వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పెటోడు డాష్ డాష్ అన్నట్టుంది వ్యవహారం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై 'అక్రమాల పుట్ట' అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సందర్భంలో, ఆ టీటీడీ బోర్డ్ సభ్యులు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడికి భక్తులు ఇచ్చిన గొప్ప గొప్ప కానుకల్ని (ఆభరణాల్ని) పరిశీలించేసి, 'క్లీన్ చిట్' ఇచ్చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ఆరోపణలు వచ్చింది, టీటీడీ పాలక మండలి మీద. ఆ పాలక మండలిని నియమించి, తెలుగుదేశం ప్రభుత్వమ్మీద.
టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపణల నేపథ్యంలో, సీబీఐ విచారణ జరగాలా.? ఇంకో తరహా విచారణ ఏమన్నా జరగాలా.? అన్నది వేరే విషయం. వాస్తవాలైతే ప్రజలకు తెలియాల్సి వుంది. టీటీడీ అంటే, అది అధికార పార్టీ 'తొత్తు' కాదు కదా.! వేల కోట్ల సంపద తిరుమల తిరుపతి దేవస్థానం సొంతం. కోట్ల రూపాయల విలువైన కానుకల్ని ఇచ్చే భక్తులున్నారు వెంకటేశ్వరస్వామికి. వంద ఏళ్ళనాటి కానుకలకు సంబంధించిన అనుమానాలు వెల్లువెత్తుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో టీటీడీ బోర్డు సభ్యులు 'పరిశీలించి' క్లీన్ చిట్ ఇచ్చేస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటి వుండదు.
నిన్న సాయంత్రం తూతూ మంత్రంగా టీటీడీ బోర్డు సభ్యులు ఆభరణాల్ని పరిశీలించి వచ్చేశారట. వందల ఏళ్ళ నాటి ఆభరణాల్ని.. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో వుండాల్సిన ఆభరణాల్ని.. అరగంట సమయంలోనో, గంట, రెండు గంటల సమయంలోనో పరిశీలించి, ఓ నిర్ధారణకు వచ్చేయడమంటేనే, అక్కడ ఏదో 'మతలబు' జరిగిందనే విషయం స్పష్టమవుతోంది.
రమణ దీక్షితులు వెనకాల బీజేపీనో, వైఎస్సార్సీపీనో వుందనే అనుకుందాం. అయితే మాత్రం, ఆరోపణలు వచ్చినప్పుడు నిజాలు నిగ్గు తేల్చాల్సిందే కదా.! పైగా అది శ్రీవారికి సంబంధించిన ఆభరణాలకు సంబంధించిన వ్యవహారం. తెలుగు రాష్ట్రాల నుంచి, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచే కాదు, ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకి వచ్చి, మొక్కులు చెల్లించుకుంటుంటారు. అలా మొక్కులు చెల్లించుకునేవారు, కానుకలు వేసేవారు.. ఆ శ్రీవారినే 'పాలకులు' నిలువు దోపిడీ చేసేస్తున్నారంటే జీర్ణించుకోవడం సాధ్యమా.?
శ్రీవారి ఆభరణాలు పక్కదారి పట్టడంపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ప్రతిపక్షంగా వున్న తెలుగుదేశం పార్టీ, సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడేమో, వివిధ రాజకీయ పార్టీలు, టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు.. శ్రీవారి ఆభరణాలపై అనుమానాలు వ్యక్తం చేస్తోంటే, ఇది టీటీడీకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర.. అంటూ ఎదురుదాడికి దిగుతోంది తెలుగుదేశం పార్టీ. టీటీడీ బోర్డు సభ్యులెలాగూ ఆభరణాల పరిశీలనకు వెళ్ళారు.. వారితోపాటుగా, ఆయా పార్టీలకు చెందిన ప్రతినిథుల్ని అయినా ఆ పరిశీలనకు పంపి వుంటే, చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధి బయటపడేది కదా.!