ఎమ్బీయస్‌ : బాపుకు బాష్పాంజలి – 7

''మిమ్మల్ని కమ్మర్షియల్‌ ఆర్టిస్టుగానే పేర్కొంటారా? ఆంధ్రచిత్రకారులు అన్నపుడు అడవి బాపిరాజు, దామెర్ల రామారావు, మొక్కపాటి కృష్ణమూర్తి.. వంటి పేర్లు చెపుతారు కానీ బాపు అని ఎందుకనరు? ఈ రెండు విభాగాల మధ్య ఏదైనా అగాధం…

''మిమ్మల్ని కమ్మర్షియల్‌ ఆర్టిస్టుగానే పేర్కొంటారా? ఆంధ్రచిత్రకారులు అన్నపుడు అడవి బాపిరాజు, దామెర్ల రామారావు, మొక్కపాటి కృష్ణమూర్తి.. వంటి పేర్లు చెపుతారు కానీ బాపు అని ఎందుకనరు? ఈ రెండు విభాగాల మధ్య ఏదైనా అగాధం వుందా? మీరు దానిని 'బ్రిడ్జ్‌' చేసే ప్రయత్నాలు చేయలేదా?'' అనే ప్రశ్నకు ''నా బొమ్మల గురించి నాకు బాగా తెలుసు కనక ఎవరెలా పేర్కొన్నా అంత పట్టింపు లేదు.'' అని చెప్పారు. ''మన దేశంలో జామినీ రాయ్‌ శైలి, ఇది నందలాల్‌ బోస్‌ శైలి, ఎం ఎఫ్‌ హుస్సేన్‌ బొమ్మ యిది అని ఒక ముద్ర తెలుస్తుంది గదా. 'ఇది బాపు బొమ్మ' అని జాతీయస్థాయిలో ఆర్ట్‌ సర్కిల్స్‌లో తెలుస్తుందా? తెలుగునాట ఎలాగూ తెలుసనుకోండి. మీ శైలికి ఏదైనా ప్రత్యేకమైన పేరుందా? ఓల్డ్‌ మాస్టర్స్‌ శైలికి అదేమైనా దగ్గరగా వుంటుందా? మీ సొంతశైలి ఇవాల్వ్‌ చేసుకోవడానికి ప్రయోగాలు చేశారా? ఆ ప్రయోగాలన్నీ ప్రజామోదం పొందాయా?'' అని ఇంత పెద్ద ప్రశ్న వేస్తే ''ఇది బాపు బొమ్మే అయుంటుందని చెప్పవలసింది నేను కాదు. చూసేవాళ్లు. అలాగే 'ప్రత్యేక' శైలీనూ.'' అని సింపుల్‌గా తేల్చేశారు. దీనితో బాటు 'ఎబ్‌స్ట్రాక్ట్‌ చిత్రకళపై మీ అభిప్రాయం ఏమిటి?' అని అడిగితే 'ఎబ్‌స్ట్రాక్ట్‌ అవనివ్వండి, మరేదైనా కానీయండి, ఏదయినా బొమ్మ చూడగానే మనసుకు హత్తుకోవాలి. ఆహా 'ఎంత బావుంది' అనిపించాలి. 'ఎందుకు' అని కాదు.'' అని అభిప్రాయపడ్డారు. పికాసో, డాలీల చిత్రాల గురించి అడిగితే 'అవి అనుపమానం, అద్భుతం. చూసినవారిని బొమ్మ ఆలోచింపచేసింది అంటే అది చాలా గొప్పదన్నమాట. అనుకున్న భావం ప్రేక్షకులకు అర్థం కాకపోతే అది గొప్పది కాదన్నమాట. ఏ పని చేసినా నలుగురూ మెచ్చుకునేట్లు వుంటే అది సార్థకమవుతుంది.'' అని తన అభిప్రాయం చెప్పారు.

బాపు తన బొమ్మల పుస్తకాలు, కార్టూన్‌ పుస్తకాలు వేసినప్పుడు తన కంటె సీనియర్ల చేత కాని, ఆర్ట్‌ క్రిటిక్స్‌ చేత కానీ ముందుమాటలు రాయించుకోలేదు. క్రోక్విల్‌ వాళ్లు వేసిన పుస్తకంలో కూడా ఆయన సహచరులే రాశారు. విమర్శకుల కొలబద్దలు అవసరం అని ఆయన అభిప్రాయమేమో. రమణగారి రచనలకు ముందు మాట రాసినపుడు చాలామంది 'మీరు చెప్పేదాకా ఆ కథల్లో స్వారస్యం మాకు తెలియలేదండి' అనేవారు. బాపు బొమ్మల గురించి అలా ఎవరైనా తెలియచెప్తే బాగుండునని నేను కోరుకుంటూ వుండేవాణ్ని. ''హాసం'' పత్రిక నడిపినపుడు బాపు పుట్టినరోజు డిసెంబరు 15 న కాబట్టి, 2002 డిసెంబరు 1వ సంచిక నుండి 24 సంచికల పాటు అంటే ఒక ఏడాది – ''బాపు విశ్వరూపం'' శీర్షిక నడిపి బాపు బొమ్మల గురించి పాఠకులకు అవగాహన కల్పించాలని సంకల్పించాను. నాకు ఆ శక్తి లేదని తెలుసు. బ్నిం, గంధం, విజయమోహన్‌ రెడ్డి  – వీళ్లంతా బొమ్మలేసేవాళ్లే. బాపును మెచ్చుకుంటూ అందంగా రాయగలరు కానీ విశ్లేషించమంటే తటపటాయిస్తున్నారు. అసలంటూ మొదలుపెడితే వాళ్లే కదలివస్తారనుకుని, మొదలుపెట్టేశాను. (ఈ సీరీస్‌ అయిపోయాక దీనికి అనుబంధంగా ''బాపు విశ్వరూపం'' యిస్తాను). బాపు కథ, వ్యాసాలు, కవర్‌ పేజీలు, గ్రీటింగ్స్‌, యాడ్స్‌, కామిక్స్‌, కార్టూన్లు, ఆయన లైను ఎలా మారుతూ వచ్చిందో చూడండి  అంటూ.. రకరకాలుగా పాఠకుల ముందుకు తెచ్చాను. అప్పటికి కళాజ్యోతి వాళ్లు వేసిన బాపు బొమ్మల పుస్తకం, గంధం వేసిన హరివిల్లు అవీ రాలేదు. క్రోక్విల్‌ వాళ్లు వేసిన పుస్తకం చాలా తక్కువ మంది దగ్గర వుంది. నేను పడిన అవస్థలు పాఠకులను ఆకట్టుకున్నాయి. నా వ్యాఖ్యలు చూసి బాపుగారు నవ్వుకుంటున్నారేమోనని బెంగ. రమణగారిని అడిగితే 'బాగానే వున్నాయన్నాడు' అని చెప్పారు.  ఇలా నడుస్తూ వుండగా కార్టూనిస్టు ఎమ్మెస్‌ రామకృష్ణగారు బాపు కార్టూన్లలో చిత్రకళ గురించి మంచి వ్యాసం పంపారు. తక్కినవాళ్లు ఎవరూ కలిసి రాలేదు. చివరకి వచ్చేసరికి ఎస్పీ బాలూగారికే బాగా నచ్చి బాపుతో ఆయన ఆయన అనుభవాలు రాసి పంపి బ్రహ్మాండమైన ముక్తాయింపు యిచ్చారు. అమ్మయ్య అనుకున్నాను.

నేను బాపుగారి బొమ్మల సేకరణలో కాని, వాటిని సంకలనం చేసి సంపాదకత్వం చేయడంలో కానీ ఎన్నడూ పాలు పంచుకోలేదు. ఎందుకంటే ఒకసారి సంపాదకత్వం అంటూ ఎవరికైనా బాధ్యత అప్పగించాక కళాకారుడు వదిలేయాలి. రమణగారు తన రచనల విషయంలో నాకు వదిలేశారు. ఫైనల్‌గా ఏదైనా అభ్యంతరం వుంటే తెలుపవచ్చు అనుకున్నారు. ఆ అవసరం పడలేదు. రమణగారిలాగ బాపు యింకోళ్లకు సబ్మిట్‌ చేసే తరహా కాదు. ఏ సంకలనం అయినా ఆయనే సెలక్టు చేస్తారు. ఇక మనకు పనేం వుంటుంది? అందునా బాపుగారి బొమ్మల విషయంలో ఆయనకూ, నాకు భిన్నాభిప్రాయాలున్నాయి. నేను '60ల్లో పెరిగినవాణ్ని. కథలు చదివి, వాటికి బాపు బొమ్మలు చూసి మురిసిపోయినవాణ్ని. కార్టూన్లలో మనుష్యులను కూడా అందంగా వేసిన ఆనాటి బాపు లైను మనసులో హత్తుకుపోయింది. దాన్నే బాలి, చంద్ర యిప్పటికి కూడా కంటిన్యూ చేస్తారు కాబట్టి వాళ్ల బొమ్మలూ నాకిష్టం. బాపుగారు లైను మారుస్తూ పోయారు. కావాలంటే పాత లైనులో వేయగలరు, దేవీదేవతా మూర్తుల బొమ్మలు వేసినపుడు అదే శైలిలో వేస్తారు. కానీ యిలస్ట్రేషన్లు, కార్టూన్లు వేసినపుడు లైన్లు వంకరటింకరగా వేయడం ప్రారంభించారు. 

నేను 1995 నాటి యింటర్వ్యూలో ''మీరు కార్టూన్లలో కూడా లైన్లు యిటీవల చాలా మార్చేశారు కదా, అది ఆధునిక చిత్రకళారీతియా?'' అని అడిగాను. జవాబుగా ఆయన – ''మారుతూ వుండడం ప్రకృతి సహజం. అలాగే ఒకో మహానుభావుడి రేఖలు నచ్చినపుడు లైన్లు మారుతూ వుంటాయి. అది ఒక విధమైన పూజ లాటిది.'' అన్నారు. కావచ్చు. ఎన్ని థాబ్దాలైనా శంకర్‌ (శంకరన్‌ పిళ్లయ్‌), ఆర్‌ కె లక్ష్మణ్‌, ఊమెన్‌, ఆబూ అబ్రహాం, మేరియో మిరాండా యిత్యాదులు లైను మార్చలేదు కాబట్టి యీయనా మార్చకూడదని శాసించలేం. ఆయన బొమ్మలు ఆయనిష్టం. కానీ పాత కారెక్టర్లను ఒకలా మన మనసుల్లో ఎస్టాబ్లిష్‌ చేసిన తర్వాత వాళ్లని మళ్లీ యింకోలా చూపడం తగదని నా అభిప్రాయం. పాత పాటల రీమిక్స్‌ కూడా నాకు నచ్చదు. ఒరిజినల్‌ ఒరిజినలే. దానికి బీట్‌ మార్చి, ర్యాప్‌ అంటూ తరుముకుని వచ్చినట్లు పాడేసి ఎంజాయ్‌ చేయమంటే నా తరం కాదు. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5

Click Here For Part-6