రాజకీయ నైరాశ్యం

అధికార పక్షం గప్‌చిప్ విపక్షాల నిర్వేదం స్తబ్దుగా పార్టీలు Advertisement రాజకీయం ఎపుడూ వేడిగానే ఉండాలి. హాట్ టాపిక్‌గానే సాగాలి. నిత్యం మంచికో, చెడ్డకో జనం నోళ్లలో నానాలి. లేకపోతే ఆ పార్టీని, నాయకున్ని…

అధికార పక్షం గప్‌చిప్
విపక్షాల నిర్వేదం
స్తబ్దుగా పార్టీలు

రాజకీయం ఎపుడూ వేడిగానే ఉండాలి. హాట్ టాపిక్‌గానే సాగాలి. నిత్యం మంచికో, చెడ్డకో జనం నోళ్లలో నానాలి. లేకపోతే ఆ పార్టీని, నాయకున్ని మరచిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ సంగతి రాజకీయ నాయకులకు బాగా తెలుసు. అందుకే ప్రతీ రోజూ ఏదో వ్యాపకం పెట్టుకుంటూనే ఉంటారు. అయిన దానికీ కాని దానికీ నోరు చేసుకుంటూనే ఉంటారు. పార్టీ దుకాణాలు తెరుస్తూనే మసాలా వార్తలను వండి వార్చేందుకు సిద్ధంగా ఉంటారు. విభజన ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమైన నగరంగా ఉన్న విశాఖపట్నంలో రాజకీయం కూడా అలాగే ఉంటుంది. కానీ, ఇటీవల కొన్ని రోజులుగా పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. . ఏదో జరుగుతుందనుకున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఏకగ్రీవంగా ముగిశాక ఇపుడు పార్టీ శిబిరాలన్నీ నిశ్శబ్దమైపోయాయి. ఇంకా చెప్పాలంటే నైరాశ్యం నీడన చేరాయి. అధికార పక్షం ఓటుకు నోటు అలజడితో సతమతమవుతూంటే, వైసీపీ యథాప్రకారం అయోమయంలో పయనిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్  జాతీయ పార్టీలు అలికిడి కూడా ఎక్కడా లేదు.  మొత్తం మీద మబ్బు పట్టిన ఆకాశంగా స్తబ్దుగా  జిల్లా రాజకీయం చడీ చప్పుడూ లేకుండా ఉంది.

ఆ దూకుడుకు బ్రేక్

అధికార తెలుగుదేశం పార్టీ గత ఏడాది కాలంగా విశాఖ జిల్లా కేంద్రంగా దూకుడుగానే రాజకీయాలు చేస్తూ వచ్చింది. ఏ జిల్లాకు వెళ్లని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు డజనుకు పైగా విశాఖ పర్యటనలు చేశారు. మొత్తం మంత్రివర్గంలో ప్రతీ ఒక్క మంత్రి విశాఖకు చాలాసార్లు వచ్చి వెళ్లారు. టీడీపీ సీనియర్ నాయకులైతే విశాఖ కేంద్రంగా రోజుకో కార్యక్రమం నిర్వహించారు కూడా. అయితే, ఏడాది పాలన ముగిసీ ముగియకుండానే పరిస్థితిలో మార్పు వచ్చింది. ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరుక్కున్నట్లుగా వార్తలు రావడంతో తమ్ముళ్లు సైలెంట్ అయిపోయారు. మొదట్లో కేసీఆర్, జగన్‌ల దిష్టిబొమ్మలు దహనం చేసినా తరువాత ఆ వ్యవహారం ఇంకా ముందుకు పోవడంతో గప్‌చిప్ అయిపోయారు. మరి, అధిష్టానం ఆదేశాలో, లేక మరే కారణమో తెలియదు కానీ, మీడియా ముందుకు తరచుగా వచ్చే టీడీపీ నాయకులు కూడా ఇపుడు తప్పించుకుని తిరుగుతున్నారు. పార్టీ కార్యక్రమాలు దాదాపుగా ఆగిపోయాయి. ఇక, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం వీలైనంత వరకూ తక్కువగానే కనిపిస్తున్నారు. బాబు పర్యటన ఇప్పటికి రెండుమార్లు విశాఖలో జరగాల్సింది వాయిదా పడింది. పలు రకాలైన కారణాలతో టీడీపీలో ఇపుడు నిశ్శబ్దం తాండవిస్తోంది. 

అధికారంలోకి వచ్చి ఏడాది అయినా కూడా తమ్ముళ్లకు ఎటువంటి నామినేటెడ్ పదవులు లేకపోవడం, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా అర్హులైన వారెంతోమంది ప్రయత్నం చేసినా కూడా అధినాయకత్వం తాను అనుకున్న వారికే టిక్కెట్లు ఇవ్వడంతో సీనియర్లతో పాటు, చాలా మంది నాయకులు అలిగి పక్కకు తప్పుకున్నారు. ఇక, బీసీల నుంచి అనేకమంది ఎమ్మెల్సీ కోసం, ప్రభుత్వ పదవుల కోసం యత్నించినా కూడా మొండి చేయి చూపడంతో వారు కూడా నిరాసక్తతలో ఉన్నారు. దానికి తోడు చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారం కూడా కథలు కధలుగా చెప్పుకుంటూండడంతో ఏ క్షణం ఏమి జరుగుతుందోనని తమ్ముళ్లలో ఆందోళన కనిపిస్తోంది. పుణ్యకాలం గడచిపోయింది, పదవులు లేవు, ఇపుడు చూస్తే బాబు సంక్షోభంలో చిక్కుకున్నారు. దానిని దాటి బయటకు వస్తేనే తప్ప ఏమీ ఆలోచన చేసే స్థితిలో లేరు, ఇపుడు మధ్యలో మనం ఏం చేసినా ఏం ప్రయోజనం అన్న వేదాంత ధోరణిలోకి తమ్ముళ్లు ఉన్నారు. అందుకే పార్టీ కార్యక్రమాలు కూడా కనిపించడంలేదు. జిల్లాలో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించే పెద్ద దిక్కుగా ఇన్‌చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నా ఆయన కూడా ఓటుకు నోటు వ్యవహారంపైనే దృష్టి సారించడంతో జిల్లాకు రావడం మానుకున్నారు. నెలలో ఒకసారి అయినా జిల్లాకు వచ్చే మంత్రి నారాయణ కూడా కనిపించడంలేదు. మొత్తం మీద చూసుకుంటే టీడీపీలో ఏదో జరుగుతోందని తమ్ముళ్లు కలవరపడుతున్నారు. ఏం జరగబోతోంది, అది మంచికా చెడుకా అన్న ఆలోచనలతో వారు సతమతమవుతున్నారు. దాంతో, పసుపు శిబిరం కాస్తా కళ తప్పింది.

వైసీపీదీ అదే తీరు

వైసీపీ కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతోనే నిరాశ నిండా కమ్ముకున్న పార్టీ నాయకులు గత ఏడాదిగా పెద్దగా జనంలో కనిపించింది లేదు. అధినేత జగన్ వస్తేనే తప్ప పార్టీ కార్యాలయాన్ని కూడా చూసిన పాపాన పోరు. అటువంటి పార్టీలో ఇటీవల కాలంలో  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పుణ్యమాని కొంత కదలిక వచ్చింది. చెట్టుకు పుట్టకు చెదిరిన నాయకులందరినీ ఓ త్రాటిపైకి విజయసాయిరెడ్డి తీసుకువచ్చారు. పార్టీకి దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. దాంతో, అధికార పార్టీపై ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తూ వైసీపీలో ఇటీవల కొంత చురుకుదనం కనిపించింది. కానీ, మధ్యలో పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను  వైసీపీలో చేర్చుకోవడంతో జిల్లా వైసీపీ రాజకీయాలలో మార్పు కనిపిస్తోంది. బొత్సను విజయనగరం జిల్లాకు కాకుండా విశాఖ జిల్లా బాధ్యతలు చూస్తారని అన్యాపదేశంగా రాష్ట్ర నేతలు చెప్పడంతో జిల్లా వైసీపీ నాయకులు డీలా పడ్డారు. 

జూనియర్ అయినా కూడా జిల్లాలో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్న జిల్లా అధ్యక్షుడు గుడివాడ గురునాధరావు కూడా ఈ మధ్యకాలంలో తన వేగాన్ని తగ్గించారు. అలాగే, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్ వంటి వారు కూడా పార్టీ పట్ల ఆసక్తిని తగ్గించారు. మిగిలిన సీనియర్ నాయకులు కూడా పెద్దగా కనిపించకుండా పోయారు. బొత్స రాక పట్ల వైసీపీలో వ్యతిరేకత వల్లనే ఇదంతా అన్నది తెలిసి కూడా అధినాయకత్వం తగిన చర్యలను చేపట్టకపోవడం వల్ల మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. పక్క జిల్లా నాయకునికి ఇక్కడ బాధ్యతలు అప్పగిస్తారనడం ఏమిటని వైసీపీ నాయకులు గుస్సా అవుతున్నారు. తాము అంత శక్తి లేని వారమా, అసమర్దులమా అని వారు వాపోతున్నారు. దీనిపై అధినాయకత్వం సరైన క్లారిటీని ఇస్తే తప్ప కార్యరంగంలోకి దూకరాదని పలువురు నాయకులు ఒట్టు పెట్టుకుని మరీ పార్టీకి దూరం పాటిస్తున్నారు. 

దీనికి తోడు వైసీపీ అధినేత జగన్ తీసుకుంటున్న కొన్ని రాజకీయ నిర్ణయాలు కూడా పార్టీ నాయకులకు, శ్రేణులకు మింగుడు పడడంలేదు. ఆంధ్రా ప్రజానీకం తీవ్రంగా ద్వేషిస్తున్న టీఆర్‌ఎస్ అధినేత, తెంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జగన్ బాహాటంగా మద్దతు ఇవ్వడాన్ని పార్టీలోనే తప్పు పడుతున్నారు. ఇది తప్పుడు సంకేతాలు ఇస్తుందని, జనం మనోభావాలకు వ్యతిరేకంగా పార్టీ వెళ్తోందన్నది కనుక ఒకసారి ప్రజలలోకి వెళ్తే తిరిగి మద్దతు పొందదం కష్టమన్నది పార్టీ నేతల భావనగా ఉంది. అలాగే, సెక్షన్ 8విషయంలో కూడా వైసీపీ ఇంతవరకూ నోరు మెదపకపోవడం, టీడీపీ దానిని ప్రచారంగా మార్చుకుని విమర్శలు గుప్పించడం వల్ల కూడా పార్టీ నాయకులు ఇరకాటంలో పడుతున్నారు. సీమాంధ్రులకు హైదరాబాద్‌లో రక్షణ కల్పించాల్సిన బాధ్యతపై సెక్షన్ని డిమాండు చేయాల్సింది పోయి అది సమస్యే కాదన్నట్లుగా పార్టీ పెద్దలు మాట్లాడడాన్ని కూడా జిల్లా నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రకమైన చర్యల వల్ల మళ్లీ జనంలో చెడ్డ పేరు వస్తుందని కూడా భయపడుతున్నారు. మరి, ఈ విషయాలపై అధినేత ఏ విధంగా ఆలోచన చేస్తారో, పరిష్కారం చూపుతారో అన్న దాని బట్టే వైసీపీ కార్యచరణ జిల్లాలో ఆధారపడి ఉంటుంది.

వాడిన కమలం

బీజేపీకి జిల్లాలో బలం, బలహీనత ఆ పార్టీ ఎంపీ హరిబాబే. ఆయనే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కావడంతో గత ఏడాది కాలంగా ఆయనపై జిల్లా ప్రజానీకం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, చివరికి అవి వమ్ము కావడంతో బీజేపీ పట్ల ఆదరణ నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ఇక పార్టీ కూడా ఈ సంవత్సర కాలంలో ఏ మాత్రం బలపడలేదు, కొత్త నాయకులు చేరుతారన్న ప్రచారం తప్ప చేరిందీ లేదు. కొణతాల రామకృష్ణ వంటి వారిని దువ్వినా కూడా వారు సైకిల్ ఎక్కేందుకే ఇష్టపడుతున్నారు. ఇక, కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ వల్ల ఉత్తరాంధ్రకు ప్రత్యేక పాే్యకజి రాలేదన్న అసంతృప్తి ఉంది. అలాగే, విశాఖకు ప్రత్యేక జోన్ ఇవ్వలేదన్న అలకా ఉంది. గత నెలలో విశాఖ వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు కనీసమాత్రంగా కూడా ఆ దిశగా ఆశలను కల్పించలేకపోయారు. దీంతో, బీజేపీ శిబిరంలో నిరాశ నిస్పృహలు తాండవిస్తున్నాయి. విశాఖ ఎంపీగా హరిబాబు ఉన్నా మిగిలిన బీజేపీ నాయకులకు ఏ అధికార పదవులూ లేవు. కేంద్రంలోని నామినేటెడ్ పదవులపైనా, టీడీపీలో పొత్తులో భాగంగా ఇక్కడ పదవులపైనా కమలనాధులు ఆశలు పెట్టుకున్నా అవి అవిరి అయ్యాయి. దాంతో,  ఉన్న నాయకులే చడీ చప్పుడు లేకుండా ఉన్నారు. మోడీ సర్కార్ ఏర్పాటైన కొత్తలో పలుమార్లు వెంకయ్యనాయుడు విశాఖ పర్యటనకు వచ్చేవారు. దాంతో, స్మార్ట్ సిటీ, మెట్రో రైలు ఇలాంటి ఆశలెన్నో మోసులెత్తాయి. ఇపుడు ఆయన కూడా తన రాకపోకలను బాగా తగ్గించుకున్నారు. దాంతో, బీజేపీ శిబిరంలో ఇపుడు నిశ్శబ్దంగా ఉంది. జీవీఎంసీ ఎన్నికలు వస్తే తప్ప కేడర్‌లో కదలిక వచ్చే అవకాశం లేదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు.

కుంచించుకుపోతున్న హస్తం

ఏడాది కాలం కేలండర్‌లో తిరిగినా కూడా జనంలో మాత్రం కాంగ్రెస్‌పై ఆగ్రహం చల్లారలేదు. పైపెచ్చు ఎన్నడూ లేని విధంగా కేడర్ కూడా కాంగ్రెస్‌ను పెద్ద ఎత్తున వీడిపోయింది. దాంతో, ఇపుడు జిల్లాలో హస్తవ్యస్తంగా కాంగ్రెస్ పనితీరు ఉంది. ఈ మధ్యకాలం వరకూ తరచూ విశాఖ జిల్లా పర్యటనకు వచ్చే పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి పొరుగున ఉన్న విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ రూపంలో షాక్ ఎదురైంది. బొత్సతో పాటు విశాఖ జిల్లా నుంచి ఆయన సామాజిక వర్గం నాయకులు పలువురు వైసీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. అలాగే, శ్రీకాకుళం జిల్లాలోనూ కొందరు మాజీ మంత్రులతో సహా, కాంగ్రెస్‌ను వీడుతారని ప్రచారం నేపధ్యంలో రఘువీరా తన పర్యటనలు తగ్గించుకున్నారు. ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా జనంలో స్పందన లేకపోవడం ఉన్న నాయకులు కూడా వేరే వైపులకు చూడడంతో కాంగ్రెస్ ఒకనాటి జాతీయ పార్టీగా గత కాలం వైభవాన్ని తలచుకుని విలపిస్తోంది. ఆ పార్టీ కార్యక్రమాలు అంటూ పెద్దగా లేకుండా పోయాయి.  వామపక్షాల తీరు అలాగే ఉంది. పూటకో ధర్నా చేపట్టే వామపక్షాలు కూడా మారిన రాజకీయాలలో తమ పాత్ర ఏమిటో అర్ధం కాక మౌనాన్ని ఆశ్రయించాయి. మొత్తం మీద చూసుకుంటే జిల్లాలో రాజకీయం చప్పచప్పగా ఉందని చెప్పుకోవాలి.
    
పివిఎస్‌ఎస్ ప్రసాద్
విశాఖపట్నం.