యాడ్ కంపెనీలో పనిచేసే రోజుల్లో వినోద్ బొంబాయిలో ఒక చిన్న ఫ్లాట్లో వుంటూ బస్సు మీద, రైల్లో, కాలి నడకన వూరంతా తిరిగేవాడు. తనకు ఆసక్తికరంగా తోచిన సంగతులను సాయంత్రం కూర్చుని ఓ కాగితంపై రాస్తూ వుండేవాడు. బొంబాయిలో నివసించే రకరకాల వ్యక్తులు – డబ్బున్నవాళ్లు, లేనివాళ్లు, ఫుట్‌పాత్‌లపై బతికేవారు, చీప్ క్లాస్ వేశ్యలు అందర్నీ గమనించి తన పరిశీలనలను, అభిప్రాయాలను కాగితంపై పెట్టనారంభించాడు. 8 నెలల కాలంలో 30 వేల పదాల మ్యాటర్ తయారైంది. దాన్ని ''బాంబే – ఎ ప్రైవేట్ వ్యూ' అనే పేర పుస్తకంగా వేస్తే బాగుంటుందని అతని కనిపించింది. తన పేరు చూసి ఏ పబ్లిషరూ ముందుకు రాడని అతనికి తెలుసు. తనే పెట్టుబడి పెట్టి పుస్తకం వేయించుకోవాలి. అమ్ముడు పోకపోతే దాచుకున్న డబ్బంతా క్షవరం. అయినా రిస్కు తీసుకున్నాడు. ఇలాటి రిస్కులే మనిషి జీవితంలో మార్పులు తెస్తాయి. రిస్కు అన్నివేళలా ఫలించకపోవచ్చు, కానీ రిస్కు తీసుకోనివాడు మాత్రం గుడుగుడుగుంచపు బతుకే బతకాలి.
వినోద్ తను పనిచేసే కంపెనీలోనే ఆర్ట్ డిపార్టుమెంటును వాళ్లను బతిమాలి రహస్యంగా పుస్తకం అట్టను డిజైన్ చేయించుకున్నాడు. పుస్తకం అట్టమీద తన ఫోటో వేసుకుంటానంటే యాడ్ కంపెనీలో పనిచేసే ఓ జూనియర్ మోడల్ సరేనంది. పుస్తకం తయారుచేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఠాకర్ అండ్ కంపెనీ వాళ్లు ఒక్కళ్లే 40% కమిషన్ బేసిస్‌పై ఒప్పుకున్నారు. ఉన్న డబ్బంతా పెట్టి 3000 కాపీలు వేయించాడు. నీ పెట్టుబడి తిరిగి వస్తుందన్న ఆశ పెట్టుకోవద్దు అని ఠాకర్ వాళ్లు స్పష్టంగా చెప్పారు. రూ.5ల ధరతో పుస్తకం విడుదల చేశారు. అయితే అందరూ ఆశ్చర్యపడేట్లా ఆ పుస్తకం హాట్‌కేకుల్లా అమ్ముడుపోయింది. వేసిన కొన్ని రోజులకే పునర్ముద్రణ వేయాలన్నారు ఠాకర్ వాళ్లు. వినోద్‌కు పెట్టుబడి తిరిగి వచ్చి, పైన కాస్త వచ్చింది కూడా. అయినా సెకండ్ ఎడిషన్ వేయలేదు ఎందుకంటే ఆ పుస్తకంలో వినోద్ వేశ్యల గురించి రాశాడని విన్న అతని తల్లి చాలా అప్‌సెట్ అయింది. ఇతను సిగ్గుపడ్డాడు. డిమాండ్ వున్నా ఆ పుస్తకాన్ని అలాగే వదిలేశాడు. తర్వాతి రోజుల్లో దాని గురించి గొప్పగా చెప్పుకోలేదు. ఈ పుస్తకం వలన యాడ్ రంగానికే కాకుండా పరిమితం కానక్కరలేదని, వేరే ఉపాధి మార్గాలు ప్రయత్నించి చూడవచ్చని అతనికి అర్థమైంది.
పుస్తకం వచ్చిన రెండు నెలలకు జైకో పబ్లిషింగ్ హౌస్ వాళ్లు అతన్ని పిలిపించి సినిమా నటి మీనాకుమారి జీవితచరిత్ర రాయమని అడిగారు. మీనాకుమారి అప్పుడే మరణించింది. ఆమె నటించిన ఆఖరి చిత్రం ''పాకీజా'' హౌస్‌ఫుల్ కలక్షన్లతో ఆడుతోంది. పబ్లిక్‌లో ఆసక్తి వుంది కాబట్టి యీ పుస్తకం అమ్ముతుందని వారి అంచనా. వినోద్‌కు హిందీ సినిమా గురించి ఓనమాలు కూడా రావు. అయినా ధైర్యంగా సరేననేసి, రూ.500 అడ్వాన్సు పుచ్చేసుకున్నాడు. దర్శకనిర్మాత గురుదత్ తమ్ముడు దేవీదత్ యితన్ని మీనాకుమారి గురించి బాగా తెలిసున్న వారికి పరిచయం చేశాడు. ఆ విధంగా నర్గీస్, కెమాల్ అమ్రోహి, (మీనా భర్త), అశోక్ కుమార్, రాజేంద్ర కుమార్, కె ఎ అబ్బాస్, రాజ్ కుమార్, మీనా చెల్లెళ్లు అందరినీ వినోద్ కలిసి సమాచారం సేకరించి, ఆర్నెల్లలో పుస్తకం పూర్తి చేశాడు. ఆమె ప్రియుడుగా పేరుబడిన ధర్మేంద్ర మాత్రం యింటర్వ్యూ యివ్వనన్నాడు. ఆ పుస్తకానికి రూ.5 ధర పెట్టి అమ్మితే బాగా అమ్ముడుపోయింది. ఈ పరిస్థితుల్లో వినోద్ చూపు ''డెబెనేర్'' మ్యాగజైన్‌పై పడింది. బొంబాయిలో నాణ్యమైన ప్రింటింగ్‌కు పేరుబడిన జి.క్లారిడ్జ్ ప్రింటింగ్ ప్రెస్ అధిపతి సుశీల్ సోమాని అనే ఆయన అప్పటికే అమెరికాలో నగ్నచిత్రాల మ్యాగజైన్‌గా పేరు తెచ్చుకున్న ''ప్లేబాయ్'' ను అనుకరిస్తూ 1973 మే-జూన్‌లలో 'మగవాళ్ల కోసం మాసపత్రిక' అంటూ ''డెబెనేర్'' ప్రారంభించాడు. దానికి ప్రారంభానికి ముందు టీజర్లు తయారు చేసే బాధ్యతను రిడిఫ్యూజన్ అనే యాడ్ సంస్థకు అప్పగించాడు. ఆ యాడ్స్ బాగా పేలాయి. అందరూ మ్యాగజైన్ ఎప్పుడు వస్తుందాని ఎదురుచూశారు.
ఏ మ్యాగజైన్‌కైనా సారథి సంపాదకుడు. దీనికి కౌంట్ ఆంథోనీ వాన్ బ్రబాండ్ అనే బ్రిటిషు జర్నలిస్టును ఎడిటరుగా పెట్టారు. అతనికి సహాయకుడు అశోక్ రావ్ కవి. వాళ్లిద్దరూ 'గే' (హోమోసెక్సువల్స్)లే! అందుకని వాళ్లు అమ్మాయిల బొమ్మల కంటె ఎక్కువగా కండలు తిరిగి, గోచీలు పెట్టుకున్న అబ్బాయిల బొమ్మలు ఎక్కువగా వేశారు. అలాటి అబ్బాయిని వెనకనుంచి ఓ అమ్మాయి వాటేసుకుంటే చాలు. ఇదీ వాళ్ల కాన్సెప్టు. అప్పట్లో పత్రికల్లో వేసే ఫోటోల్లో వక్షమధ్యం కూడా వేసేవారు కాదు. డెబెనేర్ యాడ్స్‌లో అందమైన అమ్మాయిల వక్షోజాల బొమ్మలు చూసి ఆశపడి యీ పత్రిక కొన్నవారు ఉసూరుమన్నారు. ఆర్నెల్లు గడిచేసరికి పబ్లిషరు నిట్టూర్చసాగాడు. అది గమనించి సంపాదకుడు మాయమై పోయాడు. సహాయ సంపాదకుడూ అతని బాటే పట్టాడు. ఈ సంగతి తెలిసి వినోద్ మెహతా వున్న ఉద్యోగం మానేసి ఆ పత్రికకు సంపాదకుడి ఉద్యోగం సంపాదిద్దామనుకున్నాడు.
అప్పటి పత్రికారంగం, రాజకీయ పరిస్థితి గమనిస్తే అది చాలా పెద్ద రిస్కే. 1975 చివరకు వచ్చేసరికి దేశమంతా జయప్రకాశ్ నారాయణ సంపూర్ణ క్రాంతి ఉద్యమంతో వూగిపోతోంది. గుజరాత్‌లో మొదలైన విద్యార్థుల ఆందోళన దేశమంతా వ్యాపించింది. యువత రాజకీయంగా మార్పు తెచ్చితీరాలనే దృక్పథంతో యువత ఆ ఉద్యమాల్లో తలమునకలా మునిగి వుంది. దినపత్రికలు చూడబోతే బొంబాయి ముఖ్యకేంద్రంగా పనిచేసే ''టైమ్స్ ఆఫ్ ఇండియా''కు శ్యామ్‌లాల్ ఎడిటర్, గిరిలాల్ జైన్ ఆయనకు సహాయకుడు. అది ప్రభుత్వాన్ని సమర్థించేది. ఢిల్లీలో వున్న ''స్టేట్స్‌మన్''కు కులదీప్ నయ్యర్ సంపాదకుడు. రామనాథ్ గోయెంకా నడిపే ''ఇండియన్ ఎక్స్‌ప్రెస్'' ముఖ్యకేంద్రం బొంబాయి అయినా అన్ని రాష్ట్రాలకు వ్యాపించి వుంది. ఇవి ప్రభుత్వానికి వ్యతిరేకం. వీళ్లకంటె వ్యతిరేకి బిజి వర్గీస్. ఆయన సంపాదకుడుగా వుండే ''హిందూస్తాన్ టైమ్స్'' ఇందిరను అడుగడుగునా విమర్శించడంతో ఆమె ఓనర్లతో చెప్పి అతన్ని తీయించేసింది. వారపత్రికలకు వస్తే ఖుశ్వంత్ సింగ్ సంపాదకత్వంలో ఇలస్ట్రేటెడ్ వీక్లీ రారాజుగా వెలుగుతోంది. రూసీ కరంజియా నడిపే టాబ్లాయిడ్ ''బ్లిట్జ్'', ''కరంట్'', ''ఫ్రీడమ్ ఫస్ట్'', ''సెమినార్'', ''హిమ్మత్'' యివన్నీ తమ తమ పాఠకులను ఆకట్టుకుంటున్నాయి. ఇవన్నీ సీరియస్‌వే, సినిమాలు బేస్‌గా గ్లామర్ మాసపత్రికల్లో ''స్టార్‌డస్ట్''ది ప్రథమస్థానం. దానికి సంపాదకురాలిగా శోభా కీలాచంద్ (ఇప్పుడు శోభా దే) వుంటూ ఇంగ్లీషు, హిందీ కలిపికొట్టి హింగ్లీషు రాస్తూ ప్రచారంలోకి తెచ్చింది. హేమాహేమీలు ఏలుతున్న పత్రికారంగంలో ఒక్క రోజు కూడా ఏ పత్రికలోను పనిచేయకుండా డైరక్టుగా ఎడిటర్ అయిపోదామనుకోవడం వినోద్ సాహసమే. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)