు కలిసి రోడ్లు ఊడ్చి, మురుగు కాల్వలు శుభ్రం చేసి మోడీని సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. చంద్రబాబుకు సన్నిహితులైన పత్రికాధినేతలైతే మోడీని పడి పడి కీర్తిస్తున్నాయి. రామోజీరావు స్వచ్ఛభారత్‌పై ఈనాడులో మొదటిపేజీ సంపాదకీయాలే రాశారు. ఇక ఆంధ్రజ్యోతిలో పేజీలకు పేజీలు మోడీ ఫొటోలతో, మోడీ భజనతో వార్తలు తెగ రాస్తున్నారు. మోడీ మనసు నొప్పించకుండా చంద్రబాబు, ఆయన వర్గీయులు శక్తివంచన లేకుండా ఆయన భజన చేస్తున్నారు. వారి ప్రయోజనాలు మోడీ భజనతో ఇమిడి ఉన్నాయి మరి.

ఇక కేంద్రపట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు కూడా చంద్రబాబు నాయుడును పెద్దగా పట్టించుకోవడం లేదు. వెంకయ్య తనను మోడీ స్థాయిలో ఊహించుకోవడంతో చంద్రబాబు ఆయన వద్ద బాగా తగ్గిపోవాల్సి వచ్చింది వెంకయ్య లిఫ్ట్ ఇవ్వకపోవడంతో చంద్రబాబు సహాయమంత్రి నిర్మాలా సీతారామన్‌ను అందలమెక్కించారు. ఆమె మోడీ సన్నిహితురాలని తెలియడంతో ఆమెను ప్రతి కార్యాలయానికి పిలిచి ఆదరిస్తున్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆమెతో పాటు కలిసి రోడ్లు ఊడ్చారు. ఆమె జాతీయ స్థాయి నేతలా హామీలు గుప్పిస్తే చంద్రబాబు చప్పట్లు కొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీ, ప్రత్యేక హోదా ఆమె చెతుల్లో ఉన్నాయని వెంకయ్య బాబుకు హింట్ ఇచ్చినట్లు సమాచారం.