పోరాటం.. ఇప్పుడే ఆరంభం.!

నోబెల్‌ బహుమతి తన బాధ్యతను మరింత పెంచిందని ‘సాహస బాలిక’ మలాలా వ్యాఖ్యానించింది. నోబెల్‌ శాంతి బహుమతిని ఈ ఏడాదికిగాను భారతీయుడు కైలాస్‌ సత్యార్థితో కలిసి పాకిస్తానీ సాహస బాలిక గెల్చుకున్న విషయం విదితమే.…

నోబెల్‌ బహుమతి తన బాధ్యతను మరింత పెంచిందని ‘సాహస బాలిక’ మలాలా వ్యాఖ్యానించింది. నోబెల్‌ శాంతి బహుమతిని ఈ ఏడాదికిగాను భారతీయుడు కైలాస్‌ సత్యార్థితో కలిసి పాకిస్తానీ సాహస బాలిక గెల్చుకున్న విషయం విదితమే. సత్యార్థి, మలాలాలకు ఈ రోజు నోబెల్‌ బహుమతిని ప్రదానం చేశారు.

ఓ భారతీయుడు, ఓ పాకిస్తానీ కలిసి పనిచేయగలరనడానికి నోబెల్‌ శాంతి బహుమతి నిదర్శనమని మలాలా, సత్యార్థి అన్నారు. పోరాటం ఇక్కడితో ఆగదనీ, ఇదే ఆరంభమని మలాలా వ్యాఖ్యానించింది. ఆంక్షలు విధించకుండా తనను పెంచిన తన తల్లిదండ్రులకు, మద్దతునిచ్చిన స్నేహితులకూ, వెన్నంటే వున్న ప్రపంచానికీ కృతజ్ఞతలు తెలిపింది మలాలా.

కైలాస్‌ సత్యార్థితో కలిసి నోబెల్‌ శాంతి బహుమతిని పంచుకోవడం ఆనందంగా వుందని మలాలా వ్యాఖ్యానించగా, చిన్న వయసులోనే మలాలా ప్రపంచ కీర్తిని ఆర్జించిందనీ, ఆమె ప్రతి ఒక్క బాలికకూ ఆదర్శమనీ కొనియాడారు కైలాస్‌ సత్యార్థి. బాలల హక్కుల కోసం మరింత ఉధృతంగా పోరాటం జరగాల్సి వుందన్న సత్యార్థి, ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ తమవంతుగా బాలల హక్కుల్ని పరిరక్షించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.