ఈ మాజీ సీఎం వేధింపులు ఇన్నిన్ని కావయా…!

'అత్తగారు' అనగానే సినిమా అత్తగారు సూర్యకాంతం మదిలో మెదులుతారు. నిజానికి అందరు అత్తగార్లు సూర్యకాంతం మాదిరిగా ఉండరనుకోండి. సూర్యకాంతం సినిమాల్లో గయ్యాళి అత్తగారిగా ప్రసిద్ధి కాబట్టి అత్తగార్లు ఆమెలా వ్యవహరిస్తారని అపోహపడతారు. అయితే కొందరు…

'అత్తగారు' అనగానే సినిమా అత్తగారు సూర్యకాంతం మదిలో మెదులుతారు. నిజానికి అందరు అత్తగార్లు సూర్యకాంతం మాదిరిగా ఉండరనుకోండి. సూర్యకాంతం సినిమాల్లో గయ్యాళి అత్తగారిగా ప్రసిద్ధి కాబట్టి అత్తగార్లు ఆమెలా వ్యవహరిస్తారని అపోహపడతారు. అయితే కొందరు మాత్రం సగటు అత్తగారిలా, సూర్యకాంతంలా వ్యవహరిస్తారు. బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జేడీ పార్టీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ భార్య రబ్రీదేవి మాత్రం సూర్యకాంతం టైపు అత్తగారేనని ఆమె కోడలు ఐశ్వర్యారాయ్‌ చేసిన ఫిర్యాదుబట్టి అర్థమవుతోంది. అన్నట్లు రబ్రీదేవి కూడా బిహార్‌ మాజీ ముఖ్యమంత్రేనని తెలిసిందే కదా. ఈమె ఒక్కసారి కాదండీ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పీఠం అలంకరించింది కదా. వంటింట్లో వంట చేసుకునే ఈమెకు అంతటి అదృష్టం పట్టడం భారత రాజకీయాల్లో అత్యంత విచిత్రమే కాదు, అత్యంత నికృష్టం కూడా. 

సరే…దాన్నలా పక్కన ఉంచుదాం. ఇక అసలు విషయానికొస్తే అత్త పాత్రలో రబ్రీదేవి సాగించిన దౌర్జన్యాన్ని, వేధింపులను గురించి కోడలు ఐశ్వర్యారాయ్‌ పట్నా సెక్రటేరియట్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఐశ్వర్యారాయ్‌ లాలూ కుటుంబంలో పెద్ద కోడలు. అంటే పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ (మాజీ మంత్రి) భార్య. ఈ దంపతులు త్వరలో విడిపోతున్నారులెండి. విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. వీరి పెళ్లి గత ఏడాది మే 12న జరిగింది. అదే ఏడాది నవంబరులో విడాకుల కోసం కోర్టుకెక్కారు. వివాహమైన కొన్నాళ్లకే భర్త తేజ్‌ప్రతాప్‌ దుర్మార్గాలు, అత్త రబ్రీదేవి వేధింపులు అనుభవంలోకి వచ్చాయి.  రబ్రీ కూతురు మీసా భారతి కూడా వేధింపుల్లో భాగస్వామేనని గతంలో వార్తలొచ్చాయి. 

మీసా భారతి తనను చాలా వేధించిందని, తనను ఇంట్లోంచి బయటకు గెంటేసిందని మీడియాకు చెప్పింది. ఐశ్వర్యారాయ్‌ కథనం ప్రకారం…తేజ్‌ప్రతాప్‌ మాదకద్రవ్యాలకు బానిస. గంజాయి ప్రియుడు. వారు విడిపోవడానికి ఇంతకు మించిన కారణాలేముంటాయి? భర్తను భరించలేని స్థితి ఏర్పడింది. కొడుకుకు కోడలు విడాకుల ఇవ్వడం రబ్రీకి ఇష్టంలేదు. మామూలుగానే కోడలిని వేధిస్తున్న ఈ మాజీ ముఖ్యమంత్రి విడాకులు తీసుకుంటానని చెప్పడంతో బాగా కొట్టి బయటకు నెట్టేసింది. రబ్రీదేవి కోడలిని అసభ్యంగా తిట్టింది. జుట్టుపట్టుకొని కొట్టింది. కింద పడేసి తన్నింది. కర్ర తీసుకొని తల మీద, మోకాళ్ల మీద, పాదాలపైన కొట్టింది. సెక్యూరిటీవాళ్లతో ఇంటి నుంచి బయటకు గెంటేయించింది. ఫోన్‌ సహా కోడలి వస్తువులన్నీ లాక్కుంది. 

రబ్రీదేవి, తేజ్‌ ప్రతాప్‌ నిర్వాకాలను  ఐశ్వర్య మీడియా ముందు టాంటాం చేసింది. గతంలో రబ్రీదేవి కోడలిని ఇంట్లోకి రానివ్వలేదు. చివరకు పోలీసుల జోక్యం అవసరమైంది. అప్పట్లో ఏడు గంటలపాటు హైవోల్టేజ్‌ డ్రామా నడిచింది. ఈ ఏడాది సెప్టెంబరులో ఐశ్వర్య అత్తగారి వైఖరికి నిరసనగా ఇంటి ముందు కొన్ని గంటలపాటు బైఠాయించింది.  చివరకు డీజీపీ జోక్యం చేసుకొని సర్దుబాటు చేశారు. ఐశ్వర్యారాయ్‌ కుటుంబం తక్కువది కాదు కదా. ఆమె తండ్రి చంద్రికారాయ్‌ ఎమ్మెల్యే. ఆమె తాత మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్‌. బాగా పలుకుబడి ఉన్న రాజకీయ కుటుంబం. 

కూతురుకు వేధింపుల సంగతి తెలుసుకొని తండ్రి ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. లాలూ కుటుంబంలో 'రచ్చ' చాలాకాలం క్రితమే మీడియాలో వెలుగు చూసింది. ఇక తేజ్‌ ప్రతాప్‌ చదువు ఇంటర్మీడియట్‌తో ఆగిపోయింది. డిగ్రీ మొదటి సంవత్సరం ఫెయిలయ్యాడు. ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఐశ్వర్యారాయ్‌ ఎంబిఏ చదువుకున్న విద్యాధికురాలు.