ఆమె భారతీయ అమ్మాయే. పైగా తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ ఎంబాసిడర్ కూడా! తెలంగాణ గురించి ప్రచారం చేస్తున్నందుకు కోట్లాదిరూపాయల రుసుమును స్వీకరిస్తుంది కూడా! అంతర్జాతీయంగా తాను ఏదైనా టోర్నీలు గెలిస్తే.. హైదరాబాదీ కరతాళ ధ్వనులను, తెలంగాణ ప్రభుత్వ నజరానాలను ఆశిస్తుంది కూడా! ఇంతటి భారతీయ అస్తిత్వ పునాదులు మెండుగా ఉన్న సానియామీర్జా.. పాకిస్తాన్ గెలిచిందంటూ పండగ చేసుకున్నది.
అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే.. సానియా సంతోషంతో చిందులు వేసిన, ఈ పాకిస్తాన్ విజయోత్సాహం భారత్ మీద మాత్రం కాదు. కొందరు క్రీడాభిమానులు కినుక వహించేలాంటి ఈ సంఘటన.. కొలంబోలో.. పాకిస్తాన్ శ్రీలంకల మధ్య క్రికెట్ వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను గెలిచిన పాక్ సిరీస్ చేజిక్కించుకుంది.
తన భర్త పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో కలిసి కొలంబో వెళ్లిన సానియా మీర్జా మాలిక్.. సిరీస్ నెగ్గిన పాక్ క్రీడాకారుల ఆనందోత్సాహాల్లో పాలుపంచుకోకుండా ఉండలేకపోయింది. పాక్ ఆటగాళ్లు ఇర్ఫాన్, అడిల్, ముక్తర్ అహ్మద్, బాబర్ ఆజాం, భర్త మాలిక్‌లతో కలిసి 'అభితో పార్టీ షురు హుయీ హై' పాటకు డ్యాన్సులు చేసింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. వారందరితో కలిసి తన డ్యాన్సులను, పాక్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న వైనాన్ని సానియా మీర్జా వీడియో తీసి.. తన ట్విటర్ ఖాతాలో అందరితోనూ పంచుకోవడం విశేషం.
అయినా సానియా మీర్జా వింబుల్డన్ మహిళల డiబుల్స్ టైటిల్‌ను గెలిచినందుకు భారతీయ టెన్నిస్ అభిమానులతో కలిసి ఈమాత్రం సెలబ్రేట్ చేసుకున్నదో లేదో, ఆమెగెలిచిన ఆనందాన్ని షోయబ్ ఇదే తరహాలో పంచుకున్నాడో లేదో ఇలాంటి వీడియోల సాక్షిగా తెలియదు గానీ.. పాక్ క్రికెట్ గెలిచేసరికి ఆనందం పట్టలేకపోవడం విశేషమే.