ప్రజలకు పంచాంగం పంచ్

గ్రహాలు మనుషుల్లా కాదు..వాటి చిత్తానికి అవి సంచరించడానికి. వాటికీ ఓ పద్దతి వుంటుంది. కానీ గ్రహాల లెక్కలు కట్టి, ఫలితాలు చెప్పేవారు మనుషులే. వాళ్లు మాత్రం తమ చిత్తానికి తాము విశ్లేషించుకుంటూ పోతారు. దానివల్ల…

గ్రహాలు మనుషుల్లా కాదు..వాటి చిత్తానికి అవి సంచరించడానికి. వాటికీ ఓ పద్దతి వుంటుంది. కానీ గ్రహాల లెక్కలు కట్టి, ఫలితాలు చెప్పేవారు మనుషులే. వాళ్లు మాత్రం తమ చిత్తానికి తాము విశ్లేషించుకుంటూ పోతారు. దానివల్ల రాను రాను పంచాంగ ఫలితాలంటే అనుమానించాల్సి వస్తోంది. పంచాంగ పండితులు కూడా రాజకీయ నాయకుల మనసెరిగి ఫలితాలు చెబుతున్నారు. చివరకు కాలమానం, గ్రహసంచారం, పండితుల జ్యోతిష్యంలోనూ రాజకీయాలు ప్రవేశించాయనిపించే విధంగా పంచాంగ శ్రవణం ఉండడంతో తెలుగు ప్రజలు అవాక్కయ్యారు. చివరకు పండితులను కూడా నమ్మలేని పరిస్తితులు వచ్చాయంటూ గొణుక్కున్నారు.

ఉగాది రోజున జరిగిన పంచాంగ శ్రవణం తీరు దీనికి అద్దం పట్టింది. ఏపి, తెలంగాణ ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమాలలో ఎవరి పండితులు వారి ప్రభుత్వాలకు అనుకూలంగా గ్రహగతులున్నాయని చెప్పారు. ఓ విధంగా చెప్పాలంటే ఏపి ప్రభుత్వం చెప్పిన ప్రధాన హామీలైన పోలవరం పూర్తి, కేంద్రం నుంచి నిధులు, పూర్తి సహాకారం వస్తాయంటూ ఓ రకంగా గవర్నర్ ప్రసంగంలా పంచాంగ శ్రవణం జరిగింది. ఇటు తెలంగాణలోనూ అంతే.. తెలంగాణ ప్రభుత్వం చేపడతానని చెప్పిన పనులన్నీ అది పూర్తి చేస్తుందని పంచాంగ శ్రవణం చేసిన పండితుడు చెప్పి ఇక్కడ కూడా గవర్నర్ ప్రసంగాన్నే తలపించారు.

పోని ఇదంతా సహజమే అనుకుందాం . కాని ఇద్దరు పోటీ పడితే విజయం ఒకరిదే కదా.. కాని ఇద్దరు గెలుస్తారని చెబితే దానిని పిచ్చి అంటారు తప్ప మరోటి కాదు. రాజకీయాల్లో ఓ పార్టీ బలపడి బాగా పట్టుసాధిస్తే దాని ప్రత్యర్థి పార్టీ డీలా పడ్డట్టే కదా.. కాని ఏపిలోనూ, తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ వాటి కార్యాలయాల్లో నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమాల్లో ఏం జరిగిందో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. 

ఏ పార్టీ నిర్వహించిన పంచాంగ శ్రవణం వారికే అనుకూలంగా ఉంది. టిడిపి కార్యాలయంలోని పంచాంగ శ్రవణంలో టిడిపి సమర్థమైన పాలన చేస్తుంది, ప్రజల మన్ననలు చూరగొంటుంది, ప్రజల్లో మంచి పట్టు సాధిస్తుందని చెబితే, వైకాపా కార్యాలయంలో ఈ ఏడాది వైకాపా పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది, ప్రజల్లో ఆదరణ ఉంది, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రభుత్వాన్ని నిలదీసి మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పారు. 

ఏపిలోనే కాదు తెలంగాణలోనూ టిఆర్ఎస్, కాంగ్రెస్ , బిజేపి ఇలా అన్ని పార్టీల కార్యాలయాల్లో జరిగిన పంచాంగ శ్రవణాలు ఇలాగే ఉన్నాయి. ఏమో అదే నిజమేమో.. వారంతా మంచిగుంటే చివరకు మునిగేది ప్రజలేనేమో.. ఎందుకంటే పాపం వారు భారీ ఏర్పాట్లు చేసి భారీ దక్షిణ చెల్లించి పంచాంగ శ్రవణం చెప్పించుకోలేరుగా…

తెలంగాణ మంత్రులకు షాక్

తెలంగాణ పంచాంగం తెలంగాణ రాజు కేసిఆర్ కు అన్ని శుభాలే కలుగుతాయని ఉగాది వేళ తీపి కబురందిస్తే.. ఆయన పాలనలోని మంత్రులకు మాత్రం కంటిమీద కునుకు లేకుండా చేసేలే గట్టి షాకిచ్చింది. తెలంగాణలో ఈ ఏడాది రాజు పాలన బాగుంటుందన్నది పంచాంగ శ్రవణం సారాంశం. రాజు బాగానే ఉంటారని చెప్పిన పంచాంగం,కానీ రాజు మంత్రి వర్గంలో మంత్రులు మారుతారని, అది కూడా ఈ ఏడాదే మంత్రుల మార్పు ఉంటుందని పంచాంగ శ్రవణం చేసిన పండితుడు చెప్పేసరికి మంత్రుల ముఖాలు వెలవెలబోయాయి.

ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు  ఎలా మంత్రి పదవి పోయిందో చూసారు. ఆయన బాటలో మరో మంత్రి జగదీశ్వర్ రెడ్డి వెళుతున్నారన్న సంకేతాలు గత కొంత కాలం నుంచే వెలుబడుతున్నాయి. పైగా తన మంత్రి వర్గంలోని కొందరు మంత్రుల తీరుపై కేసిఆర్ గుర్రుగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొందరు మంత్రులను స్వయంగా కేసిఆర్ పిలిపించుకుని తీరు మార్చుకోకపోతే బాగుండదని హెచ్చిరించారని కూడా సమాచారం. 

అంతే కాదు ఈ అయిదేళ్లు ఒక్క పైసా ఆశించకుండా పని చేయాలని, అవినీతి జరిగిందని తెలిసిందే పదవులే కాదు పనిష్ మెంటు ఉంటుందని కూడా చెప్పారు కేసిఆర్. అందుకే ప్రజాప్రతినిధుల జీతాలను కూడా రెండు, మూడు రెట్లు పెంచారు. అందుకే మంత్రులు మారడం ఖాయమన్న భావం ఉండడం దీనికి తోడు పండితులు కూడా అదే చెప్పడంతో మంత్రుల్లో వణుకు మొదలయింది.

మొత్తానికి పంచాంగ శ్రవణాలు కూడా రాజకీయ మేనిఫిస్టోల్లా, పత్రికా ప్రకటనల్లా తయారయ్యాయి

చాణక్య

[email protected]