ప్రజల్ని చంపేంత అభివృద్ధి అవసరమా.?

అధికారంలో వున్నోళ్ళకి అభివృద్ధి కన్పిస్తుంది.. ప్రతిపక్షాలకు వినాశనం కన్పిస్తుంది.. ఇది చాలాకాలంగా జరుగుతున్న తంతు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! అధికారం, ప్రతిపక్షం కలిసి ఆడే 'కపట నాటకం'లో సమిధలయ్యేది సామాన్యులే. ఏ…

అధికారంలో వున్నోళ్ళకి అభివృద్ధి కన్పిస్తుంది.. ప్రతిపక్షాలకు వినాశనం కన్పిస్తుంది.. ఇది చాలాకాలంగా జరుగుతున్న తంతు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! అధికారం, ప్రతిపక్షం కలిసి ఆడే 'కపట నాటకం'లో సమిధలయ్యేది సామాన్యులే. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినాసరే, అభివృద్ధి మంత్రమే జపిస్తుంది.. ఆ అభివృద్ధి మాటున వినాశనం సుస్పష్టం. కానీ, అభివృద్ధి జరగాలి.. అభివృద్ధి లేనిదే మానవ మనుగడ అసాధ్యం.. అన్నది పాలకుల వాదన. 'పాలకులు' అన్న పొజిషన్‌లో ఎవరున్నాసరే ఇదే మాట చెబుతారు.. చెప్పి తీరాల్సిందే.! 

సోంపేట ధర్మల్‌ పవర్‌ ప్లాంటు వివాదమైనా, భీమవరంలో మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ అయినా.. జనం ఉసురు తీయడం ద్వారానే 'అభివృద్ధి' జరగాలి. అనాదిగా వస్తున్న ఆచారం అనాలో, మానవాళి వినాశనం ఇలాగే జరగాలని రాసుందోగానీ, జరుగుతున్నదైతే అదే. కోనసీమ ఒకప్పుడు కొబ్బరికి ప్రసిద్ధి. కానీ, ఇప్పుడు ఆ కోనసీమ భూముల కింద పెద్ద పెద్ద బాంబులున్నాయి. అవే గ్యాస్‌ పైప్‌ లైన్లు. అవి పేలడం, జనం ప్రాణాలు కోల్పోవడం.. అనే సంగతి ఎలా వున్నా, తెరవెనుక ఇంకో విషాదముంది. అదే, భూములన్నీ ఉప్పు నీటితో నిండిపోతుండడం. 

మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ విషయానికొస్తే, దాదాపు 25 కోట్ల దాకా ఖర్చు చేశారు కాబట్టి, ఆ ప్రాజెక్టుని ఇంకో చోటకి తరలించలేమని కొందరు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి, ఈ ఫుడ్‌ పార్క్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారిని బుజ్జగించేందుకోసం ఓ 'మాయమాట' చెప్పారు. అదే వ్యర్ధాల్ని సముద్రంలోకి ప్రత్యేక పైప్‌లైన్‌ ద్వారా పంపుతాం తప్ప, గోదావరి నదిలో కలవనివ్వబోమని. 

నదులు కలుషితమైతే కష్టం, సముద్రం కలుషితమైపోతేనో.! పోతే పోనీ, సముద్రం అనంతం, అందులో కలిసే 'మెగా' కాలుష్యం ఎంత.? అది లెక్కల్లోకే రాదన్నది ముఖ్యమంత్రిగారి ఉద్దేశ్యం కావొచ్చుగాక. కానీ, నీరు కలుషితమైన చోట సముద్ర జీవుల జాడ కన్పించదు. తద్వారా మత్స్యకారుల భవిష్యత్తు నాశనమైనట్లే. అభివృద్ధి జరగాలి, పట్టణీకరణ జరగాలి.. తద్వారా ఉద్యోగావకాశాలు పెరగాలన్నది ప్రభుత్వాలు చెప్పే మాట. అది నిజమే, కాదనలేం. కానీ, ప్రకృతిని నాశనం చేసుకుంటే, అసలు మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది కదా.! అభివృద్ధి, మనిషిని హరించేశాక, ఆ అభివృద్ధి వుంటేనేం, ఊడితేనేం.! 

హైద్రాబాద్‌లో సవాలక్ష కాలుష్య కారక పరిశ్రమలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా వున్నాయి. వాటిపై కాలుష్య నియంత్రణ మండలి కొరడా ఝుళిపించాలి. కానీ, అది జరుగుతోందా.? మురికి కాలువల్లో ప్రమాదకర రసాయనాలు ప్రవహిస్తున్నాయి.. దాంతో బాంబు పేలుడు తరహా విధ్వంసాలు చోటు చేసుకుంటున్నాయి. పట్టించుకునే నాథుడేడీ.? మెగా ఫుడ్‌ పార్క్‌ భవిష్యత్తులో సృష్టించే కాలుష్యం విషయంలోనూ అంతే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. 

'పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా గత ఎన్నికల్లో విజయాన్ని అందించింది.. ఆ జిల్లాకు అన్యాయం జరగనివ్వను..' అని ముఖ్యమంత్రి చంద్రబాబు సెలవిచ్చారు. 'వద్దు మహాప్రభో మాకు ఈ మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌.. మా జీవితాలు నాశనమైపోతాయి..' అని అదే పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. మరి, అన్యాయం జరగనివ్వబోనని చంద్రబాబు చెబితే ఎలా.? అభివృద్ధి జరగాలి, కానీ అది వినాశనానికి దారి తీయకూడదు.. ఈ మంచి మాట ఎవరు చెప్పినా, అది ముఖ్యమంత్రి చంద్రబాబుకి బూతుగానే కన్పిస్తుంది. చంద్రబాబు అనే కాదు, అధికారంలో ఎవరున్నాసరే, వారికి అలాగే విన్పిస్తుంది.