ఎమ్బీయస్‌ : బాపుకు బాష్పాంజలి – 9

ఇదంతా 2002 ఏప్రిల్‌ ప్రాంతంలో జరిగింది. జరిగినది విశాలాంధ్ర రాజేశ్వరరావుగారికి చెప్పి ''బుడుగు''లో బొమ్మలు మార్చాలి. మళ్లీ నెగటివ్‌లు తీయాలంటే ఆ ఖర్చు నేను పెట్టుకుంటాను.'' అని ఆఫర్‌ చేశాను. ''అదేం అక్కరలేదు లెండి.…

ఇదంతా 2002 ఏప్రిల్‌ ప్రాంతంలో జరిగింది. జరిగినది విశాలాంధ్ర రాజేశ్వరరావుగారికి చెప్పి ''బుడుగు''లో బొమ్మలు మార్చాలి. మళ్లీ నెగటివ్‌లు తీయాలంటే ఆ ఖర్చు నేను పెట్టుకుంటాను.'' అని ఆఫర్‌ చేశాను. ''అదేం అక్కరలేదు లెండి. మార్చి యిచ్చేసేయండి.'' అన్నారాయన. నేను యిచ్చాను కానీ సెకండ్‌ ఎడిషన్‌ కూడా మొదటి ఎడిషన్‌ బొమ్మలతోనే వెలువడింది. జరిగిందేమిటంటే అప్పటిదాకా ''బుడుగు'' రెండు భాగాలుగా వెలువడుతూ వచ్చేది. రెండూ కలిపి ఒకే ఎడిషన్‌గా రావడంతో సూపర్‌ సక్సెసైంది. వెంఠనే కాపీలు కావాలని అన్ని బ్రాంచీలనుండి డిమాండ్లు వచ్చాయి. బొమ్మలు మారుస్తూ కూర్చుంటే లేటవుతుందని పాత నెగటివ్‌లతోనే యింకో ఎడిషన్‌ వేసేసి మార్కెట్‌లో రిలీజు చేసేశారు. బాపుగారు ఆ ఎడిషన్‌ చూడగానే నేను మాట తప్పానని భావించారు. ఇంతలో యింకో సంఘటన కూడా జరిగింది. ''హాసం''లో నేను నిర్వహించిన అనేక శీర్షికలలో 'బాపూరమణీయం' ఒకటి. 1-15 మే 2002 సంచికలో సమ్మర్‌ స్పెషల్‌గా పిల్లల కోసం అంటూ బుడుగులోని అలాడీన్‌ ఖద వేద్దామనుకున్నాను. దానికి యింట్రో రాసి యిచ్చేసి, మేటర్‌ బుడుగులోంచి తీసుకోండి అని సూచనలు యిచ్చేసి నేను వూరెళ్లాను. అప్పట్లో హాసం మార్కెటింగ్‌లో భాగంగా డిస్‌ప్లే స్కీము అని పెట్టి జిల్లాలన్నీ పర్యటిస్తున్నాను. మా స్టాఫ్‌ ఆ మేటర్‌తో బాటు బుడుగు ఫస్ట్‌ ఎడిషన్‌లో ఆ చాప్టర్‌లో వున్న బొమ్మలు (అనగా పాతవే) వేశారు. హాసం చూడగానే బాపుగారికి నేను కావాలనే యిదంతా చేస్తున్నాను అనే అభిప్రాయం కలిగింది. 

నా సంగతి తెలిసి కూడా ఆయన అపార్థం చేసుకోవడమేమిటి అని రమణగారిని అడిగితే 'బాపు తొందరగా అపార్థం చేసుకునే అపార్థసారథి లెండి' అన్నారు. కోతికొమ్మచ్చిలో రాశారు కూడా – ''బాపు అపార్థసారథి, నేను అప్పార్థసారథి..' అని. బాపు నాకు ఘాటుగా వుత్తరం రాశారు. సమాధానంగా 'మీరంటే అంత అభిమానం వున్న నేను అలా ఎందుకు చేస్తాను? జరిగినది యిది' అని వివరిస్తూనే, 'పాతబొమ్మలు వేస్తే మీకెందుకింత కోపం? కథారమణీయం – 1లో పాత బొమ్మలు వేసినపుడు వూరుకున్నారు కదా' అని లాజిక్‌ లాగాను. నా ఆర్టికల్స్‌ చదివే వారందరికీ తెలుసు – నేను ప్రతీదానికీ లాజిక్కులు వెతుకుతానని. ఆ లక్షణం నా బంధుమిత్రులందరికీ చికాకు తెప్పిస్తుంది. ఈ సందర్భంలో బాపుగారికీ తెప్పించింది. ఓ ఉత్తరం రాశారు – 'ఒకాయన యింటికి వచ్చేసరికి వాళ్లావిడ ఎవరితోనో పడుక్కుని కనబడిందట. ఇదేమిటి అని అడగబోతే 'అసలు మీరు యింటికి యింత ఆలస్యంగా ఎందుకు వచ్చారో అది చెప్పండి ముందు' అని లాజిక్కు లాగిందట. మీలాటి మేధావులంటే నాకు పడదు. నా జోలికి రాకండి.' లాటి మాటలతో విరుచుకు పడ్డారు. 'రామాంజనేయయుద్ధం లాటి సినిమాలు చూసినపుడు భక్తుడైన హనుమంతుడికి తన దేవుడితో యుద్ధం ఎలా వస్తుంది అనుకునేవాణ్ని. అలాటిది సాధ్యమే అని యిప్పుడు నమ్ముతున్నాను. మీరేమన్నా మీ పట్ల నా భక్తి చెరగదు, తరగదు' అని ఉత్తరం రాసి నా పని నేను చేసుకుపోయాను. అదే ఏడాది డిసెంబరులో బాపు విశ్వరూపం ప్రారంభించాను. బాపుగారికి కోపం వస్తే సాధారణంగా రోజుల్లో పోతుంది. నా విషయంలో మాత్రం నెలలు పట్టింది. కోపం తగ్గాక మాత్రం యింతటికంటె ఎక్కువగా వాత్సల్యం చూపారు. ఆయన బొమ్మల విషయంలో నా అభిప్రాయం మారలేదని ఆయనకు తెలుసు, అయినా సహించారు. అందుకే ఆయన ఋషితుల్యుడు. 

బాపు, రమణలు యిద్దరికీ ప్రచారం, అహంకారం గిట్టదు. తమకు నచ్చిన గొప్పవాళ్లలో అహంభావం కనబడితే వాళ్లు బాధపడతారు. పరిశ్రమలో యితరుల గురించి అసూయ  పడడం కానీ, తప్పులు ఎంచడం కానీ వారికి తెలియని విద్య. ఎవరైనా వచ్చి ఆత్మీయంగా మాట్లాడితే కరుగుతారు. బాపులో బోళాతనం జాస్తి. సంగీతం అంటే పరమ యిష్టం. అప్పుడప్పుడు ఫోన్‌ చేసి ఫలానా పాట దేనిలోది, ఫలానా హిందీ పాటకు మ్యూజిక్‌ ఎవరిచ్చారు అని ఏ మాత్రం భేషజం లేకుండా అడిగేవారు. కొన్ని హిందీమాటలకు అర్థం అడుగుతూంటే నాకు వింతగా తోచేది – హిందీ పాటలు బోల్డు వింటారు కదా, హిందీ సినిమాలు కూడా తీశారు కదా తెలియకుండా వుంటుందా? మనని టీజ్‌ చేయడానికి అడుగుతున్నారా? అని. అలాటిదేమీ లేదు. ఏదైనా విషయం మర్చిపోయినా, 'వీణ్నడగడం ఏమిటి?' అనే సంకోచం లేకుండా అడిగేవారు. ఆయన మనకిస్తున్న ప్రాముఖ్యతకు తలమునకలై పోతామంతే. ఆయన నవ్వు నిష్కల్మషంగా, పాపాయి నవ్వినట్లు వుంటుంది. ఆయనకు కులమతాల పట్టింపు లేదు. నడిచే దేవుడుగా పేరు బడిన ఒక స్వామీజీ కులతత్వం ప్రదర్శిస్తే యీయన చాలా నొచ్చుకున్నారు. రాముడంటే భక్తి వున్నా పూజలు, పునస్కారాలు, యాగాలు, హోమాలు విస్తారంగా చేసే తరహా కాదు. 60 ఏళ్లు పూర్తయినపుడు షష్టిపూర్తి అంటూ తెలుగునాడంతా సందడి చేసింది కానీ ఆయన ఆయుష్యహోమాలు గట్రా చేసుకోలేదు. ఆ రోజు కూడా పంతం కొద్దీ షూటింగుకి వెళ్లిపోయారు. ఆయన కర్మయోగి. పనిలోనే ఆనందం పొందారు. క్రమశిక్షణలో ఆయనను మించినవారు లేరు. చెప్పిన తేదీకి బొమ్మ వేసి పంపించేసేవారు. ఎంత అద్భుతమైన టైమ్‌ మేనేజ్‌మెంట్‌ లేకపోతే అన్ని బొమ్మలు వేయగలరు, అన్ని సినిమాలు తీయగలరు! 

ఇప్పుడు బాపు-రమణల స్మారకచిహ్నాల గురించి చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం వారి గురించి పట్టించుకోవటం లేదు. వాళ్లపై ఆంధ్ర ముద్ర వేసేసి వాళ్లకు ధారాదత్తం చేసేసినట్టుంది. ఒకలా చెప్పాలంటే వాళ్లు మద్రాసీలు, కాదంటే ఉభయరాష్ట్రాలకూ చెందినవారు. బాబు లీడ్‌ తీసుకున్నారు. రాజమండ్రిలో యిద్దరి విగ్రహాలు పెడతారట. హబ్‌లు పెట్టి కొత్త రోడ్లు చాలా వేస్తారంటున్నారు, రోడ్డు విస్తరణలో విగ్రహాలు వుంటాయో, పోతాయో తెలియదు. తానా వాళ్లు నరసాపురంలో బాపు విగ్రహం పెడతానంటున్నారు. విజయవాడలో బాపు-రమణల పేర కళాక్షేత్రం పెడతామంటున్నారు బాబు. ఆగస్టు 2000 సం||రంలో శిల్పారామం ఎదుట బాపు ఆర్ట్‌ ఎకాడమీ పెడుతున్నామని హంగామా చేసి నీరు కార్చేసిన ముఖ్యమంత్రి ఆయనే. (పేపర్‌ కటింగు చూడండి) ఇప్పుడు కళాక్షేత్రం అంటున్నారు. విజయవాడతో లింకెందుకో ఆయనే చెప్పాలి. అది వారి జన్మస్థలమూ కాదు, కార్యక్షేత్రమూ కాదు. బాపు ఆర్ట్‌ ఎకాడమీ నిజంగా పెడతారా? పెడితే ఎవరు పెడతారు? ప్రయివేటు వ్యక్తులు పెడితే దాని నిర్వహణ ఎవరు చూస్తారు? అన్నిటి కంటె ముఖ్యంగా దానికి క్యురేటర్‌ ఎవరుంటారు? ఏర్పాటు చేసినా చూడడానికి ఎవరైనా విజిటర్స్‌ వస్తారా? ఎన్నాళ్లు వస్తారు? మనవాళ్లకు చిత్రకళపై అంత ఆసక్తి వుందా? రాజమండ్రిలో దామెర్ల రామారావు ఆర్ట్‌ గ్యాలరీ విజిటర్స్‌ బుక్‌ చూడండి, రోజుకి ఎంతమంది వస్తారో అంచనా తెలుస్తుంది. బాపు బొమ్మలు యింటర్నెట్‌లోనే విస్తారంగా కనబడుతూ వుంటే, ఒరిజినల్స్‌ చూడాలనే పట్టుదలతో టిక్కెట్టు కొని వచ్చి చూస్తారా? అన్నీ ప్రశ్నలే. 

నా ఉద్దేశంలో బాపు-రమణలకు సంబంధించిన కాగితాలు, బొమ్మలు, సినిమాలు డిజిటలైజ్‌ చేయించి, ఆడియో విజువల్‌ ఫార్మాట్‌లో, చక్కటి కామెంటరీతో ఎన్ని గంటలు పడితే అన్ని గంటల ప్రోగ్రాంలు చేయించాలి. ఏదైనా యూనివర్శిటీ లైబ్రరీలో ఓ మూల బాపు-రమణల వింగ్‌ అని బోర్డు పెట్టి మూడు నాలుగు కంప్యూటర్‌ టెర్మినల్స్‌ పెట్టి వాటిల్లో యీ ప్రోగ్రాంలు చూపించాలి. వారిపై ఆసక్తి కలవారు, రిసెర్చి చేద్దామనుకున్నవారు అక్కడకు వెళ్లి తెలుసుకుంటారు. అలాటి కార్యక్రమం జరిగితే నా దగ్గర వున్న వారి సినిమాల సెన్సారు స్క్రిప్టులు, రమణగారు పంపిన మ్యానుస్క్రిప్టు పద్యాలు వంటివి యిచ్చి డిజిటలైజేషన్‌కు సహకరిస్తాను. ఎందుకంటే అవి జాతి సంపద. నా బోటి వ్యక్తి దగ్గర వుండిపోతే నా తదనంతరం ఎటు పోతాయో తెలియదు. 

ఇది కాకుండా యింకో మంచి సలహా వచ్చింది – మా ''హాసం క్లబ్‌'' రాజమండ్రి వారు నిర్వహించిన బాపు సంతాపసభలో. ఆర్‌ కె లక్ష్మణ్‌ కామన్‌మ్యాన్‌ విగ్రహాన్ని పుణెలో పెట్టినట్లు బుడుగు విగ్రహం పెట్టాలని! దాన్ని రోడ్డు జంక్షన్‌లో పెడితే ఏడాదికి ఓ సారి కడిగేవాడైనా వుండడు – జయంతి, వర్ధంతి వుండవు కాబట్టి. హాయ్‌ల్యాండ్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ వంటి పార్కుల్లో పిల్లల విభాగంలో మిక్కీ మౌస్‌లాగే బుడుగు విగ్రహం కూడా పెడితే నిర్వహణ సంగతి వాళ్లే చూసుకుంటారు. 

వీటిల్లో ఎన్ని జరిగినా, జరగకపోయినా బాపు-రమణలు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా వుంటారు. నా మట్టుకు నేను జీవించి వున్నతంకాలం వారిని, నా పట్ల వారి వాత్సల్యాన్ని తలచుకుంటూనే వుంటాను. బాపు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, .. సెలవ్‌. (సమాప్తం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2014)

mbsprasad@gmail.com

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5

Click Here For Part-6

Click Here For Part-7

Click Here For Part-8