పక్కింటి పుల్ల కూర ఎప్పుడూ రుచే..అందని ద్రాక్ష పుల్లన అని సరిపెట్టుకోవడం చంద్రబాబుకు చాతకాని విద్య. ఏదో విధంగా అందుకుని తీరాలన్నది ఆయన తపన. పనస పండంటి నిండైనా రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసారు. దాని స్థాయి ఏమిటో ఆయనకు బాగా తెలుసు. అలాంటిది ఇప్పుడు పీలికగా మిగిలిన 13 జిల్లాలనే పాలించాలంటే ఆయనకు ఏదోలా వుంది. పైగా కామధేనువులా మాంచి ఆదాయం ఇచ్చే హైదరాబాద్ తన చేతిలో లేదని తలచుకుంటే చాలు ఆయన కంటికి కునుకురావడంలేదు. ఇవన్నీ కిట్టని మాటలు కాదు. ఆయన అన్నవే. తనకు సరిపడా పని లేదని, కేవలం 13 జిల్లాలు అంటే చాలా తక్కువని ఆయనే చెబుతున్నారు.
నిజానికి విభజన అనివార్యం కాబట్టి, తెలంగాణలో పార్టీని కూడా కాపాడుకోవాలి కనుక, ఆయన ఆ దిశగా అడుగులు వేసారు. కానీ నిజానికి బాబు పచ్చి సమైక్యవాది అన్న సంగతి అందరికీ తెలుసు. సరే, విభజన ఎలాగూ జరిగింది, ఇక అధికారం అక్కడ కూడా అందిపుచ్చుకుంటే ఓ పనైపోతుంది అనుకున్నారు. కానీ ఉద్యమ వేడిలో, రాష్ట్ర సాధన ఊపులో వున్న తెలంగాణ ప్రజానీకం బాబుకు ఆ అవకాశం ఇవ్వలేదు. కానీ బాబు ఆశలు వదలుకోలేదు. వదులుకుంటే ఆయన ఈ స్థాయిలో ఎందుకు వుంటారు.
దీర్ఘకాలిక ప్రణాళికలు, ఎన్నికల మేనేజ్మెంట్,.ప్రత్యర్థికి వ్యతిరేక ప్రచారం..ఇలాంటివి అన్నీ సాగించడంలో ఆయన స్టయిల్ అనితరసాధ్యం. అలాంటి వ్యూహంతోనే కదా ఇప్పుడు సీమాంద్రలో అధికారంలోకి వచ్చింది.. అందుకే మరోసారి తన వ్యూహాలకు పదును పెట్టి, తెలంగాణలో ఎప్పటికైనా అధికారం అందిపుచ్చుకోవాలని ఆయన ముందుకు అడుగేసారు. ఇందుకోసం ఆయన రెండు శక్తులను తెలంగాణపై ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేసారు.. ఆ రెండు శక్తులు..ఒకటి వారసుడు..లోకేష్…రెండవశక్తి..పెయిడ్ ఆర్టిస్టు…పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
లక్ష్యం…తెలంగాణ
ఇప్పుడు బాబు లక్ష్యం సీమాంధ్రను అభివృద్ధి చేయడం ఒక్కటే కాదు. తెలంగాణలో అధికార సాధన కూడా. అధికారం ఎందుకు సాధించాలి అన్నదానికి బాబుకు ఎన్ని కారణాలుండాలో అన్నీ వున్నాయి. హైదరాబాద్‌లో తన వారి కార్యకలాపాలు సజావుగా సాగడం అన్నది ఒక పాయింట్. రెండవది తెలంగాణలో వేరే ప్రభుత్వం వుండడంతో వచ్చే తలనొప్పులు లేకుండా చూసుకోవడం. తెలంగాణలో అధికారం సాధించకపోతే, పార్టీ శ్రేణులను కాపాడుకోవడం కష్టం కావడం. ఎందుకంటే, గడచిన పదేళ్లతో కలుపుకుంటే, తెలంగాణ ప్రాంత పార్టీ నాయకులు ప్రతిపక్షంలో వుండాల్సిరావడం ఇది వరుసగా మూడోసారి కింద లెక్కవుతుంది. అదృష్టవశాత్తూ, పార్టీ తరపున చేయాల్సిన సాయాలు అన్నీ చేస్తున్నారు కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఈపాటి జనమన్నా మిగిలారు. కానీ ఎన్నాళ్లిలా..అందుకే బాబు తెలంగాణపై దృష్టిసారించారు.
అలా అని ఇవ్వాళో, నిన్ననో అని కాదు..మళ్లీ సీమాంధ్రలో అధికారం అందిన నాటి నుంచీ బాబు నోటి వెంట అదే మాట. 2019 నాటికి తెలంగాణలో అధికారంమాదే..ఇదే డైలాగు ఆయన పదేపదే వల్లించారు. అయితే అలా అని బాబు మాటల మనిషి అనుకుంటే తప్పే. ఆయన చేతల మనిషి కూడా. అందుకే..అందుకు తగిన వ్యూహ రచన చేసారు. సీమాంధ్రలో పార్టీని ఎలాగూ తాను చూసుకుంటారు..అందుకనే తెలంగాణ వ్యవహారాలను కొడుకు లోకేష్‌కు అప్పగించారు. లోకేష్‌కు అయితే పగ్గాలు అప్పగించారు కానీ, అక్కడ ఓ చరిష్మా వున్న నాయకుడు అవసరం కదా? ఎవరు? అందుకే సినిమా గ్లామర్ వున్న పవన్ కళ్యాణ్‌ను ఆ పనికి వాడుకోవాలని బాబు డిసైడ్ అయినట్లు రాజకీయ వర్గాల బోగట్టా.
ఇప్పుడు తెలంగాణలో పార్టీ ఆర్థిక వనరులను సుజనా చౌదరి చూస్తారు..నిర్వహణను లోకేష్ తలకెత్తుకుంటారు. అక్కడ ప్రజల మనుసులను దోచే కార్యక్రమాన్ని పవన్ చేపడతారు..ఇదీ త్రిముఖ వ్యూహం.
ఇదేదో గాలిపోగేసిన సంగతి కాదు. జరుగుతున్న సంఘటనలను బేరీజు వేస్తే కనిపించే వాస్తవం. కావాలంటే గమనించండి.,.లోకేష్, పవన్ ఇప్పడు ఎక్కడ తమ దృష్టి కేంద్రీకరించారు..వారు సీమాంధ్రలో ఎందుకు పర్యటించడంలేదు? గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తిగా పవన్ ఇటీవల నగరం గ్యాస్ ప్రమాదం జరిగినపుడు కనీస స్పందన కూడా ఎందుకు తెలియచేయలేదు. అక్కడి వెళ్లి బాధితులను ఎందుకు పరామర్శించలేదు. కానీ యశోదలో తెలంగాణ చిన్నారులను మాత్రం పలకరించారు. అది తప్పు అని కాదు ఉద్దేశం. అక్కడకు వెళ్లనిది..ఇక్కడకు వెళ్లినది..మధ్యలో ఏమిటి గ్యాప్ అన్నదే. ఇప్పుడు జనసేన..వీలయినంత త్వరలో రాజకీయ పార్టీగా అవతరించబోతోంది. బోణీగా హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీకి దిగబోతోంది. సహజంగానే ఇక్కడ కాస్త అనుకూల పరిస్థితి వుంటుంది. సీమాంధ్రులు ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం వుంది కాబట్టి. ఎప్పుడైతే హైదరాబాద్ పరగణాలో తెరాసకు ఝులక్ ఇవ్వగలుగుతారో..వెంటనే ఇక దృష్టి అంతా తెలంగాణ పైనే వుంటుంది. వచ్చే ఎన్నికలనాటికి యుద్ధానికి సిద్ధమవుతారు.
ఇక్కడ పవన్‌ను వాడడానికి కారణం మరో ఆల్టర్నేటివ్ లేకపోవడమే. తెలంగాణలో భాజపాకు కేడర్, నాయకత్వం వున్నాయి కానీ ఓట్లు తెచ్చుకునే సత్తా లేదు. సరైన చరిష్మా వున్న నాయకుడు వుంటే తప్ప కెసిఆర్‌ను ఢీకొనలేరు. అందువల్ల ఇక్కడ పవన్ ఒక్కడే అసలు సిసలు ప్రత్యామ్నాయం.. అయతే కేవలం పవన్‌ను మాత్రం బరిలోకి దింపితే, రేపు అధికారం అంది వచ్చినపుడు తమ మనిషి వుండాలి కదా? అందుకే లోకేష్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఒక విధంగా లోకేష్ పక్కా హైదరాబాదీ. కేసిఆర్ 1956 లెక్కలు పక్కన పెడితే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగారు. అందువల్ల అవసరమైన, సింహాసనం ఎక్కించగలిగితే, సీమాంధ్రలో కాకుంటే అక్కడన్నా ఎక్కించేయచ్చు. అయితే అందుకు ఇప్పటి నుంచీ జనంలో ఓ పాజిటివ్ వేవ్ క్రియేట్ చేయాలి. ఆ దిశగానే ఇప్పుడు లోకేష్ అడుగులు పడుతున్నాయి.
ఎన్నికల సమయంలో కూడా లోకేష్ తెలంగాణ ప్రాంతంపై దృష్టిపెట్టారు. ఇప్పుడు పూర్తిగా అటే మమేకమవుతున్నారు. ఇటీవల రైలు ప్రమాద బాధితులను ఆయన ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. చెక్కులు అందించారు. మరోపక్క తెలంగాణ గ్రామాలకు వెళ్లి అక్కడ ప్రమాద బాధితులను పరామర్శించి, చెక్కులు అందచేసారు. ఇలా ఇప్పుడు లోకేష్ చెక్కులు పట్టకుని నడుస్తున్నారు. బాధితులను ఓదార్చడం, చెక్కులు అందించి వారి మనసులు గెల్చుకోవడం అనే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇది రాత్రికి రాత్రి భవంతి నిర్మించడం లాంటిది కాదు. కష్టపడి సరైన కోట నిర్మించే పని. చంద్రబాబు చేస్తున్నది అదే.
మొత్తానికి పవన్ బాబు, లోకేష్ బాబు ఇప్పుడు సీమాంద్ర గీతకు ఆవలే తమ కార్యకలాపాలు నిర్వహించే పనిలో వున్నారు. పవన్‌ను సీమాంధ్రలోకి దింపే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి ఇప్పట్లోలేదు. ఆయన కూడా అందుకు పెద్దగా ఉత్సాహంగా వున్నట్లు కనిపించడం లేదు. అలా కనిపించి వుంటే, పరిస్థితి వేరుగా వుండి వుండేది.
కెసిఆర్ ఎత్తుగడలు బాబు ఎత్తుగడలు కేసిఆర్ గ్రహించలేకపోలేదు. అందుకే ఆయన మైనారిటీ కార్డును తెగ వాడుతున్నారు. మరోపక్క ప్రజా రంజకమైన విధానాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పార్టీ పరంగా తెలుగుదేశంలో వున్నందున బిసి సంఘ నాయకుడు కృష్ణయ్య కూడా కెసిఆర్ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. తాత్కాలిక సిబ్బంది సర్వీసులు పర్మనెంట్ చేయడం, దానిపై విద్యార్థుల ఉద్యమం వ్యవహారంలో కృష్ణయ్య విద్యార్థుల మాటకే మద్దతు ఇవ్వడం అంటే కెసిఆర్‌ను ఇరుకున పెట్టాలనుకోవడమే. పైగా ఇప్పుడు బాబు నేరుగా తెలంగాణ గురించి మాట్లాడడం లేదు. అధికారంలోకి వచ్చిన కొత్తలో మాదిరిగా 2019నాటికి అక్కడ కూడా తమదే అధికారం అనడం లేదు. పైగా కొత్త స్లోగన్ ఎన్నుకున్నారు. ఎక్కడ వున్నా తెలుగువారిని ఆదుకోవడమే తమ తక్షణ కర్తవ్యం అంటున్నారు. సీమాంధ్ర ముఖ్యమంత్రి అయి కూడా గుంటూరులోనో, విశాఖలోనో, లేదా సీమలోని ముస్లిం పాపులారిటీ ఎక్కువగా వున్న ప్రాంతంలోనో కాకుండా, తెలంగాణ రాజధానిలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. అంటే అర్థం ఏమిటి? హైదరాబాద్ ఎన్నికలకు మైనార్టీలను దువ్వే పనిలో పడ్డారనే కదా?
అయితే బాబు కేవలం తెలంగాణలో కూడా అధికారం సాధించాలనుకోవడం, ఓ రాజకీయ నాయకునిగానా లేక కార్పొరేట్ రాజకీయ నాయకుల లీడర్‌గానా అన్నది ఓ అనుమానం. సీమాంధ్రకు చెందిన బాబు సామాజిక వర్గ నాయకులందరికీ తెలంగాణలో వ్యాపారాలున్నాయి. అక్కడ వ్యాపారం అంటే చిన్న పరిమాణం కాదు. బాబు తెలంగాణలో అధికారంలో వుంటే టీవీ 9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతిలకు ఈ పరిస్థితి వస్తుందా? బ్యాన్ కారణంగా టీవీ 9 నిత్యం లక్షల్లో ఆదాయం కోల్పోతున్నట్లు తెలుస్తోంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యవహారాలువుండనే వున్నాయి. నాగార్జున ఎన్ కన్వెన్షన్ వ్యవహారం ఇంతవరకు వచ్చి వుండేదా?
అందువల్ల బాబుకు తెలంగాణలో అధికారం అందడం అన్నది ఒక్క ఆయనకో, తెలుగుదేశం పార్టీ కో మాత్రమే కాదు, దాన్ని నమ్ముకుని కార్పొరేట్ రాజకీయాలు నడుపుతున్న చాలా మందికి సంబంధించిన సమస్య. అందుకే అందరి అండతో, లోకేష్, పవన్ అస్త్రాలుగా బాబు తెలంగాణ అధికార సాధన దిశగా పావులు కదుపుతున్నారు.
చాణక్య