దేశంలో రెండు ముఖ్య ఘటనలు జరుగుతున్నాయి. ఈ రెండూ సంచలనాత్మకమే. చర్చనీయాంశమే. ఒకటి…హైదరాబాదులో వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టు, సుప్రీం కోర్టు రెండూ విచారణ ప్రారంభిస్తున్నాయి. రెండు కోర్టుల్లోనూ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా పిటిషన్‌లు దాఖలయ్యాయి కాబట్టి రెండు కోర్టులు వాటిని విచారణకు స్వీకరించి విచారణ మొదలుపెట్టబోతున్నాయి. సుప్రీం బుధవారం విచారణ ప్రారంభిస్తుండటంతో, హైకోర్టు ఈరోజు జరగాల్సిన విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఇక ఇదే సమయంలో ఢిల్లీ నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఈ నెల 16వ తేదీన ఉదయం 5 గంటలకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. 2012 డిసెంబరు 16న జరిగిన ఈ ఘటనలో దోషులకు 2019 డిసెంబరు 16న శిక్ష అమలు చేయడం విశేషం. బహుశా ఇది యాదృచ్ఛికమే కావొచ్చు. ఘటన జరిగిన ఏడేళ్లకు దోషులకు శిక్ష అమలు చేస్తున్నారు. ఉరిశిక్షను సుప్రీం కోర్టు సమర్థించిన నేపథ్యంలో దోషులను ఎప్పుడో ఉరి తీయాల్సింది. కాని జరగలేదు. హైదరాబాదు ఎన్‌కౌంటర్‌లో హతమైనవారు నలుగురే. నిర్భయ ఘటనలో ఉరికంబం ఎక్కబోతున్నవారూ నలుగురే.
దిశ ఘటనలో నిందితులు లారీలు నడిపే డ్రైవర్లు, క్లీనర్లు కాగా, నిర్భయ ఘటనలో దోషులు బస్సులో పనిచేసేవారు. కాకపోతే ఈ కేసులో నిందితులు ఆరుగురు కాగా, విచారణ దశలోనే ఒకడు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు మైనర్ కావడంతో జువైనల్ హోంకు పంపి మూడేళ్ల శిక్ష తరువాత విడుదల చేశారు. వాడు అలా బతికి బయటపడ్డాడు. చివరకు నలుగురు మాత్రం మరణ శిక్షకు సిద్ధమయ్యారు. వీరిని ఉరి తీయడారికి ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. తీహార్ జైల్లో చివరగా ఉగ్రవాది అఫ్జల్‌గురును 2013 ఫిబ్రవరి 9న ఉరి తీశారు. ఇతను భారత పార్లమెంటు మీద దాడి కేసులో దోషి అనే సంగతి తెలిసిందే. ఇక నిర్భయ కేసులో దోషులను ఉరి తీయడానికి తలారీ కోసం తీహార్ జైలు అధికారులు అన్వేషిస్తున్నట్లు సమాచారం.
తలారీ అనేది శాశ్వత ఉద్యోగం కాదు. ఉరిశిక్షలు ఎప్పుడో ఒకప్పుడు తీవ్రాతి తీవ్రమైన కేసుల్లోనే విధిస్తారు కాబట్టి ఆ శిక్ష అమలు చేయడానికి తలారీ కోసం అన్వేషించాల్సిందే. ఉరిశిక్ష అమలు చేసే వ్యక్తులు (తలారీ) దేశంలో చాలా అరుదుగా ఉన్నారు. ఇదిలా ఉండగా, నిర్భయ కేసులో దోషులను ఉరి తీస్తామంటూ ఇద్దరు ముందుకు వచ్చారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రవి కుమార్, తమిళనాడుకు చెందిన పోలీసు కానిస్టేబుల్ సుభాష్ శ్రీనివాసన్ రాష్ట్రపతికి, తీహార్ జైలు అధికారులకు లేఖలు రాశారు. మరి అధికారులు వీరిని పరిగణనలోకి తీసుకుంటారో లేదో తెలియదు.
ఇదిలావుండగా, వెంటనే 10 ఉరితాళ్లను సిద్ధం చేయాలని బీహార్‌లోని బక్సర్ జైలుకు ఉన్నతాధికారుల నుంచి సందేశం అందింది. ఈ 10 ఉరితాళ్లను ఈ నెల 14వ తేదీ నాటికి సిద్ధం చేయాలని కోరారు. ఈ ఉరితాళ్లు నిర్భయ దోషులను ఉరితీయడానికి ఉపయోగిస్తారేమో…! బక్సర్ జైలు ఉరి తాళ్లు తయారుచేయడంలో ప్రసిద్ధి. ఇక్కడి నుంచే దేశంలోని జైళ్లకు ఉరితాళ్లు సరఫరా చేస్తారు. ఉరితాళ్లు తయారుచేయాల్సిందిగా తమకు సందేశం అందినమాట వాస్తవమేనని, కాని అవి దేనికి ఉపయోగిస్తారో తెలియదని బక్సర్ జైలు సూపరింటెండెంట్ విజయ్ కుమార్ చెప్పారు.