Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా - 2

ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా - 2

వినోద్‌ మెహతా 1941 మే 31 న రావల్పిండిలో పుట్టాడు. అతని కుటుంబంలో ఎవరూ రచయితలు లేరు. వాళ్లు పంజాబీలు. తండ్రి యిప్పటి పాకిస్తాన్‌లోని పెషావర్‌ వాడు. అక్బర్‌ ఆస్థానంలోని రాజా తోడర్‌ మల్‌ వంశజుడు. రాయల్‌ ఇండియన్‌ ఆర్మీ సర్వీసెస్‌ కార్ప్‌స్‌ (స్వాతంత్య్రం వచ్చాక ఎఎస్‌సి అన్నారు)లో చేరి రెండవ ప్రపంచయుద్ధంలో ఉత్తర ఆఫ్రికాలో యుద్ధంలో పాల్గొన్నాడు. రావల్పిండిలో స్థిరపడ్డాడు. తల్లి తాతగారు ఆఫ్గనిస్తాన్‌ నుంచి రావల్పిండికి తరలి వచ్చాడు. తలిదండ్రులకు యితను రెండో కొడుకు. పెద్దతను అశోక్‌ ఆర్మీలో పనిచేశాడు. వినోద్‌ అంత్యక్రియలకు హాజరయ్యాడు కూడా. 1946లో వినోద్‌ తండ్రికి లఖ్‌నవ్‌కు బదిలీ అయింది. కాలేజీ దాకా వినోద్‌ చదువు లఖ్‌నవ్‌లోనే. అతనిది అత్తెసరు చదువే. సివిక్స్‌, సోషియాలజీ, ఆంత్రపాలజీ సబ్జక్ట్‌లతో బిఏ థర్డ్‌ క్లాసులో పాసయ్యాడు. అయినా 1962 జూన్‌లో ఇంగ్లండ్‌కు రూ.1812 ల టిక్కెట్టుతో ఢిల్లీ నుంచి విమానం ఎక్కాడు. 

ఏమిటా ధైర్యం అంటే అతనికి కాలేజీలో స్నేహితుడిగా, గాడ్‌ఫాదర్‌గా వ్యవహరించిన క్లాస్‌మేట్‌ ఆజాద్‌ అనే అతనిచ్చిన ధీమా. అతను బాగా డబ్బున్నవాడు. సౌదీ అరేబియాలోని బంధువుల సహాయంతో లండన్‌లోని కింగ్‌స్టన్‌ పాలిటెక్నిక్‌లో మెకానికల్‌ ఇంజనీరింగులో సీటు సంపాదించి, ఇంగ్లండ్‌కు వెళ్లాడు. అక్కడ సుఖంగానే వున్నా తెలిసిన స్నేహితులెవరూ లేక వెలితిగా ఫీలయ్యాడు. దాంతో వినోద్‌ను గిల్లాడు. నువ్వు యిక్కడకు వస్తే పై చదువులు చదవవచ్చు, విడిగా సంపాదించుకోవచ్చు, లోకం చూడవచ్చు, ఎంజాయ్‌ చేయవచ్చు - అంటూ. మా వాళ్లకు అంత స్తోమత లేదు, ప్రభుత్వం వారు 5 పౌండ్ల కన్నా ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ యివ్వరు, నాకు జరుగుబాటు ఎలా? అని యితను అడిగితే 'మై హూఁ న!?' అని ఆజాద్‌ ధైర్యం చెప్పాడు. ఇతను తల్లిని బతిమాలాడు. తల్లి భర్తను శాసించింది. ఆయన ఎప్పటిలాగ పెళ్లాం మాటకు తలవొగ్గాడు. 'ఈ థర్డ్‌ క్లాస్‌ డిగ్రీతో నీకెలాగూ యిక్కడ వుద్యోగం రాదు. లండన్‌ వెళ్లి ఫారిన్‌ డిగ్రీ తెచ్చుకుంటానంటున్నావ్‌. ఈ రెండు వేల రూపాయలతో నీ జీవితాన్ని ఏం చేసుకుంటావో చేసుకో. ఇకపై నన్ను పైసా అడగకు. నాకే బాధ్యతా లేదు' అని కొడుక్కి స్పష్టంగా చెప్పి డబ్బిచ్చాడు. లండన్‌ వెళ్లాక ఆజాద్‌ బాంబు పేల్చాడు. ''ఇక్కడ ఎవ్వరూ ఎవరి బాధ్యతా వహించరు. పిల్లలు యింట్లో వుంటే తలిదండ్రులు వారం వారం అద్దె తీసుకుంటారు. నీ కాళ్లమీద నువ్వు నిలబడాల్సిందే. అక్కడే వుంటే తుప్పు పట్టిపోతావని, యిక్కడకు రమ్మనమన్నాను. ఇక్కడ అందరిలాగా కష్టపడు, పనులు నేర్చుకో. రేపు రెడీగా వుండు. ఒక ఫ్యాక్టరీకి తీసుకెళతాను. పనిలో చేరు.'' అని. 

ఇంకేం దారి? గోదారి కూడా లేదు. థేమ్సే! వెనక్కి వెళదామంటే టిక్కెట్టుకి డబ్బులు లేవు. థెర్మోస్టాట్‌లు తయారుచేసే ఫ్యాక్టరీలో చేరాడు. గోడౌన్‌లోంచి బరువైన కడ్డీలు మోసుకుని తెచ్చి, మెషిన్‌ మీద సరైన సైజులో కట్‌ చేయడం అతని పని. అప్పటిదాకా ఒళ్లు వంచడం తెలియని అతను గత్యంతరం లేక తలవొగ్గాడు. ఇంగ్లండులో వున్న ఎనిమిదేళ్లలో వినోద్‌ మూడు ఊళ్లల్లో రకరకాల పనులు చేశాడు. కింగ్‌స్టన్‌ కంట్రీ కౌన్సిల్‌లో మోటర్‌ రిజిస్ట్రేషన్‌ సెక్షన్‌లో, ప్రభుత్వ ఆదాయపు పన్ను శాఖలో, పోస్టు ఆఫీసు పార్సిల్‌ విభాగంలో.. యిలా ఏదో ఒక పని. మధ్యలో నిరుద్యోగ భృతి ద్వారా పొట్ట నింపుకున్నాడు. చిన్న చిన్న కొంపల్లో వుండేవాడు. ఇంట్లో ఫారిన్‌ చదువులని చెప్పాం కదాని ఆజాద్‌ చదివే పాలిటెక్నిక్‌లోనే యీవెనింగ్‌ క్లాసులలో పేరు నమోదు చేసుకున్నాడు కానీ పగలంతా  పని చేసి ఒళ్లు పులిసిపోయాక సాయంత్రం కాలేజీకి వెళ్లబుద్ధయ్యేది కాదు. చదువు సాగలేదు. ఈ థలోనే అతనికి తన జీవితంపై వెగటు పుట్టింది. సరిగ్గా చదువుకోనందుకు, స్కూల్లో చదువు పట్ల కానీ, లలితకళల పట్ల కానీ శ్రద్ధ వహించకుండా సమయం వ్యర్థం చేసినందుకు, బొత్తిగా జనరల్‌ నాలెజ్‌ లేకపోయినందుకు తనను తానే తిట్టుకునేవాడు. న్యూస్‌ పేపరు చదవాలన్నా, టీవీ చూడాలన్నా భయం వేసేది. రాజకీయనాయకుల పేర్లన్నీ కొత్తగానే వుండేవి. ఎవరు ఎవరో తెలిసేది కాదు. 

ఒకసారి ఒక గర్ల్‌ ఫ్రెండ్‌ తారసిల్లింది. ఆమె అరిస్టోక్రాట్‌ ఇంగ్లీషు అమ్మాయి. చాలాకాలంగా ప్రేమిస్తున్న ఒక అబ్బాయి వదిలేసి వెళ్లిపోతే అతనిమీద కోపంతో యితనితో స్నేహం చేయబోయింది. ఆదివారం లంచ్‌కు యింటికి పిలిచింది. వాళ్ల నాన్న ప్రభుత్వంలో ఉన్నతోద్యోగి. ఇతను యిండియన్‌ అని తెలియగానే ''కొలంబో ప్లాన్‌ గురించి నీ అభిప్రాయం ఏమిటి?'' అని అడిగాడు. తమ సామ్రాజ్యం నుంచి విడిపోయిన దేశాలకు సాయపడ్డానికి ఇంగ్లండ్‌ 1950లలో అమలు చేసిన పథకమది. ఒక భారతీయుడి కోణం నుంచి దాని ప్రభావం ఎలా వుందో తెలుసుకుందా మనుకున్నాడాయన. మనవాడికి ఆ ప్లానూ తెలియదు, దాని నేపథ్యమూ తెలియదు. ఏదో సణిగాడు. వీడికి క్లాస్‌ లేదనుకుని ఆ అమ్మాయి గుడ్‌బై చెప్పేసింది. ఇతనికి తన అజ్ఞానం మీద రోత పుట్టి కాస్త కుడీఎడమా తెలుసుకోవాలనుకున్నాడు. ఆ రోజుల్లోనే బ్రిటన్‌లో క్రిస్టిన్‌ కీలర్‌ వుదంతం జరిగింది. ప్రొఫ్యూమో అనే మంత్రి కీలర్‌ అనే కాల్‌ గర్ల్‌తో జరిపిన శృంగారకాండ గుట్టురట్టయి, ప్రధాని మాక్మిలన్‌ రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ కథను టీవీలో ఆసక్తితో చూడడం వలన యితనికి బ్రిటన్‌ రాజకీయపరిణామాలు కాస్త అర్థమయ్యాయి. క్రమం తప్పకుండా పేపరు చదవడంతో సాహిత్యపరంగా కూడా కొన్ని విషయాలు తెలిశాయి. లైబ్రరీలకు వెళ్లి చదవడం అలవాటైంది. కొత్తరకం సినిమాలు కూడా అతన్ని ఆకర్షించాయి. ఇండియన్‌ ఫుడ్‌ అంటే తెగ యిష్టపడే డెన్నిస్‌ హిల్‌ అనే అనే ఇంగ్లీషాయన పరిచయమై యితనికి అనేక విషయాలు నేర్పాడు. 

1970 చివరకి వచ్చేసరికి అతనికి ఇంగ్లండ్‌ జీవితం విసుగుపుట్టింది. ఇంటికి వెళ్లిపోతే బాగుణ్ననిపించింది. అప్పటిదాకా వుండి వెనక వేసిందేమీ లేదు. సాధించిన చదువూ లేదు. లఖ్‌నవ్‌ తిరిగి వచ్చాడు. అతని స్నేహితుల్లో ఒకడు జర్నలిస్టయి ఢిల్లీలో ''స్టేట్స్‌మన్‌''లో పనిచేస్తున్నాడు. ఇంకో అతను కాస్ట్‌ ఎక్కవుంటెంట్‌ అయ్యాడు. అందరూ జీవితంలో స్థిరపడుతున్నారు. 27 ఏళ్ల వయసులో యితని చేతిలో థర్డ్‌ క్లాస్‌ బియ్యే డిగ్రీ, ఇంగ్లండ్‌లో తలాతోకా లేని పనులు చేసిన అనుభవం తప్ప మరేమీ లేదు. ఏవీ కూడు పెట్టవు. ఆ  దేశంలోని అన్ని ప్రాంతాలవారూ రోజుల్లో బతకాలంటే, బాగుపడాలంటే బొంబాయి వెళ్లాలనేవాళ్లు. ఇతనూ బొంబాయి రైలెక్కాడు. అక్కడ బంధువులెవరూ లేనందున ఒక హాస్టల్‌లో రోజుకు రూ. 12 అద్దెకు (బెడ్‌, రెండుపూటలా భోజనం, టిఫెన్‌తో సహా) వుండసాగాడు. అప్పట్లో ఎడ్వర్టయిజింగ్‌ రంగం పుంజుకుంటోంది. వినోద్‌ మాటల్లో చెప్పాలంటే - 'ఆ రంగంలో ప్రవేశించడానికి పెద్ద క్వాలిఫికేషన్‌ ఏమీ అక్కరలేదు. జుత్తు పొడుగ్గా వుండి, కుర్తా పైజమా వేసుకుని, గడ్డం మాసి వుంటే లోపలకి రానిస్తారు. ఇంగ్లీషు కాస్త స్టయిలిష్‌గా వుంటే చాలు, జీతం కూడా బాగా యిస్తారు. అందుకే అందులో దూరాను.'' ఇతను ఇంగ్లండులో వున్నాడు కాబట్టి ఇంగ్లీషు గొప్పగా వుంటుందనుకున్నారేమో జైసన్స్‌ అనే యాడ్‌ కంపెనీలో కాపీరైటర్‌ వుద్యోగం దొరికింది. హరీశ్‌ జైన్‌ అనే ఆయన, ఆయన నలుగురు కొడుకులు కలిసి పెట్టిన కంపెనీ అది. 'నాకేదో వచ్చని వాళ్లనుకున్నారు కానీ నిజం చెప్పాలంటే నాకు క్లుప్తంగా, సూటిగా కాప్షన్లు రాయడం రాదు' అని చెప్పుకున్నాడు వినోద్‌. అక్కడ ఒక ఏడాది పనిచేశాడు. అక్కడ వుండగానే అనుకోకుండా రచయితగా మారాడు. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?