టీమిండియా, పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది వరల్డ్ కప్ పోటీల్లో. ఈ సంబరంలో దేశ ప్రజానీకం మునిగి తేలుతోంటే ఎంచక్కా చమురు కంపెనీలు పెట్రోధరల్ని పెంచేశాయి. పెద్దగా కాకపోయినా, పదిహేను రోజులకోసారి సమీక్ష.. పేరుతో ఠంచనుగా 15వ తేదీనే పెట్రోధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్ కంపెనీలు.
చాలాకాలంగా పెట్రోధరలు తగ్గుతూ వస్తున్నాయి. పెట్రోధరలు తగ్గుతోంటే ఖజానాకి కష్టం కలుగుతోందంటూ కొన్ని సందర్భాల్లో కేంద్రం, రాష్ట్రాలు పన్నులు పెంచుతూ వచ్చిన విషయం విదితమే. నాలుగున్నర రూపాయలు తగ్గాల్సిన టైమ్‌లో కేంద్రం వేసిన పన్నుల పుణ్యమా అని రెండ్రూపాయలే తగ్గిన సందర్భాలున్నాయి. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖజానాలో నింపేసుకోవడమూ చూశాం.
మరి, పెట్రోధర పెరుగుతున్నప్పుడు.. కేవలం 80 పైసలే కదా.. అని రాష్ట్రాలు, కేంద్రం వెసులుబాటు కల్పిస్తాయా.? అంటే, వినియోగదారుడ్ని ఎలా బాదేయాలా.? అనే ఎప్పుడూ చూసే ప్రభుత్వాలు ఆ పని చేయవన్నది నిర్వివాదాంశం. పెద్దగా వాత పెట్టకపోయినా, చిన్న చురకతో సరిపెట్టాయి పెట్రో కంపెనీలు. అది కాస్త ఊరట అంతే. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల నేపథ్యంలోనే ఆయిల్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయట.