చాలా ఏళ్ల కిందట ఆర్థికశాస్త్ర పుస్తకాల్లో ఓ అర్థశాస్త్రవేత్త చెప్పిన సూత్రీకరణ ఉండేది. అదేమిటంటే… 'భారతదేశం ధనవంతమైనదే… కాని ప్రజలు పేదవారు' అని. ఇది ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఒకప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారిపోయాయి కదా. టీఆర్ఎస్ ప్రభుత్వ బాకా (అంటే వాయిస్ అన్నమాట) 'నమస్తే తెలంగాణ' పత్రిక ఇదే సూత్రీకరణ చేసింది. ఏమని? 'ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబరు నెల జీతాలు చెల్లించడానికి, వారి సమస్యలు పరిష్కరించడానికి ఆర్టీసీ దగ్గర డబ్బులు లేవు' అని చెప్పింది. అంటే 'తెలంగాణ ధనిక రాష్ట్రం… ఆర్టీసీ బీద సంస్థ' అని చెప్పుకోవాలి.
తెలంగాణ దనిక రాష్ట్రమని కేసీఆర్ అనేకసార్లు చెప్పారు. ఆయన చెప్పినప్పుడు మంత్రులు, నాయకులు చెప్పకపోతే బాగుండదు కదా. వారు కూడా తెలంగాణ ధనిక రాష్ట్రమని ఊదరగొట్టారు. దేశంలోనే అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న పథకాలు ప్రపంచంలోనే లేవని రోజూ డప్పు కొడుతుంటారు. డెబ్బయ్ ఏళ్లలో చేయని అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలో ఐదేళ్లలోనే సాధించామని గుండెలు బాదుకుంటారు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి బాటలో పంచకళ్యాణి గుర్రంలా దూసుకుపోతున్నప్పుడు ఆర్టీసీ మాత్రమే ఎందుకు పక్షవాతం వచ్చిన వాడిలా చచ్చుబడిపోయింది? దీనికి ప్రశ్నకు జవాబు చెప్పడం టీఆర్ఎస్లోని భజనపరులకు తెలియదు. తెలిసినా చెప్పలేరు.
ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యలు వెంటనే పరిష్కరించాలని హైకోర్టు మరోసారి గట్టిగా చెప్పింది. కాని ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. ప్రభుత్వ బాకా నమస్తే తెలంగాణ చర్చలవల్ల ఉపయోగం లేదని తేల్చిపారేసింది. ప్రాంతీయ, దేశీయ, జాతీయ, అంతర్జాతీయ… ఇలా ఏ సమస్య పరిష్కారం కావాలన్నా చర్చలే మార్గమని అందరూ చెబుతుండటం మనకు తెలిసిందే కదా. కాని ప్రభుత్వం చర్చలకు విముఖంగా ఉంది. చర్చలు జరిపినా సమస్యలు పరిష్కారం కావని 'నమస్తే' క్లియర్గా చెప్పింది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు మౌఖికంగానే చెప్పింది తప్ప లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వలేదని ప్రభుత్వ బాకా కోర్టుదే తప్పని చెప్పేసింది. ఒకవేళ చర్చలు జరిపితిమిపో ఏమి ఉపయోగం? అని ప్రశ్నించింది.
ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబరు నెల జీతాలు ఇప్పటివరకు ఇవ్వలేదు. అక్టోబరు నెల జీతాలు కూడా ఇవ్వాల్సిన సమయం వచ్చేస్తోంది. ఆర్టీసీ యాజమాన్యానికి ఇదంతా భారంగా ఉందట. జీతాలు ఇవ్వాలంటే 239 కోట్ల రూపాయలు కావాలి. కాని ఆర్టీసీ దగ్గర ఉన్న డబ్బు ఎంతో తెలుసా? కేవలం 8 కోట్ల రూపాయలని 'నమస్తే' కళ్లనీళ్లు పెట్టుకుంది. కాబట్టి కార్మికులు జీతాల గురించి మరిచిపొమ్మని పరోక్షంగా చెప్పేసింది. 'అక్టోబరు నెల జీతాల సంగతి చెప్పనవసరమేలేదు' అని వ్యాఖ్యానించింది. ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వలేని కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులను మాత్రం ప్రత్యేకంగా పిలిపించుకొని, వారికి భోజనం పెట్టించి, డీఏ ఇస్తామని చెప్పారు. ఇదీ పరిపాలకుడిగా ఆయన చేస్తున్న నాయ్యం.
ప్రభుత్వ ఉద్యోగులు కన్నబిడ్డలు… ఆర్టీసీ కార్మికులు సవతి పిల్లలా? ఏమిటీ వివక్ష? కార్మికుల డిమాండ్లన్ని ఆర్థికంతో ముడిపడివున్నవే కాబట్టి ఏ డిమాండ్లూ తీర్చే అవకాశమే లేదని 'నమస్తే' కుండబద్దలు కొట్టింది. కార్మికులతో చర్చలు జరపడానికి చాలా సమయం పడుతుందనేది 'నమస్తే' అభిప్రాయం. ఒకవేళ చర్చలకు సిద్ధమైనా ఆలోగా అక్టోబరు కూడా వెళ్లిపోతుంది కాబట్టి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందని కూడా చెప్పింది. ఆర్టీసీ కార్మికులంతా సంఘాల మీద మండిపడుతున్నారట. నాయకులు తమకు వాస్తవాలు చెప్పకుండా కొంప ముంచారని అంటున్నారట.
కేసీఆర్కు ఇష్టమైన సబ్జెక్టు ప్రాజెక్టుల రీడిజైనింగ్. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నీ పనికిమాలిన డిజైన్లతో ఉన్నాయని భావించిన కేసీఆర్ వాటిని రీడిజైన్ చేస్తున్నారు. ఇదే తరహాలో వార్తలను లేదా సమాచారాన్ని 'నమస్తే' రీడిజైన్ చేస్తోంది. ఆర్టీసీ కార్మికుల ఆందోళన విషయంలో ప్రభుత్వానిది ఇసుమంతైనా తప్పు లేదని, ఇదంతా కార్మికుల ఖర్మేనని తేల్చిపారేసింది. 'నమస్తే తెలంగాణ' ఉన్నదే బాకా ఊదడానికి అయినప్పుడు అంతకు మించి ఏం చేయగలదు?