సత్తెపెమానకంగా…..మూడు స్కీములూ..ఆరు పథకాలు

'రా బావా..ఏటి సాన్నాళ్లకొచ్చావ్…అసలు అయిపు లేకుండా అయిపోయావేటి' అంటూ ఇంట్లోకెళ్తుంటేనే ఎదురొచ్చాడు బావ వెంకటేశం. Advertisement 'మరేట్నేదు బావా.. మా సిన్నోడు ఇల్లు కట్టాడు కదా..నాలుగు వారాలు వుందారని హైదరాబాద్ ఎల్లొచ్చా…' 'ఎలా గుందేటి…

'రా బావా..ఏటి సాన్నాళ్లకొచ్చావ్…అసలు అయిపు లేకుండా అయిపోయావేటి' అంటూ ఇంట్లోకెళ్తుంటేనే ఎదురొచ్చాడు బావ వెంకటేశం.

'మరేట్నేదు బావా.. మా సిన్నోడు ఇల్లు కట్టాడు కదా..నాలుగు వారాలు వుందారని హైదరాబాద్ ఎల్లొచ్చా…'

'ఎలా గుందేటి హైదరాబాద్'

'ఎలా గున్నా,నాకు మాత్రం మా సెడ్డ దిగులేసిందిరా'

'అదేటి బావా..అలాగనీసేవు..బానేదా..'

'అది కాదెహె..సిటీ అంతా గాలించి చూసినా, మన బాబు గారి ఫొటో గానీ, పోస్టరు గానీ ఒక్కటన్నా వుంటే ఒట్టు'

'చాల్లే అదా బాధ..కెసిఆర్ ఫొటోలు, పోస్టర్లు మన తాన వుంటాయేటి'

'ఆయన పార్టీ అంటే మనతాన లేదు..కానీ మన బాబు గారిది జాతీయ పారిటీ కదా..'

'సెప్పుకోవడానికేం లే..సానా వుంటాది. అది సరే కానీ బావా..కెసిఆర్ డెవెలప్ మెంట్ ఎట్టాగుంది'

'అచ్చం ఇక్కడ బాబు గారి లాగే'

'అంటే…'

'ఇంకేటి..రోజుకో గాలిలో మేడ కట్టడమే'

'అట్టాగంటావేటి బావా..ఆంధ్ర కేమైంది..13 విమానాశ్రయాలు..13 పోర్టులు..మూడు మెట్రోలు..ఇంకా…ఆ..గుర్తు కొచ్చింది..మూడో నాలుగో శిల్పరామాలు..'

'ఇలాంటి లిస్టు అక్కడా వుంది..ఫిల్మ్ సిటీ, ఫార్మాసిటీ..ఆ సిటీ..ఈ సిటీ..ఇంకా మరో రింగు రోడ్డు..కరీంనగర్ ను న్యూయార్క్ చేయడం..ఇంకా..'

'అంటే కరీంనగర్ పేరు న్యూయార్క్ అని పేరు మార్చేత్తారా బావా..'

'కాదెహె..వెర్రి మొకమా..న్యూయార్క్ మాదిరిగా డెవెలప్ మెంట్ చేత్తారన్నమాట,.'

'బావా నాకొ డవుటు..బాబేమో..సింగపూరు..మలేషియా అంటాడు..కెసిఆర్ యేమో..సింగపూరు, న్యూయార్కు అంటాడు..మనకు ఆళ్లే ఆదర్శమా..పెద్ద నగరం చేస్తాం..లేదా ఢిల్లీ, ముంబాయిల్లా చేత్తాం అనరేటి? ఎంతసేపూ పక్కోళ్ల ఊళ్ల ఊసే కానీ, మన స్వంత అయిడియాలు రావా? '

'అది కాదురా యెర్రి మొకమా..అలా చెబితే, జనాలకు ఓ అయిడియా వస్తుందని'

'అట్టాగంటావా..సర్లే..ఏదయినా నీకు హైదరాబాద్ ఎలాగున్నా..నాకు మాత్రం ఆంధ్ర సూపరైపోతోంది అనిపిస్తోంది బావా..'

'అనిపించడమేటి బావా..అయిపోతుంటేనూ..మూడు మెట్రోలు అంటే మాటలా..?మొత్తం హోల్ రాష్ట్రానికే ఎక్కడియినా ఒక్కటే వుంటది..ముంబాయి..బెంగళూరు, ఢిల్లీ అంతటా..అంతెందుకు పూనె, జైపూర్, అంతెందుకు, చాలా స్టేట్ రాజధానిలకే మెట్రోలు లేవు. అలాంటిది మనకి మూడు మెట్రోలు

కానీ బావా నాకో డవుటు..విజయవాడ తిప్పి తిప్పి ఆటోలో తిరిగితే వంద మించి ఖర్చవదు. మరి మెట్రొ దేనికంట బావా..

అంటే విజయవాడ ఒకటే కాదెహె..గుంటూరు, తెనాలి కాణ్ణించి బెజవాడ దాకా నడిపిస్తారన్నామాట.

సర్లే మరి తిరుపతి సంగతేటి బావా..మెట్రొ అవసరమంటావా అక్కడ?

నీ సణుగుడేట్రా బావా..మెట్రోలు వద్దంటావా?

అలా కాదు బావా..అసలు సిటీల్లో రోడ్లు నున్నగా చేసి, రోడ్టుపక్కల అడ్డగోలు పార్కింగులు, దుకాణాలు తీసేసి, పక్కా ఫుట్ పాత్ లు పెట్టి, సిటీ బస్సులు నడిసిస్తే, అసలు ఎలా వుంటుది చెప్పు

సర్లే అలా చేస్తే మన దుకాణవాళ్లకి నష్టం. రోడ్డు పక్క దుకాణాల నుంచి వసూళ్లు చేసుకునే పోలీసులకు కష్టం. సెల్లార్లు అద్దెలకిచ్చేసి, పార్కింగ్ ల బయటపడేసే బిల్డర్లకు ఇబ్బంది. అదే మెట్రో అనుకో…అయిదేళ్ల తరువాత ఏం చేసామంటే చెప్పుకోవడానికి ఏదో ఒకటి వుండాలి కదా.

అది సరే ఎయిర్ పోర్టులేటి బావా..జిల్లాకు ఓటంట..అరె శ్రీకాకుళం, విజనారం కూడా ఎయిర్ పోర్టంట బావా

వురే, పిచ్చి మొకమా..అవి రావాలి కదా? కేంద్రం అనేది ఒకటుంది. ఎయిర్ పోర్టులకు కొన్ని రూల్సు గట్రా వుంటాయి..అవన్నీ అయి వచ్చినపుడు చూద్దారి. 

అయినా బావా..నాకు మరో డవుటొచ్చీసినాది..

చెప్పీ..ఆలీసమెందుకు?

డెవలప్మెంట్ అంటే డబ్బున్నోళ్లకా..మామూలు వొళ్లకా..ఇప్పుడు ఈ ఎయిర్ పోర్టులు, శిల్పారామాలు..బీచ్ పార్కులు, అమ్యూజిమెంట్ పార్కులు ఇయ్యన్నీ జనం డబ్బులు దొబ్బీడానికి కానీ మరెందుకు బావా..హైదరాబాద్ శిల్పారామానికి యెల్లాలంటే ఫ్యామిలీకి కనీసం రెండు వందలు వదిలిపోద్ది లోపలకి పోడానికే. మరెందుకు బావా అయ్యి..అదే కనుక ఫ్యాక్టరీలు కడితే, నలుగురికి ఉద్యోగాలు వస్తాయి కదా..

సర్లే జనాలకు కళ్లకు నదురుగా అన్నీ కనపడల..అప్పుడే డెవలప్ మెంట్ అనుకుంటారు బావా..

సర్లే కానీ..బాబు గారి స్పీచ్ విన్నావా..అసెంబ్లీలో రాజధాని ప్రకటిస్తూ..

ఇన్నా..ప్రింటు తీసి పెట్టా కూడా..

అదెందుకు..

ఈ మధ్య రియల్ ఎస్టేట్ లోకి దిగాడులో మా బుడ్డోడు..అన్ని జిల్లాల్లోనూ వెంచర్లకు మార్కెటింగ్ చేస్తన్నాడు..

అయితే..

దానికి మాంచి బ్రోచరోటి తయారుచేయమన్నాడు..ఇది పనుకొస్తందని ఇవ్వడానికి..ఈ స్పీచు బ్రోచరుగా వేసి, ఏ జిల్లాలో సైటయినా అమ్మేయచ్చు..ఎవరిచేతైనా..ఎక్కడైనా ప్లాటు కొనిపించేయచ్చు..అన్ని జిల్లాలకు అన్నీ వున్నాయి కదా..

భలేగా సెప్పావ్ మావా..నమ్మటట్టుగానే వుంది.

నేనంతే…బాబు గారి మాదిరే…ఎదయినా నమ్మేటట్టే చెబుతా..

చాణక్య

[email protected]