రూపు మారిన తెలుగు రాష్ట్రాలు…!

రాష్ట్ర విభజన నిర్ణయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి, దాన్ని జాతీయ ప్రాజెక్టుగా కూడా ప్రకటించి, ముంపు మండలాలను, గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం…

రాష్ట్ర విభజన నిర్ణయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి, దాన్ని జాతీయ ప్రాజెక్టుగా కూడా ప్రకటించి, ముంపు మండలాలను, గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల భౌగోళిక రూపురేఖల్లో స్వల్ప మార్పులు ఏర్పడ్డాయి. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మ్యాపులను సవరించుకోవల్సిన పరిస్థితి ఏర్పడిరది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లోను, ప్రభుత్వ డాక్యుమెంట్లలోనూ ఉన్న మ్యాపులు ప్రామాణికమైనవి కావని అర్థం చేసుకోవాలి. ఉన్నపళంగా కాకపోయినా త్వరలో మార్చిన మ్యాపులను అందుబాటులోకి తెస్తే ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుంది. మొత్తం రాష్ట్రాల మ్యాపులనే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లా మ్యాపును, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మ్యాపులను సవరించాలి. ఎందుకంటే పోలవరం ముంపు మండలాలు, గ్రామాలు పూర్తిగా ఖమ్మం జిల్లా భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్లలోనే ఉన్నాయి. వాటిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సర్దుబాటు చేసింది. ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపకూడదంటూ తెలంగాణ ప్రభుత్వంతో పాటు పార్టీలు, ప్రజలు ఎంతగా వ్యతిరేకించినా దీనికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించేసింది. ఇప్పుడిక చేసేదేమీ లేదు. 

ఆంధ్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌

పార్లమెంటులో ముంపు గ్రామాలకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆయా మండలాలు, గ్రామాలను తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కలుపుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం…ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లో కలిపారు. ఇక బూర్గంపాడు మండలంలోని సీతారామనగరం, శ్రీధరవేలేరు, గుమ్మనపల్లి, గణపవరం, ఇబ్రహీంపేట, పెద్దరావిగూడెం గ్రామాలను కూడా జంగారెడ్డిగూడెం డివిజన్లో చేరిన కుక్కునూరు మండలంలో కలిపారు. ఇక భద్రాచలం పట్టణం తప్ప మిగిలిన మండలాన్ని రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో కలిపారు. కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం మండలాలను కూడా ఇదే డివిజన్లో విలీనం చేశారు. 

ఇదేం ప్రజాభిప్రాయ సేకరణ?

ఒక జిల్లా నుంచి మరో జిల్లాలో  లేదా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి ప్రాంతాలను విలీనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే చట్ట ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. ప్రజల అభ్యంతరాలను, సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలి. కాని…ముంపు మండలాల విలీనం విషయంలో చట్టం చట్టుబండలైనట్లుగా కనబడుతోంది. విలీనానికి ముందే ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. కాని..ఇక్కడ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తరువాత, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేశాక ప్రజాభిప్రాయ సేకరణ చేయబోతున్నారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియ ముగించాల్సి వుంటుంది. వాస్తవానికి ముంపు మండలాల, గ్రామాల అభిప్రాయం సుస్పష్టంగా ఉంది. తాము ఆంధ్రలో కలిసేది లేదని ప్రజలు ఎప్పుడో చెప్పారు. తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు. ఏది ఏమైనా తాము తెలంగాణలోనే ఉంటామంటూ ఇప్పటికీ మొండికేస్తున్న గ్రామాలు అనేకం ఉన్నాయి. 

ఎమ్మెల్యే తెలంగాణ…సొంతూరు ఆంధ్రలో

భద్రాచలం గిరిజన ఎమ్మెల్యే సున్నం రాజయ్య (సీపీఎం) సొంతూరు సున్నంవారిగూడెం ఆంధ్రప్రదేశ్‌లో కలిసిపోయింది. ఇది వరరామచంద్రాపురం మండలంలో ఉంది. ముంపు గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ రాజయ్య తీవ్రంగా ఆందోళన చేశారు. భద్రాచలం నియోజకవర్గం సీపీఎంకు పట్టున్న మండలం. రాజయ్య ఇక్కడి నుంచి మొన్నటి ఎన్నికల్లో మూడోసారి గెలిచారు. గతంలో 1999, 2004లో విజయం సాధించారు. ఆయనకు ఓట్లేసిన గ్రామాలు ఆంధ్రకు వెళ్లిపోయాయి. పోలవరం ప్రాజెక్టుతో సంభవించిన విచిత్ర పరిణామం ఇది. 

ముంపు మండలాలు ఎవరివి?

ముంపు మండలాలను తెలంగాణ నుంచి అన్యాయంగానో, అక్రమంగానో విలీనం చేసుకోలేదని ఆంధ్ర ప్రభుత్వం చెబుతోంది.    ఈ ప్రాంతాలన్నీ తెలంగాణ`ఆంధ్ర విలీనమై ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పుడు ఇవి గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయని, 1959లో వరంగల్‌ జిల్లాను విడదీసి ఖమ్మం జిల్లా ఏర్పాటు చేసినప్పుడు ఉభయ గోదావరి జిల్లాలను కొన్ని ప్రాంతాలను ఖమ్మం జిల్లాలో కలిపారని అంటోంది. ఇప్పుడు ఆ ప్రాంతాలను వెనక్కి తీసుకున్నాం తప్ప అవి తెలంగాణకు చెందినవి కావని వివరణ ఇస్తోంది. తెలంగాణ వాదన ఇందుకు భిన్నంగా ఉంది. అసలు భద్రాచలం ఆలయం, అదున్న ప్రాంతం కూడా తమదేనని ఆంధ్ర నాయకులు వాదించారు. వాస్తవానికి ఖమ్మం జిల్లా ఏర్పడినప్పుడు అది భౌగోళికంగా విస్తీర్ణంలో చిన్నగా ఉంది. దీంతో దాని విస్తీర్ణం పెంచడానికి, పరిపాలనా సౌలభ్యం కోసం తూర్పు గోదావరి జిల్లాలోని నూగూరు వెంకటాపురం తాలూకాను, పశ్చిమ గోదావరి జిల్లాలోని అశ్వారావుపేట తాలూకాను ఖమ్మం జిల్లాలో చేర్చారు. భద్రాచలం డివిజన్లో భద్రాచలం ఆలయం ఉన్న ప్రాంతం మినహా మిగిలినదంతా తూర్పు గోదావరి నుంచి కలిసిందేనని చెబుతున్నారు. కాని…భద్రాచలం ఆలయం కూడా తూర్పు గోదావరి జిల్లాలోదేనని కొందరి వాదన. అయితే చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే భద్రాచలం ఆలయం తెలంగాణ ప్రాంతంలోనిదేనని చెప్పొచ్చు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా తెలంగాణ విలువైన ప్రాంతాలను కోల్పోయింది. ప్రధానమైన విషయం ఏమిటంటే….చింతూరు మండలంలోని మోతుగూడెంలో ఉన్న సీలేరు జల విద్యుత్‌ ప్రాజెక్టుకు ఆంధ్రకు అప్పగించడం తెలంగాణకు తీరని నష్టం. ఏడాది పొడవునా విద్యుదుత్పత్తి జరిగే ఈ ప్రాజెక్టు ఆంధ్రాకు వరంగా పరిణమించింది.

యథాతథ తెలంగాణ రాలేదు

తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ‘తెలంగాణను ఉన్నదున్నట్లుగా ఇవ్వండి. ఒక్క అంగుళం కూడా ఎక్కవ వద్దు. మేం ఒక్క అంగుళం కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేం’ అని అన్నారు. కాని చివరకు కొంత ప్రాంతాన్ని కోల్పోయిన తెలంగాణను తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడిరది. నిరసనలు వ్యక్తం చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇప్పుడేమీ మాట్లాడటం లేదు. భూభాగాన్ని కోల్పోయామన్న బాధ తెలంగాణవారందరికీ ఉంది. గతంలోనూ తెలంగాణ కొన్ని ప్రాంతాలను కర్నాటకకు, మహారాష్ట్రకు కోల్పోయింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా కొన్ని కీలక తెలుగు ప్రాంతాలు తమిళనాడు, కర్నాటక, ఒరిస్సాలో కలిశాయి. రాష్ట్రాల విభజన సమయంలో ఇలాంటి బాధాకరమైన ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇందుకు అనేక కారణాలు. ఉదాహరిస్తే ఎన్నో గాథలు హృదయ విదారక విషాద చరితలు. అంతే…!

-ఎం.నాగేందర్‌